అడ్డగోలు హామీలతో ప్రజలను బురిడీ కొట్టించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ప్రజలకు నచ్చేలా పాలన అందించడమే తమ లక్ష్యమని ఎన్నికల ప్రచారంలో పార్టీ నేతలు ఊదరగొట్టారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే ముఖ్యమన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని ప్రగల్భాలు పలికారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర, నియోజకవర్గస్థాయుల్లో నిరంతరం ప్రజా దర్బార్లు ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పారు. అధికారం చేజిక్కించుకోవడానికి 420 హమీలంటూ అరచేతిలో స్వర్గం చూపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయడంతో పాటు ఏడో హామీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిన్నర కాలంలో ప్రజాస్వామ్యాన్ని అడుగడుగునా ఖూనీ చేస్తూ వస్తున్నారు. పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ను టార్గెట్ చేసుకొని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్ పాలనతో విసుగుచెందిన ప్రజలు బీఆర్ఎస్పై చూపుతున్న ఆదరణను చూసి ఓర్వలేకపోతున్నది. దీంతో కేటీఆర్, హరీశ్‌రావులపై అక్రమ కేసులు పెడుతున్నది.
ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తున్న ప్రజల పక్షాన నిలిచిన పట్నం నరేందర్‌రెడ్డి లాంటి ప్రజా నాయకులను ఆక్కసుతో నిర్బంధించి, అక్రమ కేసుల్లో ఇరికించి జైలుపాలు చేశారు. అధికార పార్టీ హామీలపై బీఆర్ఎస్ నేతలు నిలదీస్తుంటే సమాధానం లేని కాంగ్రెస్ పార్టీ తన అనుచరులతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపై దాడులు చేయిస్తున్నది.
రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలనపై దృష్టి పెట్టకుండా కేసీఆర్ పేరును తుడిచిపెట్టడంపై దృష్టిసారించారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి నమూనాకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి అభివృద్ధి నమూనాను రూపొందించలేకపోయారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మారుస్తూ కాలయాపన చేస్తూ వచ్చారు. అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వకుండా మంత్రులే పొంతనలేని సమాధానాలు ఇచ్చిన తీరును తెలంగాణ సమాజమంతా గమనించింది.
ప్రజాస్వామ్యబద్ధంగా చర్చకు అవకాశం లేకుండా వ్యక్తిగత దూషణలకు మంత్రివర్గం దిగిన తీరును తెలంగాణ ప్రజలందరూ గమనించారు. ఏ అంశం పైనా మంత్రులకు సంపూర్ణ అవగాహన లేదని అసెంబ్లీ వేదికగా స్పష్టమైంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చిల్లర భాష తెలంగాణ సమాజాన్ని విస్మయానికి గురిచేసింది. ఈ ఏడాది కాలంలో కేసీఆర్ పేరు ఎత్తకుండా రేవంత్‌రెడ్డి ప్రసంగం ముందుకు సాగిన దాఖలాలు లేవు. చర్చ మొత్తం గతం గురించి ప్రస్తావించడం తప్ప వర్తమానం గురించి ఊసే లేకుండా పోయింది. గ్రామ సభల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ప్రజలు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఏడాదిలో మూడుసార్లు వినతులు స్వీకరించి ఒరగబెట్టింది ఏమిటని నిలదీస్తున్నారు. సంక్షేమ పథకాలు అందని ప్రజలు ప్రశ్నిస్తుంటే అరకొరగా హాజరైన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల నుంచి సమాధానం లేకుండా పోతున్నది. దీంతో గ్రామ సభలు నిరసన వేదికలుగా మారుతున్నాయి.
ముళ్ల కంచెలు తొలగిస్తాం.. ప్రజా ఉద్యమాలపై ఆంక్షలు ఎత్తేస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ అడుగడుగునా ఆంక్షలు, నిర్బంధాలు, వేధింపులకు గురిచేస్తున్నది. బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో రైతుల పక్షపాతిగా వ్యవహరించి, రైతును రాజు చేసింది. కాంగ్రెస్ మాత్రం రైతుబంధుకు పంగనామాలు పెట్టింది. రుణమాఫీ అరకొరగా చేసింది. రైతులు ధర్నాకు పిలుపునిస్తే అనుమతులు నిరాకరిస్తున్నారు. ప్లెక్సీలు చించివేస్తున్నారు. దాడులు చేస్తున్నారు. సభలు, సమావేశాలు పెట్టుకోవాలన్నా, ధర్నా చేయాలన్నా న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొన్నది. బీఆర్ఎస్ ఇప్పటి వరకు చేపట్టిన ధర్నాలన్నీ న్యాయస్థానం అనుమతితో చేసినవే కావడం గమనార్హం. తాజాగా, రైతుబంధు రాలేదన్న రైతు వీడియోను ప్రసారం చేసినందుకు ఇద్దరు మహిళా జర్నలిస్టులు రేవతి, తన్విలను పోలీసులు అరెస్ట్ చేశారు. నియోజకవర్గాలకు మంత్రులు వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు నిర్బంధిస్తున్నారు. ప్రజా సం ఘాల నేతలను సైతం అక్రమంగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఫార్మా కంపెనీలను వ్యతిరేకించిన లగచర్ల రైతులపై లాఠీ లు ఝళిపించారు. ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాటంలో భాగమైన ప్రజలపై నిర్బంధకాండను కొనసాగించారు. ప్రజాస్వామ్య సంస్కృతికి పాడె కడుతున్నారు.