కెరియర్ ఆరంభంలో ఆదాయ, వ్యయాల్లో తరచూ మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. కాబట్టి మీ అవసరాలు, జీవనశైలి, చిన్నపాటి అత్యవసర నిధితో ఓ బడ్జెట్‌ను పెట్టుకోండి. కానీ దీన్ని కచ్ఛితంగా పాటించనవసరం లేదు. ఈ బడ్జెట్ లక్ష్యం కేవలం ఎలాంటి ఒత్తిళ్లు, ఆంక్షలు లేని ఆర్థిక క్రమశిక్షణను అలవర్చుకోవడానికి అంతే.
ఆరోగ్య బీమా విషయంలో రాజీ పడవద్దు. మీకు, మీ కుటుంబ సభ్యులకు తగిన రీతిలో ఆరోగ్య బీమా అవసరం. ముఖ్యంగా మీరు పనిచేస్తున్న సంస్థ ద్వారా అందే ఆరోగ్య బీమా పరిమితంగా ఉన్నప్పుడు.. సమగ్ర స్థాయిలో హెల్త్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవాల్సిందే. ఇక జీవిత బీమా ఈ సమయంలో తప్పనిసరి ఏం కాదు. మీ మీద ఆధారపడి ఉన్నవారు ఉన్నప్పుడే లైఫ్ ఇన్సూరెన్స్‌పై దృష్టి పెట్టండి. అన్నింటి కంటే ముఖ్యంగా పన్నులను ఆదా చేయడానికే బీమాను తీసుకోవద్దు.
కెరియర్ ఆరంభంలో ఇంటిని కొనుగోలు చేయ డం అంతగా తెలివైన నిర్ణయమైతే కాదు. దీనివల్ల మీపై దీర్ఘకాలంగా ఆర్థిక భారం పడగలదు. కనుక మీ కష్టార్జితం ఏండ్ల తరబడి ఒక్కే దగ్గర చిక్కుకునేలా నిర్ణయాలు తీసుకోకండి. స్వల్పకాలిక పెట్టుబడులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించండి.
యువ సంపాదనపరులు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీము (ఈఎల్ఎస్ఎస్)లను పరిశీలించడం ఉత్తమం. దీనివల్ల స్టాక్ మార్కెట్ లాభాలను ఒడిసి పట్టుకోవచ్చు. పైగా ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలనూ పొందవచ్చు. కాబట్టి సంప్రదాయ పన్ను ఆదా పెట్టుబడి సాధనాల కంటే.. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈఎల్ఎస్ఎస్లోకి ప్రవేశించి, షార్ట్ లాకిన్ పీరియడ్‌లో పెట్టుబడులకు దిగండి. అయితే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు తీవ్ర ఒడిదొడుకులకు లోబడి ఉంటాయి. కనుక పరిమిత స్థాయిలో, నిపుణుల మార్గదర్శకత్వంలో ముందుకెళ్తే మంచిది.
మ్యూచువల్ ఫండ్స్, ప్రావిడెంట్ ఫండ్ వంటి పెట్టుబడి సాధనాలపై దృష్టి పెట్టండి. ఇవి మీ లక్ష్య సాధనకు వీలుగా ఉంటాయి. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా మీ దీర్ఘకాలిక లక్ష్యాలనూ నెరవేర్చగలవు. అలాగే అనవసరపు ఖర్చులు, అప్పుల జోలికి వెళ్లవద్దు. హంగులు, ఆర్భాటంగా ఉండే జీవనశైలికి దూరంగా ఉండండి. ప్రాధాన్యతల ఆధారంగా మీ ఆదాయాన్ని విభజిస్తే మెరుగైన ఫలితాలుంటాయి.