యాదాద్రి భువనగిరి, మార్చి 6 ; పడుతున్న రైతులుచేతికి వచ్చే దశలో నీళ్లు లేక ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అడ్డగూడూరు మండలం బిక్కేరు వాగు ఆధారంగా వరి సాగు చేసిన రైతులు ఇప్పుడు నీళ్లు లేక అల్లాడుతున్నారు. కండ్ల ముందు ఎండిపోతున్న పంటలను చూసి కణికరం చూపని సర్కారుపై పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే వందల ఎకరాల్లో వరి ఎండిపోగా, మిగిలిన కొద్దిపాటి పంటనైనా కాపాడుకునేందుకు వారం పది రోజులు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
(నమస్తే తెలంగాణ) గంధమల్ల రిజర్వాయర్ నుంచి కాళేశ్వరం జలాల విడుదలతో బిక్కేరు వాగు ప్రవహిస్తుంది. ఇది ఆత్మకూరు, మోత్కూ రు మీదుగా అడ్డగూడూరు మండలానికి చేరుకుంటుంది. ఈ మండలంలో తొలుత జానకీపురం నుంచి చిన్నపడిశాల, చిర్రగూడూరు, కోటమర్తి, ధర్మారం మీదుగా లక్ష్మీదేవికాల్వ వరకు ప్రవహిస్తుంది. అటు నుంచి సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కొద్దిరోజుల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు బిక్కేరు వాగు నుంచి నీళ్లు తీసుకొచ్చామంటూ గొప్పగా ప్రచారం చేసుకున్నారు. కొన్ని రోజుల పాటు అరకొరగా నీటిని వదిలినా పెద్దగా లాభం లేకపోయింది. ఇటీవల జలాలు రాకుండా ఎగువన గేట్లు మూసేయడంతో పరిసర గ్రామాల్లో పంటలు ఎండుతున్నాయి.
తొలిసారి ఎండుతున్న పంటలు..
అడ్డగూడూరు మండలంలో రైతులు అధిక శాతం వరి సాగు చేశారు. ఈసారి ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. ఫలితంగా చెరువులు, చెక్ డ్యామ్లు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. దాంతో బోర్లు పోయడం లేదు. పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి బోర్లు వేస్తున్నా నీళ్లు పడడం లేదు. గతంలో బిక్కేరు వాగు వెంట ఎప్పుడూ పంటలు ఎండిన దాఖలాలు లేవు. ఈసారి మాత్రం వాగు వెంబడి ఉన్న పొలాలు కూడా నీళ్లు చాలక ఎండిపోతున్నాయి. ఇప్పటికే వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దాంతో చాలామంది రైతులు పొలాల్లో బర్రెలు, గొర్రెలను మేపుతున్నారు. వారం రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే ఇంకా వందల ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. బిక్కేరు వాగుకు నీళ్లిస్తే చెరువులు, చెక్ డ్యామ్లు జలకళను సంతరించుకుంటాయి. భూగర్భ జలాలు పెరిగి, బోర్లు పోసే అవకాశం ఉంటుందని రైతులు చెబుతున్నారు.
అన్నదాత పోరు బాట
బిక్కేరుకు జలాలను తరలించకపోవడంతో రైతులు పోరు బాట పడుతున్నారు. 10 రోజులపాటు నీళ్లు ఇస్తే మిగిలిన కొద్దిపాటి పంటలైనా చేతికి వస్తాయని చెప్తున్నారు. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లేందుకు ఆందోళన బాట పట్టారు. ఇటీవల జానకీపురంలో ఎండిన వరి పొలంలో రైతులు మందు డబ్బాలతో నిరసన తెలిపారు. నీళ్లివ్వకుంటే ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. ప్రభుత్వం స్పందించి నీళ్లివ్వాలని కోరుతున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే మందుల సామేల్ చొరవ చూపాలని డిమాండ్ చేస్తున్నారు.వారం రోజులు నీళ్లిస్తే పంట చేతికి వస్తుందిమా ఊళ్లోనే బిక్కేరు వాగు వెంట నాకు రెండడెకరాల పొలం ఉంది. మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని మొత్తం ఐదెకరాల్లో వరి సాగు చేస్తుంటాను. ఎన్నడూ సాగునీటికి ఇబ్బందులు లేవు. ఈసారి నీటి ఎద్దడి కారణంగా మూడెకరాల పంట ఎండింది. మరో రెండెకరాలు చివరి దశలో ఉంది. ఇంకో వారంపాటు నీళ్లు ఇస్తే పంట చేతికి వస్తుంది. ప్రభుత్వం స్పందించి నీళ్లిచ్చి ఆదుకోవాలి.
-బోనాల అశోక్, రైతు, జానకిపురం (అడ్డగూడూరు మండలం)
ఎండిన పంటకు పరిహారం ఇవ్వాలి
నేను మూడెకరాలు కౌలుకు తీసుకుని వరి నాటు పెట్టాను. బిక్కేరు వాగులో నీళ్లు లేక పంటంతా ఎండిపోయింది. ఎకరం 40 వేల వరకు నష్టం జరిగింది. మూడెకరాలకు లక్షా 20 వేల వరకు నష్టపోయాను. ఎండిన పంటలకు పరిహారం ఇచ్చి ప్రభుత్వం రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
– ననుబోతు సంపత్, రైతు, జానకిపురం (అడ్డగూడూరు మండలం)