గద్వాల, సెప్టెంబర్ 5 : జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని పరుమాల శివారులో 41 ఎకరాల్లో రూ.85 కోట్లతో 1,275 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి బీఆర్ఎస్ సర్కారు శ్రీకారం చుట్టింది. జీప్లస్గా.. ఒక్కో బ్లాక్‌లో 24 నిర్మాణాలు చేపట్టి 90 శాతం పనులు పూర్తి చేసింది. 10 శాతం ఇండ్లకు మౌలిక వసతులు కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సుమారు 20 నెలల సమయం పట్టింది. ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని నాటి కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు.
దరఖాస్తుదారులకు నిజంగా ఇండ్లు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని వార్డుల వారీగా అధికారులను నియమించి పూర్తి స్థాయి విచారణ చేసి లబ్ధిదారులను గుర్తించి.. డిప్ ద్వారా ఎంపిక చేశారు. అయితే అంతలోనే అసెంబీల ఎన్నికల కోడ్ రావడం.. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. దాదాపు రెండేండ్ల తర్వాత పనులు పూర్తవగా.. అర్హులకు అందించేందుకు సర్వం సిద్ధమైంది. అయితే కేసీఆర్ ప్రభుత్వం పనులు చేపడితే.. నేటి సర్కారు గృహ ప్రవేశాలు చేయించడం చూస్తే.. ‘సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది’.. అన్న సామెత గుర్తొస్తున్నది. పనులన్నీ నాడు పూర్తి చేస్తే నేడు కాంగ్రెస్ ప్రారంభించి క్రెడిట్ అంతా కొట్టేయాలని చూస్తున్నదని పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
పరుమాల శివారులో 1,275 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని బీఆర్ఎస్ సర్కారు చేపట్టింది. జీప్లస్గా.. ఒక్కో బ్లాక్‌లో 24 ఇండ్లను నిర్మించారు. 2023 ఏప్రిల్‌లో పేదల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా.. 5,155 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు వారి ఇండ్లకు వెళ్లి పూర్తిస్థాయిలో విచాణ చేయగా.. 3,171 మందిని అర్హులుగా గుర్తించారు. అయితే ఇందులో గతంలో పట్టాలు పొందిన వారు ఉండగా కోర్టును ఆశ్రయించారు. 504 మందిని లక్కీడిప్‌లో వేయలేదు. మిగితా 771 ఇండ్లకు డిప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో గతంలోనే కొందరు ఇందిరమ్మ ఇండ్ల ద్వారా లబ్ధి పొందగా.. 715 మందికి ఇంటి పట్టాలు అందనున్నాయి. ఎట్టకేలకు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, కలెక్టర్ సంతోష్ మౌలిక వసతులు కల్పించడంతో పనులు పూర్తవగా.. శనివారం గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా పట్టాల పంపిణీ జరగనున్నది.
బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తయ్యే సరికి ఎన్నికల కోడ్ రావడంతో లబ్ధిదారులకు కేటాయించలేదు. తర్వాత ప్రభుత్వం మారడంతో గతంలో ఇండ్లకు వేసిన రంగులను ప్రస్తుతం తు డిచే ప్రయత్నాలు మొదలు పెట్టింది. నాడు పింక్తోపా టు బ్లూ కలర్ వేస్తే.. వాటి స్థానంలో మొత్తం తెల్లరంగు పెయింట్‌ను సిబ్బందితో వేయిస్తున్నారు.
మరికొన్ని బ్లాక్‌లకు బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన రంగులే ఉన్నాయి. ఇండ్ల కేటాయింపు తర్వాత ఇందిరమ్మ ఇండ్ల కలర్ వే యాలని సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది. కేసీఆర్ ఆనవాళ్లు చెరపడం ఎవరి తరం కాదని.. రంగులు మార్చిన ంత మాత్రన కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లను కట్టించిందని ఎవరూ చెప్పరని.. కాంగ్రెస్ పాలకులు గుర్తించి గతంలో ఉన్న రంగులను కొనసాగిస్తే బాగుంటుందనేది పలువురి అభిప్రాయం. నేడు లబ్ధిదారులకు కేటాయించనుండ డ ంతో రంగులు వేయడం నిలిపివేశారు. ఎట్టకేలకే కేసీఆర్ సంకల్పం నెరవేరనున్నది.
డబుల్ ఇండ్ల ఎంపికలో రాజకీయ, అధికారుల జోక్యంతో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతున్నది. లక్కీడిప్ ద్వారా 771 మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. ఇండ్ల కేటాయింపునకు వచ్చే వరకు అది కాస్తా 715రు తగ్గింది. డిప్లో ఎంపికైన లబ్ధిదారుల పేర్లు కనిపించకపోవడంతో వారు పాలకుల ఇండ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వీరికి అధికారులు, పాలకులు సరైనా సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్నారు. గతంలో ఇందిరమ్మ ఇండ్లు తీసుకోవడంతో మీ పేర్లు సిస్టంలో తీసుకోవడం లేదని సర్ది చెబుతున్నారు. అయితే 56 ఇండ్లు రాజకీయ నాయకుల అనుచరులకు కేటాయించినట్లు బలమైన ఆరోపణలు ఇండ్లు రానివారు చేస్తున్నారు.
నాలుగు రోజులుగా 715 మందికే ఇండ్లు అందజేస్తామని కలెక్టర్ సంతోష్ వెల్లడించారు. తీరా శనివారం 687 మందికే పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పడంతో అసలు జాబితాలో మరో 28 మంది పేర్లు.. మొత్తం 84 మంది పేరుల గల్లంతయ్యాయి. కాగా రెండు ప్రకటనలు చేయడంతో అర్హులై ఉండి, డిప్లో పేరు వచ్చిన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఏ కారణాలతో జాబితా నుచి పేర్లు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులకు తలొగ్గి జాబితా నుంచి పేర్లను అధికారులు తొలగించినట్లు తెలుస్తున్నది. లక్కీడిప్‌లో ఎంపికైన వారికి ఇండ్లు కేటాయించాలని, లేకుంటే ఆందోళన చేస్తామని బీఆర్ఎస్ నాయకులు హనుమంతు నాయుడు, కుర్వ పల్లయ్యలు హెచ్చరిస్తున్నారు.
డబుల్ ఇండ్ల విషయంలో కాంగ్రెస్ ఆర్భాటం చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లు నిర్మిస్తే వాటిని తామే నిర్మించి ఇచ్చినట్లు ఇక్కడి పాలకులు హడావుడి చేస్తున్నారు. నీటి వసతి, సరైన సీసీ రోడ్లు లేకున్నా స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వస్తుందని భావించి గృహప్రవేశాలకు శ్రీకారం చుట్టినట్లు అర్థమవుతున్నది.