Market Pulse | దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాలకు బిగ్ బ్రేక్ పడింది. ఆల్‌టైమ్ హై శిఖరాలకు చేరుకున్న సూచీలు.. భారీ నష్టాలతో కిందకి వచ్చేశాయి. లాభాల స్వీకరణ దిశగా అడుగులేస్తున్న మదుపరులకు పశ్చిమాసియా ఉద్రిక్తతలు కూడా తోడవడంతో గత వారం ట్రేడింగ్‌లో భీకర నష్టాలే వాటిల్లాయి. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 3,883.40 పాయింట్లు లేదా 4.60 శాతం క్షీణించి 81,688.45 వద్ద నిలిచింది. అలాగే ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం 1,164.35 పాయింట్లు లేదా 4.50 శాతం పడిపోయి 25,014.60 దగ్గర ముగిసింది. ఇక వరుసగా 5 రోజులపాటు మార్కెట్లు నష్టాల్లోనే కదలాడటంతో రూ.16.2 లక్షల కోట్లకుపైగా మదుపరుల సంపద హరించుకుపోయింది.
ఈ నేపథ్యంలో ఈ వారం ఆర్బీఐ ద్రవ్యసమీక్షతోపాటు ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పోరు.. పెద్ద ఎత్తునే ప్రభావితం చేస్తాయనిపిస్తున్నది. దీంతో కరెక్షన్కే వీలెక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నది. అలాగే గ్లోబల్ స్టాక్ మార్కెట్లు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, అంతర్జాతీయ పరిణామాలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఈ వారంలోనూ భారతీయ స్టాక్ మార్కెట్ల తీరును నిర్దేశించనున్నాయి. అమ్మకాల ఒత్తిడి ఎదురైతే నిఫ్టీకి 24,600 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 24,300 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే 25,400-25,600 మధ్యకు వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
చివరగా..
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు మదుపరులు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్ అని గుర్తుంచుకోవాల్సిందిగా మనవి.