రఘునాథపాలెం, నవంబర్ 28: కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రేవంత్ సర్కారును ఎండగట్టాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్.. బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. అదే సమయంలో పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు, దీక్షా దివస్ కార్యక్రమాల నేపథ్యంలో ఖమ్మంలోని తన స్వగృహంలో శుక్రవారం ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ రఘునాథపాలెం మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో బీఆర్ఎస్ బలమైన శక్తిగా ఉందని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ సత్తాను చూపించాలని పిలుపునిచ్చారు. గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రఘునాథపాలెం మండలం ఎంతలా అభివృద్ధి చెందిందో ప్రజలకు వివరించాలని సూచించారు.
అదే సమయంలో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. నమ్మి ఓటేసిన ప్రజలను ఎలా నయవంచన చేసిందో విశదీకరించాలని సూచించారు. అలాగే, శనివారం నిర్వహించనున్న దీక్షా దివస్‌ను కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావానికి కేసీఆర్ దీక్షే కీలక మలుపు అని గుర్తుచేశారు. అందుకని, అంతటి ప్రాధాన్యమున్నందున, ఖమ్మంతో ముడిపడి ఉన్నందున శ్రేణులన్నీ అధిక సంఖ్యలో హాజరై దీక్షా దివస్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు కూరాకుల నాగభూషణం, ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, ఖమర్, వీరూనాయక్, కర్నాటి కృష్ణ, మక్బూల్, బచ్చు విజయ్‌కుమార్, పల్లా రాజశేఖర్, గుత్తా రవి, హరిప్రసాద్, చిలుమూరు కోటి, దండా జ్యోతిరెడ్డి, నాగండ్ల కోటి తదితరులు పాల్గొన్నారు.