ముంబై, ఆగస్టు 7 : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్‌పడింది. భారత్‌పై 50 శాతం వరకు ప్రతీకార సుంకాలను విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికతో కుప్పకూలిన మార్కెట్లు చివరి గంటలో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో తిరిగి లాభాల్లోకి రాగలిగాయి. ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో సెన్సెక్స్ 80 పాయింట్లు లాభపడింది. నష్టాల్లో ప్రారంభమైన సూచీ ఒక దశలో 80 వేల కీలక మైలురాయిని కోల్పోయి 79,811 పాయింట్ల కనిష్ఠ స్థాయికి జారుకున్నది.
చివర్లో తిరిగి కోలుకొని 79 పాయింట్లు లాభపడి 80,623.26 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 21.95 పాయింట్లు అందుకొని 24,596.25 వద్ద నిలిచింది. కేవలం ఐటీ రంగానికి చెందిన టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఎటర్నల్, యాక్సిస్ బ్యాంక్, మారుతి, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ, అదానీ పోర్ట్స్, ట్రెంట్, టాటా మోటర్స్, హెచ్‌యూఎల్, ఎన్టీపీసీలు నష్టపోయాయి. రంగాలవారీగా ఐటీ, హెల్త్‌కేర్, టెక్నాలజీ, వాహన రంగ షేర్లు లాభపడగా…టెలికాం, క్యాపిటల్ గూడ్స్, కమోడిటీస్, పవర్, ఇండస్ట్రియల్స్ రంగ షేర్లు నష్టపోయాయి.