జగిత్యాల పట్టణంలో బర్మాషల్ కంపెనీకి చెందిన పెట్రోల్, డీజిల్ బంక్తోపాటు, కిరోసిన్ ఔట్లెట్ ఏర్పాటుకు 1952లో అంకురార్పణ జరిగింది. అప్పుడు డీలర్షిప్ తీసుకునేందుకు ఏ వ్యాపారి ముందుకు రాకపోవడంతో ప్రజా అవసరాల కోసం మున్సిపాలిటీ ఓ నిర్ణయం తీసుకున్నది. తన ఆధీనంలో ఉన్న 20 గుంటల స్థలాన్ని వ్యాపారికి లీజుకు ఇవ్వడానికి అంగీకరించింది. దాంతో దారం వీరమల్లయ్య డీలర్ షిప్ తీసుకునేందుకు ముందుకురాగా, ఆయనకు సర్వే నంబర్ 138లో 20 గుంటల స్థలాన్ని లీజుకు ఇచ్చింది. దీంతో అక్కడ పెట్రోల్ బంక్ ఏర్పాటు జరిగింది. అప్పటి నుంచి అక్కడ బంక్ పనిచేస్తూనే ఉన్నది. అయితే కాలక్రమంలో వ్యాపారి వీరమల్లయ్య వారసులు ఆ భూమిని తాము 1952లో కిబాల పత్రం (ఉర్దూలో ఉన్న ప్రత్రం) ద్వారా మున్సిపాలిటీ నుంచి కొనుగోలు చేశామంటూ.. పంచుకొని భవన నిర్మాణాలు, దుకాణ సముదాయాలు నిర్మించుకున్నారు. అయితే ఆ భూమిని వీరమల్లయ్య వారసులు అక్రమంగా సొంతం చేసుకున్నారన్న ఆరోపణలు 1964 నుంచి వస్తూనే ఉన్నా స్పందించే వారు కరువయ్యారు. నాటి నుంచి నేటి దాకా అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ, ముఖ్యంగా మున్సిపల్ పాలకవర్గాలు గానీ ఏనాడూ ఈ అంశాన్ని పట్టించుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్టు మున్సిపల్ స్థలం కబ్జాలో అందరికీ భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జగిత్యాల, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : 1946-47 సేత్వార్ రికార్డుల ప్రకారం జగిత్యాలలోని 138 సర్వే నంబర్లో మొత్తం 14 ఎకరాల నాలుగు గుంటల స్థలం ఉన్నది. అప్పుడది ఇనుములపెల్లి నర్సింగరావు పట్వారీ పేరిట ఉన్నది. 1952లో జగిత్యాల మున్సిపాలిటీగా అవతరించగా, అప్పుడు పట్టణాభివృద్ధికి కొన్ని చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ‘మున్సిపల్ జనరల్ ఫండ్’ నిధులతో 1952లోనే ఆ 14.04 ఎకరాల భూమిని పట్టాదారుడు నర్సింగరావు నుంచి కొనుగోలు చేశారు. ఈ స్థలంలోనే బర్మాషల్ కంపెనీ పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సంబంధించి వ్యాపారి దారం వీరమల్లయ్యకు 20 గుంటల భూమిని మున్సిపల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. అయితే 1953-54లో కాస్రా పహానిలోకి ‘మున్సిపల్ లోకల్ ఫండ్’ పట్టాదారుడిగా, దారం వీరమల్లయ్యను అనుభవదారుడిగా చేర్చారు. కానీ, 1958-59 పహానిలో మాత్రం వీరమల్లయ్య పేరు పట్టాదారు కాలంలోకి వచ్చింది. ఆ ఏడాది పహానిలో సర్వేనంబర్ 138ను రెండు డివిజన్లుగా చేశారు. 13.19 ఎకరాల భూమిని ‘138/అ’ గా పేర్కొంటూ, ‘మున్సిపల్ లోకల్ ఫండ్’ను యజమానిగా పేర్కొన్నారు. సర్వేనంబర్ ‘138/ఆ’లో వీరమల్లయ్యను 25 గుంటల భూమికి పట్టాదారుడిగా చూపారు.
కిబాల పత్రం ద్వారా వచ్చినట్టు పట్టాదారుకాలంలో పేర్కొన్నారు. తర్వాత 1976-77 పహానిలో మాత్రం వీరమల్లయ్య పేరిట 20 గుంటల భూమిని పహానిలో చూపారు. అదే ఏడాది వీరమల్లయ్య వారసుల పేర్లు పట్ట్టాదారు కాలంలోకి ప్రవేశించాయి. అప్పటి నుంచి అవే పేర్లు కొనసాగుతూ వస్తున్నాయి. అయితే రెవెన్యూ రికార్డులో ఉన్న వివరాలు ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వ్యాపారి వీరమల్లయ్య వారసులు మాత్రం తాము 1952లో కిబాల పత్రం ద్వారా మున్సిపాలిటీ దగ్గర కొనుగోలు చేశామని చెబుతున్నా.. మరెన్నో సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఒకవేళ మున్సిపాలిటీ వద్ద వీరమల్లయ్య 20 గుంటల భూమిని కిబాల పత్రం ద్వారా కొనుగోలు చేసి ఉంటే, 1953-54 కాస్రా పహానిలో ఆయన పేరు సైతం పట్టాదారుడిగా ఉండేది కదా..? అలా కాకుండా అనుభవదారుడి కాలంలో ఎందుకు పేర్కొన్నారు? అనే ప్రశ్న వస్తున్నది. అలాగే 1958లో మొదటిసారి పహానీలో వీరమల్లయ్యకు కిబాల పత్రం ఉన్నందున అంటూ పట్టాదారుడిగా పేర్కొన్నారు. అయితే అందులో వీరమల్లయ్య పేరిట 25 గుంటలు ఉన్నట్టు పహానిలో చూపారు. మళ్లీ 1976-77లో 20 గుంటల భూమికి పట్టాదారుడిగా పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిశీలిస్తే.. రికార్డులన్నీ తారుమారు చేశారన్న విషయం అర్థమవుతున్నది.
పెట్రోల్‌బంక్ స్థలం వివాదం అరవై ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్నది. మొదటిసారిగా 1964లో దారం వీరమల్లయ్య.. తనకు మున్సిపాలిటీ 103/17/52 ద్వారా 20 గుంటల స్థలం కేటాయించిందని, పెట్రోల్‌బంక్ నిర్వహిస్తున్నామని, అలాగే భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని మున్సిపాలిటీకి దరఖాస్తు చేసుకున్నాడు. దీన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తి మాన్య వీరయ్య మున్సిపల్ భూమి ఆక్రమణకు గురవుతుందంటూ ఫిర్యాదు చేశాడు. అప్పుడు దీనిపై విచారించేందుకు బాలే వీరేశం నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. విచారణ తర్వాత నిర్మాణాలకు అనుమతి ఇవ్వరాదని స్పష్టం చేశారు. అయితే అప్పటి మున్సిపల్ కమిషనర్ పట్టించుకోకపోవడంతో నిర్మాణాలు పూర్తి చేయగా, ఈ క్రమంలోనే కొనుగోలుకు సంబంధించిన ఆధారాలు చూపాలని వీరమల్లయ్యకు మున్సిపాలిటీ నోటీసులు జారీ చేసింది. అప్పుడు ఏ ఆధారాలూ సమర్పించలేదు. 1964 సెప్టెంబర్ 28న మున్సిపల్ సబ్ కమిటీ.. వీరమల్లయ్య, ఆయన సోదరుడు పురుషోత్తంకు భూమి యాజమాన్యానికి సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేవని, నిర్మాణాలు చట్టబద్ధమైనవి కాదని ప్రకటించింది. నిర్మాణాలను తొలగించాలని, లేదంటే మున్సిపాలిటీ కూల్చివేయాలని ఆదేశించింది.

పెట్రోల్‌బంక్‌పై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. అయినా అవేవి కార్యరూపం దాల్చలేదు. 1975లో వీరమల్లయ్య మృతిచెందగా, ఆయన వారసులైన పురుషోత్తం తదితరులు రెవెన్యూ రికార్డుల్లో పట్ట్టాదారులుగా నమోదయ్యారు. 1964లో తాత్కాలికంగా నిలిచిపోయిన ఈ పంచాయితీ 1984లో ఓసారి, 1989లో మరోసారి తెరపైకి వచ్చింది. అప్పుడు సివిల్‌కోర్టులో మున్సిపాలిటీ దావా వేసింది. ఈ క్రమంలో వీరమల్లయ్య, పురుషోత్తం వారసులు 20 గుంటల స్థలాన్ని మున్సిపాలిటీ నుంచి కొన్నామంటూ కిబాల పత్రాన్ని కోర్టుకు సమర్పించారు. దీనిపై 1996, 1998లో అప్పటి కౌన్సిలర్ ఏసీఎస్ రాజు, నగేశ్, సత్యానారాయణరెడ్డి సైతం ఫిర్యాదు చేశారు. 2004లో 22 మంది కౌన్సిలర్లు ఆ 20 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని తీర్మాన కాపీని అందించారు. ఈ క్రమంలోనే 2004 నవంబర్ 30న పెట్రోల్‌బంక్ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని 140/2004 ద్వారా మున్సిపాలిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ క్రమంలో వీరమల్లయ్య వారసుడు, ప్రస్తుత పెట్రోల్‌బంక్ నిర్వాహకుడు మంచాల కృష్ణతోపాటు, ఇతర వారసులకు నోటీసులు జారీ చేసింది. అప్పుడు కృష్ణతోపాటు ఇతర వారసులు తమ పూర్వీకులు కిబాల పత్రం ద్వారా భూమిని కొనుగోలు చేశారని, తమను పట్టాదారులుగా గుర్తించడంతోపాటు మున్సిపల్ భూమి స్వాధీన తీర్మానాన్ని తొలగించాలని హైకోర్టును ఆశ్రయించారు. అప్పుడు హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్.. దిగువ సివిల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది. దాంతో కృష్ణ, ఇతర వారసులు మళ్లీ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా, 2008 డిసెంబర్లో తీర్పునిచ్చింది. మంచాల కృష్ణతోపాటు ఇతర వారసులను పట్ట్టాదారులుగా గుర్తించలేమని, దిగువ సివిల్ కోర్టును ఆశ్రయించి యాజమాన్య హక్కులను నిరూపించుకోవాలని తేల్చిచెప్పింది. అయితే ఈ తీర్పు తర్వాత మున్సిపాలిటీ గానీ, మంచాల కృష్ణ, ఇతర వారసులు గానీ, ఇంత వరకు యాజమాన్య హక్కులను నిరూపించుకునేందుకు ఏ దిగువ కోర్టును ఆశ్రయించలేదు.
కిబాల పత్రం ద్వారా తాము స్థలాన్ని కొన్నామని దారం వీరమల్లయ్య వారసులు, వ్యాపారి మంచాల కృష్ణ 1989లో కోర్టులో కిబాల పత్రం (ఉర్ద్దూ పత్రం) సమర్పించారు. ఈ పత్రాన్ని మున్సిపాలిటీ వారు హైదరాబాద్‌లోని అఫీషియల్ తర్జుమా కార్యాలయంలో తర్జుమా చేయించారు. అయితే అందులోని అనేక అంశాలు సందేహాలను కలిగిస్తున్నాయి. కిబాల పత్రంపై ఫైల్ నెంబర్ 103/17 ఆఫ్ 1952గా పేర్కొనబడి ఉన్నది. దాని దిగువన ‘వన్ స్టాంప్ పేపర్ ఆఫ్ త్రీ రూపీస్. గవర్నమెంట్ ఆఫ్ అసాఫియా’ అని ఉన్నది. తదుపరి సర్టిఫికెట్ గ్రాంటెడ్బై ద మున్సిపాలిటీ జగిత్యాల, కరీంనగర్ జిల్లా డేటెడ్ జూలై 1958గా పేర్కొనబడింది. అయితే ఫైల్ నంబర్లో 1952 రాసిన వారు దిగువన 1958 జూలై అని పేర్కొనడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అన్నింటికంటే ముఖ్యమైన అంశం ‘వన్ స్టాంప్ పేపర్ ఆఫ్ త్రీ రూపీస్. గవర్నమెంట్ ఆఫ్ అసాఫియా’ అని పేర్కొనడం! 1948 సెప్టెంబర్ 17 వరకు మాత్రమే నిజాం రాజు అధికారంలో ఉన్నారు. ఆయన రాజ్యాన్ని అసాఫియా గవర్నమెంట్ అని చెబుతారు. ఆయన తర్వాత జేఎన్ చౌదరీ నేతృత్వంలో మిలటరీ ప్రభుత్వం, అనంతరం సివిల్ ప్రభుత్వాలు వచ్చాయి. 1951-52లో జరిగిన ఎన్నికల తర్వాత హైదరాబాద్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం సీఎం బూర్గుల నేతృత్వంలో ఏర్పడింది. అసాఫియా గవర్నమెంట్‌కు ప్రత్యేక స్టాప్ డిపార్ట్మెంట్ ఉండగా, 1949లో దాన్ని రద్దు చేసి, అదే యేడాది ఇండియన్ స్టాంప్ చట్టాన్ని అమలులోకి తెచ్చారు. అప్పటి నుంచి నిజాం అసాఫియా స్టాంప్‌లు చెల్లకుండా పోయాయి.
రద్దయిన అసాఫియా ప్రభుత్వ స్టాంప్ పత్రం మంచాల కృష్ణ సమర్పించిన కిబాల పత్రంపై ఎలా వచ్చిందో..? ఎవరికీ అర్థం కావడం లేదు. ఇక 1958కి సంబంధించిన కిబాల పత్రం గురించి చర్చిస్తే.. అప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ సమయంలో ఏపీ ప్రభుత్వ రెవెన్యూ, వ్యాల్యూ స్టాంప్‌లను వాడకపోవడం కిబాల పత్రం ఒరిజినాలిటీపై అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. ఇక ఇదే పత్రంలో దిగువన కాంపన్సెషన్ ఆఫ్ లాండ్ అన్న వద్ద 2వేలు అని పేర్కొనడంతోపాటు పక్కన ఉస్మానియా కరెన్సీ అని పేర్కొన్నారు. ఉస్మానియా కరెన్సీ సైతం నిజాం కాలంలో వినియోగించిన కరెన్సీనే. అయితే నిజాం రాజ్యం తర్వాత హైదరాబాద్ ప్రభుత్వంలో సైతం ఈ కరెన్సీ చెలామణిలో ఉంది. 1955లో దీని వినియోగాన్ని ముగించాలని భావించినా, ప్రజల అభ్యర్థన మేరకు 1959 ఏప్రిల్ వరకు అనుమతి ఇచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1956 నవంబర్ 1న ఏర్పాటు కావడంతో ఉస్మానియా కరెన్సీని వినియోగించినా, ఇండియన్ కరెన్సీగానే దాన్ని పేర్కొనాలని ప్రకటించింది. అయితే కిబాల పత్రంలో ఉస్మానియా కరెన్సీ అని పేర్కొనడం సైతం అనేక అనుమానాలకు తావిస్తున్నది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం మున్సిపాలిటీకే కాదు, ఏ ప్రభుత్వ శాఖకు తన ఆధీనంలో ఉన్న భూమిని నేరుగా విక్రయించే అధికారం లేదు. విక్రయించినా, దాన్ని రికార్డుల్లో భద్రపర్చడంతోపాటు రిజిస్ట్రేషన్ శాఖలో నమోదు చేయాల్సి ఉంటుంది. కిబాల పత్రంలో దారం వీరమల్లయ్య నేరుగా మున్సిపాలిటీ నుంచి 20 గుంటల భూమిని కొనుగోలు చేసినట్టు చెబుతుండడం అందరీని విస్మయానికి గురి చేస్తున్నది.
మున్సిపాలిటీ చేతగానితనం, అధికారుల పట్టింపులేనితనం, పాలకవర్గాల అవినీతి వల్లే వంద కోట్లకు పైగా విలువ చేసే మున్సిపల్ భూమి అన్యాక్రాంతమైందని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. 70 ఏళ్లు సమస్యను మున్సిపాలిటీ పరిష్కరించలేకపోతున్నదంటే పాలకవర్గాలు, అధికారుల్లో ఎంతటి నిర్లక్ష్యం, అవినీతి ఉన్నదో అర్థం చేసుకోవచ్చునంటున్నారు. 1964లో వివాదం ఏర్పడినప్పుటి నుంచి మున్సిపల్ పాలకవర్గాలు ఆ భూమిని స్వాధీనం చేసుకునే అంశంపై దృష్టిపెట్టలేదు. వ్యాపారులతో కుమ్మక్కయి ఎన్నడూ పట్టించుకున్న దాఖలాలు లేవు. 1980 దశకంలో పనిచేసిన ఒకరిద్దరు నిజాయితీపరులైన కమిషనర్లు భూమిని స్వాధీనం చేసుకునేందుకు కోర్టును ఆశ్రయించి పోరాటం చేసినా, బదిలీలతో సమస్య అక్కడే ఆగిపోయింది. 2004లో ఏకగ్రీవ తీర్మానంతో ఒక ప్రయత్నం జరిగినా, అది కోర్టు తీర్పుల నేపథ్యంలో మరుగున పడిపోయింది.
2008లో హైకోర్టు డివిజన్‌బెంచ్ తీర్పు నేపథ్యంలో అటు యజమానులు, ఇటు మున్సిపాలిటీ ఇద్దరు తమ హక్కులను నిరూపించుకునేందుకు యత్నించకుండా మిన్నకుండిపోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. అంటే 2008లో అధికారంలో ఉన్న పాలకవర్గం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఉన్న పాలకవర్గాలన్నీ చోద్యం చూస్తూ ఉండిపోగా, వ్యాపారులు దర్జాగా భూమిని, దానిపై వచ్చే ఆదాయాన్ని అనుభవిస్తున్నారు. ఇక 1964 నుంచి ఇప్పటి వరకు దాదాపు 50 మంది కమిషనర్లుగా పనిచేసినా.. ఆ భూమిని స్వాధీనం చేసుకునే దిశగా ఎవరూ ఆలోచన చేయలేదు. మున్సిపాలిటీ అడ్డుకునేందుకు ప్రయత్నం చేయకపోవడంతో దారం వీరమల్లయ్య వారసులు తమకు టైటిల్‌డీడ్ లేకపోయినా 20 గుంటల భూమిలో నిబంధలకు విరుద్ధంగా పలు రిజిస్ట్రేషన్లు చేశారు. పట్ట్టాదారులుగా లేని వారు చేసే రిజిస్ట్రేషన్లను అడ్డుకోవాల్సిన సబ్ రిజిస్ట్రార్ అధికారులు సైతం యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేశారు.