హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కాంగ్రెస్ పాలన.. వింతలు, విచిత్రాలకు నిలయంగా మారింది. హామీలు ఎందుకు అమలు చేయడంలేదని, గత ప్రభుత్వంపై అడ్డగోలుగా అసత్య ప్రచారం ఎందుకు చేశారని జర్నలిస్టులు అడిగితే ప్రభుత్వ పెద్దలు ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకుల అసలు రంగు ఇదా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఆగ్రహాన్ని వ్యంగ్యాస్ర్తాల రూపంలో సంధిస్తున్నారు. వెరసి కాంగ్రెస్ పాలన నవ్వుల పాలయితున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. తాజాగా యూరియా సరఫరా చేయలేని కాంగ్రెస్ సర్కారుపై నెటిజన్లు మీమ్స్ చురకలు సంధిస్తూ.. కాంగ్రెస్ పరువు గాలి తీస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇవీ.. యూరియా కొరతపై హాస్యభరితంగానే అంతర్లీనంగా కాంగ్రెస్ పాలనను ఎండగడుతున్న కొన్ని మీమ్స్, సెటైర్స్.
ఓ ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతాయి. పెళ్లి కొడుకు ఆస్తిపాస్తుల గురించి చర్చ నడుస్తుంటుంది. పెళ్లి కొడుకుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం లేదు, గవర్నమెంట్ నౌకరి లేదని హేళన చేస్తారు. కానీ నా వద్ద 300 యూరియా బస్తాలు ఉన్నాయని పెళ్లి కొడుకు చెప్తాడు. దీంతో పెళ్లికి ఒప్పుకుంటారు. అంటే కాంగ్రెస్ పాలనలో యూరియా బస్తా దొరుకుడే గగనమైపోయిందని నెటిజన్ సెటైర్ పేల్చాడు.
రోజుల తరబడి క్యూలో నిల్చుని, అష్టకష్టాలు పడ్డ ఓ రైతు యూరియా బస్తా దక్కించుకుని నెత్తిమీద పెట్టుకుని వస్తుంటాడు. ఇంతలో అతడి వద్దకు వచ్చిన కొందరు.. గణేశ్ ప్రసాదం తీసుకో అని చెప్తారు. దీంతో అతడు యూరియా బస్తా కింద పెట్టి… ప్రసాదం తీసుకుని కళ్లు మూసుకుని దండం పెట్టుకుని నోట్లో వేసుకుంటాడు. ఇంతలో ప్రసాదం ఇచ్చినవారు యూరియా బస్తాను మాయం చేస్తారు. కాంగ్రెస్ పాలనలో తక్కువ ధర కలిగిన యూరియా బస్తా కూడా భారీ విలువైన వస్తువుగా మారిందని సదరు మీమర్ సందేశమిచ్చాడు.
ఒక ఊరిలో సర్పంచ్ ఎన్నికలకు నాయకులంతా సన్నాహాలు చేస్తుంటారు. ఇంతలో ఒక్కో నాయకుడు ఓటర్లకు ఒక్కో హామీల వర్షం కురిపిస్తారు. ఒకరు డబ్బులు ఇస్తామని, మరొకరు కానుకలు ఇస్తామని అరచేతిలో వైకుంఠం చూపించే మాటలు చెప్తుంటారు. ఇంతలో ఒక నాయకుడు వచ్చి.. ఒక్కొక్కరికి ఒక్కో యూరియా బస్తా ఇస్తానని చెప్తాడు. దీంతో అందరూ ఆ నాయకుడికి జైకొడతారు. విరివిగా లభించే యూరియా బస్తా కూడా రేవంత్రెడ్డి పాలనలో అరుదైన, అమూల్యమైన వస్తువుగా మారిపోయిందని వీడియోలో వ్యంగ్యాస్త్రం సంధించారు.