BRS | స్టేషన్ ఘన్పూర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల వ్యవహారశైలిపై బీఆర్ఎస్ స్టేషన్‌ఘన్‌పూర్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్ మంగళవారం ఒక ప్రకటనలో ఖండించారు. ప్రజా పాలన పేరుతో రాష్ట్రంలో పోలీసుల (Police) రాజ్యం నడుస్తోందని విమర్శించారు. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై దాడికి కుట్ర జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అక్రమంగా హౌస్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వైపు వెళ్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలను మాత్రం ఎందుకు అడ్డుకోవడం లేదని అయన ప్రశ్నించారు.
కేసీఆర్ (KCR) వ్యవసాయ క్షేత్రం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ఏం పని అని ప్రశ్నించారు. కేసీఆర్‌పై దాడికి కంటైనర్లలో ఎమ్మెల్యేలు, కార్యకర్తలను తరలిస్తున్నారంటూ ఆరోపించారు. ప్రతిపక్ష నేత ఇంటిపై దాడికి ప్రయత్నాలు జరుగుతున్నా పోలీసులు ఎందుకు స్పందించడం లేదని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హింసను ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తున్నారా ప్రశ్నించారు. ప్రతిపక్షాల నిరసనలకు ఒక న్యాయం, అధికార పార్టీ నేతలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.
హోంమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం (CM) రేవంత్‌రెడ్డికి రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వద్ద మోహరించిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని, కవ్వంపల్లిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై తెలంగాణ డీజీపీ స్పందించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని గణేశ్ తెలిపారు.