– ప్రజల సమస్యలు పట్టవు.. కేసీఆర్ ను తిట్టడమే పనా?
– కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీల్లో 100 హామీలను కూడా అమలు చేయలేదు
– కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మండిపాటు
బీబీనగర్, సెప్టెంబర్ 08 : ఎన్నికలకు ముందు వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన వారం రోజుల పోరుబాట కార్యక్రమం ముగింపు సందర్భంగా భువనగిరిలో నిర్వహించనున్న కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా వారిని మండలంలోని గూడూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అరెస్టు చేసి బీబీనగర్‌కు తరలించారు. అనంతరం బీబీనగర్ మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రైతులకు ఎకరాకు రూ.15 వేల రైతు బంధు, కౌలు రైతులకు సాయం, రైతు బీమా కొనసాగింపు, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ తదితర హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయలేదన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలకు తూట్లు పొడిచిందని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆసరా పింఛన్లు రూ.4 వేలకు పెంచుతామని, వికలాంగులకు రూ.6 వేలు, మహిళలకు నెలకు రూ.2,500, నిరుద్యోగులకు భృతి ఇస్తామని హామీ ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఆ హామీని కూడా విస్మరించిందని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసిందన్నారు. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనన్నారు. అసెంబ్లీ ఘటనల సందర్భంగా మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. ఒకవైపు ప్రతిపక్ష నాయకులపై కేసులు, అరెస్టులు చేస్తూ మరోవైపు పోలీసుల దురుసు ప్రవర్తనపై చర్యలు తీసుకోకపోవడం పక్షపాత వైఖరికి నిదర్శనమన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమేనని, అయితే దాడులు, ప్రతిదాడుల సంస్కృతి మంచిది కాదన్నారు.
భువనగిరితో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడం సరైన పద్ధతి కాదని, అధికారంలో ఉన్నామని విర్రవీగితే ప్రజలు తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఓపికతో వ్యవహరిస్తున్నారని, కక్షసాధింపు రాజకీయాలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కేసీఆర్‌ను తిట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వానికి పనిగా మారిందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కోరుకునేది సంక్షేమం, అభివృద్ధి తప్ప వ్యక్తిగత విమర్శలు కాదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించి పాలన సాగించాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎలాంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలని పోలీసు యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఇకనైనా చిత్తశుద్ధితో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, మాజీ రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ యర్కల సుధాకర్ గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్ రెడ్డి, నాయకులు పిట్టల అశోక్, మంచాల రవికుమార్ , కొంతం లింగయ్యగౌడ్, అమృతం శివకుమార్, యాస సంతోష్ రెడ్డి, జక్కి నగేష్, ఎర్ర శేఖర్ రెడ్డి, ఎండీ మున్నా, దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పంజాల రామారావుగౌడ్ , గాదె కవిత, చెన్న స్వాతి మహేష్ పాల్గొన్నారు.