Dava Vasantha | సారంగాపూర్, నవంబర్ 2: రైతన్నలపై ప్రకృతితో పాటు ప్రభుత్వం కూడా పగపట్టిందని, తుఫాన్‌తో కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించాలని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. మండల కేంద్రంలో పాటు బట్టపల్లి, పోతారం, గణేష్ పల్లి, లక్ష్మిదేవిపల్లి తదితర గ్రామాల్లో ఆదివారం పర్యటించి వర్షాలకు నష్టపోయిన పంటలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అంటే రైతులను గోస పెట్టడమేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు ఆకాల వర్షాలతో నెలకొరిగితే పంటనష్టం అంచనా వేసే పరిస్థితిలో రాష్ట్ర ప్రభత్వం లేక పోవడం విచారకరమన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ఆరంభశూరత్వం కనిపిస్తుందే తప్ప కాంటా పెట్టేది లేదు ధాన్యం కొనేది లేదని విమర్శించారు. 25 రోజుల క్రితం పంట కోసిన రైతుల ధాన్యం కూడా కొనుగోలు చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. రైతులను నష్టపెట్టేవిధానం మానుకోవాలని హితవు పలికారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో 5వేల ఎకరాలకు ఒక ఏఈఓను నియమించి సాగు వివరాలు నమోదు చేసి ఎరువుల, విత్తనాల కొరత లేకుండా చూడడంతో పాటుగా ఎంత పంట నష్టం వస్తుందనే అంచనా వేయగలిగి అందుకు అవసరమైన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
అకాల వర్షాలకు తడిసిన ధాన్యం రంగుమారిన మద్దతు ధరకు పంటను కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్ దేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు గోసలు పట్టించుకోకుండా కేవలం వారి ఖజానా నింపుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే సీఎం – వ్యవసాయ మంత్రితో పాటు మంత్రి వర్గం, అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతుల కష్టాలను అడిగి తెల్సుకోవడంతో పాటు పంటనష్టం అధికారులతో వేయించి మెనిపెస్టోలో పెట్టిన విధంగా ఎకరాకు రూ.50వేలు పరిహారం అందించాలని బీఆర్ఎస్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని ఫసల్ బీమా పథకం అమలు చేసి రైతులను ఆదుకునేందుకు చొరవ చూపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవల్సి బాధ్యత ఎమ్మెల్యేపై ఉందని తక్షణమే క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచన వేయించి రైతులకు నష్టపరిహారం అందేలా ఎమ్మెల్యే చొరవ చూపాలన్నారు.
గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభి ధాన్యం కొనుగోల్లు జరపాలన్నారు. ఈ కార్యక్రమాల్లో మండల పార్టీ అధ్యక్షుడు తేలు రాజు, సింగిల్ విండో మాజీ చైర్మన్ సాగి సత్యం రావు, నాయకులు ఎండబెట్ల ప్రసాద్, బైరి మల్లేష్ యాదవ్, గుర్రం స్వామి, పేమానందం, భుక్య సంతోష్, కోలశ్రీనివాస్, సాంబారి గంగాధర్, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి నాయక్, గంగాధర్, జలంధర్, రమేష్, మల్లేష్, శ్రీను, ప్రకాష్, రాజయ్య, చిరంజీవి, లక్ష్మణ్, గంగారెడ్డి, అంజి, రాజేశ్వర్‌రెడ్డి, సాగర్, ఆయా గ్రామాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.