‘గురుదేవా! ధరా (భూ)దేవి ప్రియ పుత్రుడైన నరకాసురుణ్ని మురవైరి హరి ఎందుకు సంహరించాడు? ఆ నరకుడు 16 వేల తరుణీమణులను ఏల చెరసాలలో బంధించాడు’ అని ప్రశ్నించిన పరీక్షిన్నరేంద్రునికి శుకముని ఇలాగని వివరించాడు- అవనీపతీ! వేయి కన్నుల వేల్పు- ఇంద్రుడు వెన్ను (కృష్ణు)నికి భౌమాసురు- నరకుని అత్యాచారాలు విన్న వించగా పన్నగశాయి- శ్రీహరి వానిని మన్నిగొను-చంపుటకై పన్నగారి (గరుడు)ని అధిరో హించి క్రన్నన- వేగంగా వెళ్లబోతున్న సమయంలో కిన్నెర కంఠి సత్యభామ ఆయనతో… ‘ప్రాణేశ్వరా! ఆహవ- రణరంగంలో నీ ప్రాభవాన్ని, ప్రావీణ్యాన్ని ప్రత్యక్షంగా దర్శించాలని కోరికగా ఉంది. మదన జనకా! కాదనక కదన రంగానికి నన్ను కూడా కదలిరానిండు’ అని మనవి చేసింది. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు.
సీ॥ ‘సమద పుష్పంధయ ఝుంకారములు గావు,
భీషణ కుంభీంద్ర బృంహితములు
వాయు నిర్గత పద్మవన రేణువులు గావు,
తురగరింఖాముఖోద్థూత రజము
లాకీర్ణ జల తరంగాసారములు గావు,
శత్రు ధనుర్ముక్త సాయకములు
కలహంస సారస కాసారములు గావు,
దనుజేంద్ర సైన్య కదంబకములు’
తే॥ ‘కమల కల్హార కుసుమ సంఘములు గావు
చటుల రిపు శూల ఖడ్గాది సాధనములు
కన్య! నీ వేడ? రణరంగ గమన మేడ?
వత్తు, వేగమ నిలువుము వలదు వలదు’
‘కురంగ నయనా! అబలవైన నీవెక్కడ? ప్రబలమైన రణరంగమెక్కడ? అక్కడ వినిపించేవి మదపుటేనుగుల భయంకర ఘీంకారాలే కాని, మదించిన తుమ్మెదల ఝుంకారాలు కావు. అందు కనిపించేవి పద్మవనం నుండి పవనానికి- గాలికి రేగి వచ్చిన పరాగ- పుప్పొడి రేణువులు కాదు, గుర్రపు గిట్టల ఘట్టానికి- తాకిడికి లేచే ధూళి దుమారాలు. అవి సరస్సుల శీతల జల తరంగాల తుంపరులు కావు, శత్రు చాపాల- ధనుస్సుల నుండి వెడలిన తూపు- బాణాల పరంపరలు. అవి రాజహంసలతో, రాజీవాలతో బెగ్గురు పక్షులతో నిండిన కాసారాలు- సరోవరాలు కావు, దానవేంద్రుని చమూ- సేనా సమూహాలు. నెచ్చెలీ! అట ముచ్చటగా కమలాలు, కలువలు కనిపించవు. అచ్చట కాన వచ్చేవి శత్రు శూలాలు, ఖడ్గాలు, శస్ర్తాలు. ఓ మచ్చెకంటీ! అట్టి భయంకర సంకరా (యుద్ధా)నికి నీవెందుకు? నేనే విజయుడనై వేగంగా వచ్చేస్తా. ఓ ముద్దుగుమ్మా! వద్దు వద్దు. నీవు రావద్దు.’ సమానమైన సీస పద్య పాదాలతో సత్యాదేవి ప్రస్తుత సుభగ సౌకుమార్య శృంగార స్థితినీ, సంగర రంగపు భయంకర రౌద్ర గతినీ రంగరించి పోతన, ఉట్టిపడేటట్లుగా కళ్లకు కట్టాడు.
‘నాథా! నీ బాహు దండాలనే దుర్గా (కోట)ల అండ నాకుండగా, వారు దానవ మండలు- సమూహాలైతే మాత్రం నాకేమి భయం? ఓ అండజ వాహనా! నీతో తప్పక వస్తా’ అని అభిమానవతి సాత్రాజితి చేతులు జోడించి వేడగా, యాదవ శిరోరత్నం మెచ్చుకోలుగా చూచి, మోదంతో సత్యా సమేతుడై గరుత్మంతునిపై ఎక్కి గగన మార్గాన ప్రాగ్జ్యోతిష నగరం చేరాడు. అది పంచభూత రూపాలైన అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలనే పంచ దుర్గాలతో కూడి, చొరరానిదై, మురాసురుని బాహుపాశాలతో చుట్టుకొనబడి ఉన్న పురం- ‘ప్రాగ్జ్యోతిషం’. ఇందలి ‘ప్రాక్’ శబ్దమే ‘బహిర్ముఖమైన’ అనే అర్థం కలిగిన ‘పరాక్’ శబ్దం. ఇంద్రియ జ్యోతి బహిర్ముఖమైన పట్టణం, అనగా మానవ దేహమే ప్రాగ్జ్యోతిషం.
పంచ దుర్గాలే పంచేంద్రియాలు- పంచముఖాలు. బహిర్ముఖాలైన పంచేంద్రియాలతో- పంచముఖాలతో పంచతన్మాత్రలను- శబ్ద స్పర్శ రూప రస గంధాలనే విషయాలను భోగించే అజ్ఞాన స్వరూపుడు- జీవాహంకారుడైన నరుడే ‘ముర’ అసురుడు. శుకుడు- రాజా! అరి భయంకరుడైన అరవిందాక్షుడు తన గదా దండంతో మురాసురుని పంచదుర్గాలను పటాపంచలు గావించాడు. నందకమనే ఖడ్గంతో గోవిందుడు వాని అష్ట పాశాలను ఖండించి పాంచజన్య శంఖం పూరించాడు. ప్రళయకాల పర్జన్య (మేఘ) గర్జన వంటి ఆ శంఖ ధ్వని విని పంచముఖుడైన మురాసురుడు నిద్ర మేల్కొని, అవని (భూమి) ఆకాశాలు దద్దరిల్లు విధంగా గర్జించాడు. వాడు విసిరిన గదను దామోదరుడు తన గదతో వేయి ముక్కలు చేశాడు. మురుడు చేతులు పైకెత్తి తన మీదకు ఉరికి రావడం చూచి శ్రీహరి తన చక్రాయుధంతో ఆ రక్కసి ఐదు తలలనూ అవలీలగా వక్కలించాడు- ముక్కలు గావించాడు. జనకుని మరణానికి శోకించి, కినుక పూని, జనార్దనుని- కృష్ణుని సంహరిస్తామని సమరానికి సన్నద్ధులై వచ్చిన మురుని ఏడుగురు కొడుకుల అవయవాలన్నిటిని అమర ప్రభువు బలిధ్వంసి- కృష్ణుడు తిల- నువ్వు గింజలంత ఖండాలు చేసి ఇల- నేలపై పడవేశాడు.
శుకయోగి- రాజా! తన పక్షం వారంతా అధోక్షజుని చక్రానికి బలైపోగా నరకుడు వెరగుపడి రోషంతో హరిని
సరకు సేయక- లక్ష్య పెట్టక దూషించి దురా (యుద్ధా)నికి బయలుదేరాడు…
మ॥ ‘బలవంతుండు ధరాసుతుండు గనె శుంభద్రాజ బింబోపరి
స్థల శంపాన్విత మేఘమో యన ఖగేంద్ర స్కంధ పీఠంబుపై
లలనారత్నము గూడి సంగర కథాలాపంబులం జేయు ను
జ్జల నీలాంగుగనన్నిషంగు గుహనాచంగున్ రణాభంగునిన్’
– మిగుల బలశాలియగు నరకాసురుడు, గరుత్మంతుని మూపు మీద రూపుదాల్చిన సౌభాగ్యరాశి వలె రాజిల్లు సత్యభామతో ఆసీనుడై, ఇందు- చంద్రబింబంపై మెరుపు తీగతో కూడిన మేఘంలా నీలవర్ణంతో ప్రకాశిస్తున్న కృష్ణ చంద్రుని- రణ కోవిదుని చూచాడు. వీపున తూపుల పొది దాల్చిన ఆ గోపాలకృష్ణుడు సాత్రాజితికి యుద్ధ రహస్యాలు బోధిస్తున్నాడు. ఆ నరకుడు కయ్యానికి కాలు దువ్వడం చూచిన సత్య వడివడిగా, ఒయ్యారంగా వాలు జడ ముడివేసుకుంది. చీర బిగించి, ఆభరణాలు సరిదిద్దుకొని, పైట సవరించుకొని ఆ ఏణీలోచన- లేడి కన్నుల ఆ వన్నెలాడి వీరావేశంతో ప్రాణేశుని చెంత నిబ్బరంగా నిలిచింది.ఆ అలివేణిని చూచిన మాధవుడు సరసంగా ఇలా సంభాషించాడు…
కం॥ ‘లేమా! దనుజుల గెలువగ
లేమా? నీ వేల కడగి లేచితి? విటు రా
లే! మాను మాన వేనిన్
లే మా విల్లందు కొనుము లీలం గేలన్’
.. భామా! మేము రాక్షసులను గెలువ లేమా? నీవేల సంగరానికి సిద్ధపడ్డావు? సమర సన్నాహం మాని ఇలారా! లేదా అంతగా కుతూహలముంటే, ఇదిగో! విలాసంగా ఈ విల్లందుకో’ అంటూ ఉల్లం రంజిల్లగా ధనుస్సును సత్య చేతికిచ్చాడు. ఆ విల్లు గ్రహించి వీరలోకానికి తేరిపార చూడరాని రీతిలో విరాజిల్లిన ఆ వీరనారీమణి పగవారి మగనాలుల (భార్యల) కంఠంలో మంగళసూత్రాలు తెగే విధంగా నారి బిగించి ధనుష్టంకారం చేసింది.
తే॥ ‘వీర శృంగార భయ రౌద్ర విస్మయములు
గలసి భామిని యయ్యెనో కాక యనగ
నిషువు దొడుగుట దివుచుట యేయు టెల్ల
నెరుగ రాకుండనని సేసె నిందువదన’
.. వీర, శృంగార, భయ, రౌద్ర, అద్భుత రస భావాలన్నీ ఏకమై ఈ నారి (వీరనారి)గా రూపొందాయా అన్నవిధంగా సత్యభామ నారాచం- బాణం తొడగడం, లాగడం, వదలడం కూడా గుర్తింప లేనంత వేగంగా వీర విహారం చేయసాగింది. మాటల్లో విరుపు పెట్టి (సభంగ శ్లేష) అందమైన విశేషార్థాలు సాధించడం పోతన్నకు వెన్నతో పెట్టిన విద్య!
మ॥ ‘పరుజూచున్ వరుజూచు నొంప నలరింపన్ రోష రాగోదయా
విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరగన్ గన్నుల గెంపు సొంపు బరగం జండాస్త్ర సందోహమున్
సరసాలోక సమూహమున్ నెరపుచుం జంద్రాస్య హేలాగతిన్’
చంద్రముఖి సత్య రోషంతో కనుబొమలు ముడివేసి, వీరావేశంతో కనులెర్ర జేసి, వాడి బాణాలను ఎడలేక కురిపిస్తూ పగవాడై (శత్రువై)న నరకుని తెగ నొప్పిస్తోంది. అదే సమయంలో సోయగాలతో అనురాగ పూర్వక మందహాసాలు చిందిస్తూ, అందగించిన శృంగార విలాసాలు ఒలికిస్తూ, ఇంపైన కన్నులతో సరసంపు చూపులు వెదజల్లుచూ ప్రియుడైన మాధవుని మురిపిస్తోంది- మెప్పిస్తోంది.
‘బొమ్మల పెండ్లిండ్లకే వెళ్లలేని ముద్దుగుమ్మ భండన- రణ రంగానికి రావాలని ఎలా భావించింది? మగవారిని చూడగానే మాటుకు వెళ్లే మగువ పగవారిని గెలవాలనే వగ- దుఃఖాల అగచాటుకు ఎలా అంగీకరించింది? వీణను చక్కగా పట్టుకోలేని విరిబోణి విల్లునెలా పట్టుకుంది?’ అని అందరూ విస్మయం చెందే విధంగా సత్యభామ సంగర రంగంలో అంగరంగ వైభవంతో విలసిల్లింది. ఆ భామామణి తామరసాక్షు- కృష్ణునితో శృంగార రసం, భూమాసురుడు నరకునితో వీరరసం విస్తరిల్లేలా సమరం సాగించింది. ఆమె ప్రయోగించే సాయకా- బాణాల వలన శక్తి తరగిపోగా దనుజ సైన్యం వెనుకంజ వేసి నరకుని మరుగు జొచ్చింది.
ఆ సమయంలో కంసారి- హరి, ప్రియురాలితో ‘సత్యా! అరి- శత్రు సైన్యం వెరగుపడి- బెదిరి సమర రంగం వీడి పారిపోయింది. నిన్ను విజయలక్ష్మి వరించింది’ అంటూ ఆమెను పోరు నుంచి మరల్చడానికి ధనుస్సును కోరి తీసుకున్నాడు. అప్పుడు నరకుడు మురవైరి- నగధరునితో.. ‘కృష్ణా! మగవారి యెదుట ఒక వగలాడి పౌరుషం ప్రదర్శిస్తుండగా తగవు మాని మౌనం పూనడం నీకు తగదు- అది మగతనం కాదు. శౌరీ! అసురులు అసమాన శూరులు కాన ఆడువారితో పోరాడుటకు ఆరాటపడరు’ అని హెచ్చరించాడు. పెచ్చరిల్లిన మచ్చరం- కచ్చితో లచ్చి మగని (కృష్ణుని)పై శూలం పైకెత్తే లోపుగానే ఉరుక్రముడు- హరి తన చక్రం ప్రయోగించి నరకుని తల నరికేశాడు.
శా॥ ‘ఇల్లాలం గిటియైన కాలమున మున్నే నంచు ఘోషింతు వో
తల్లీ! నిన్ను దలంచి యైన నిచటం దన్నుం గృపం గావడే
చెల్లంబో! తల ద్రెంచె నంచు నిల నాక్షేపించు చందంబునన్
ద్రెళ్లెం జప్పుడు గాగ భూమిసుతుఁ డుద్దీప్తాహవక్షోణిపై’
తల్లీ! వరాహ అవతారంలో నేను నల్లనయ్య ఇల్లాలినని చాటి చెప్పావు. నిన్ను చూచైనా నాపై ఉల్లములో అల్లన- మెల్లగా దయ చూపక, అయ్యో! నా తల త్రుంచి వేశాడే’ అని ఇలలో భూదేవిని అధిక్షేపి (నింది)స్తున్నట్లుగా భౌమాసురుడు- నరకుడు సమర భూమిలో నేలమీద కూలిపోయాడు. వీనుల విందు చేసే అందమైన ఉత్ప్రేక్ష! నరకం లాంటి నరదేహమే ‘నేను’ అని భావించే అభిమానమే నరకుడు. ఆ అభిమానాన్ని నిర్మూలించి తాను ‘తాను’- ఆత్మగా
ప్రకాశించడమే ‘దీపావళి’ అన్నారు రమణులు! (సశేషం)
-తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ ,98668 36006