సారంగాపూర్, నవంబర్ 2 : రైతు ప్రభుత్వం అంటే రైతులను గోస పెట్టడమేనా..? అని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ప్రశ్నించారు. ఆదివారం సారంగాపూర్ మండల కేంద్రంతోపాటు బట్టపల్లి, పోతారం, గణేశ్‌పల్లి, లక్ష్మీదేవిపల్లి, తదితర గ్రామాల్లో పర్యటించి, వర్షాలతో దెబ్బతిన్న పంటలను, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వర్షాలతో పంట నేలకొరిగితే నష్టం అంచనా వేసే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేక పోవడం విచారకరమన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ఆరంభ శూరత్వమే కనిపిస్తున్నదని, కాంటా పెట్టేది లేదు.. ధాన్యం కొనేది లేదని విమర్శించారు. 25 రోజుల క్రితం కోసిన రైతుల ధాన్యం కూడా కొనలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో రైతులను ఇబ్బంది పెట్టకుండా చూసుకున్నారని, సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి రంగుమారినా మద్దతు ధరకు కొనుగోలు చేశారని తెలిపారు. కానీ, కాంగ్రెస్ పాలనలో పట్టించుకునే వారు కరువయ్యారని విమర్శించారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందని, తక్షణమే క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనా వేయించి పరిహారం అందేలా చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఆయాచోట్ల బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తేలు రాజు, సింగిల్ విండో మాజీ చైర్మన్ సాగి సత్యంరావు, నాయకులు ఎండబెట్ల ప్రసాద్, బైరి మల్లేశ్‌యాదవ్, గుర్రం స్వామి, పేమానందం, భూక్య సంతోష్, కోల శ్రీనివాస్, సాంబారి గంగాధర్, శ్రీనివాస్‌రెడ్డి, తిరుపతి నాయక్, తదితరులు పాల్గొన్నారు.