హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాను నెమ్మదిగా కదులుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ఆదివారం పుదుచ్చేరి తీరానికి చేరుకునే అవకాశమున్నదని అధికారులు అంచనా వేశారు. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతుందని చెప్పారు. ఈ నెల 30 వరకు ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన చలి గాలులు వీచే అవకాశమున్నదని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తిరిగి 9 నుంచి 11 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోయే అవకాశాలుంటాయని అంచనా వేశారు.
హైదరాబాద్‌లోనూ 3 రోజులపాటు రాత్రి ఉష్ణోగ్రతలు 11 నుంచి 14 డిగ్రీలుగా నమోదవుతాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరించారు. తుఫాను కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశమున్నట్టు పేర్కొన్నారు. డిసెంబర్ 2 నుంచి 5 వరకు రాష్ట్రంలోని దక్షిణ, తూర్పు జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని అధికారులు చెప్పారు. ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నదని తెలిపారు. చలి, వర్షాల నేపథ్యంలో ప్రజలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.