కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 28: జమ్మికుంటలోని తనుగుల చెక్‌డ్యాం పేల్చివేతపై జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్‌చేశారు. ఈ విషయంలో దోషులకు శిక్షపడే వరకు తమ పోరాటం ఆగదని, అవసరమైతే డీజీపీతోపాటు కేంద్ర హోంమంత్రిని కలుస్తామని స్పష్టంచేశారు. చెక్‌డ్యాం పేల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాత్రిపూట పెద్దశబ్దం వచ్చిందని, చెక్‌డ్యామ్‌ను దుండగులే బాంబులు పెట్టి పేల్చివేసినట్టు స్థానికులు చెబుతున్నారని, ఈ విషయంపై ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదుచేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు.
కానీ, కేసు విచారణలో మాత్రం ఒక్క అడుగు ముందుకు సాగలేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై వెంటనే జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని కలెక్టర్‌కు విన్నవించినట్టు చెప్పారు. నాణ్యత లేకపోవడంతో కూలిపోయిందని కొంతమంది కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని, అదే నిజమైతే లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడే కొట్టుకుపోయి ఉండేదని తెలిపారు. చెక్‌డ్యాం విషయంలో తాము రాజకీయాలు చేయడం లేదని, కేవలం రైతుల బాగుకోసం పోరాటం చేస్తున్నామని స్పష్టంచేశారు. కేసీఆర్ హయాంలో ప్రతి నీటిచుక్కనూ ఒడిసిపట్టేందుకు చెక్‌డ్యామ్‌లు నిర్మించారని గుర్తుచేశారు. ఇసుకదందా కోసమే ఈ చెక్‌డ్యామ్‌ను పేల్చివేశారని ఆరోపించారు. రాష్ట్ర సంపదను ధ్వంసం చేయడాన్ని నేరంగా పరిగణించి వెంటనే దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు.
అనంతరం హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. చెక్‌డ్యాం పేల్చివేతకు ఆధారాలు బయటపెడితే పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు తన పదవికి రాజీనామా చేయడమే కాకుండా, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని మీడియా సాక్షిగా సవాల్ విసిరారని గుర్తుచేశారు. ఆ సవాల్‌ను స్వీకరించి.. చెక్‌డ్యాం పేల్చివేతకు అన్ని ఆధారాలతో వీడియోలు విడుదల చేశామని, మాట తప్పకుండా వెంటనే విజయరమణారావు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు. తాను రేవంత్‌రెడ్డికే భయపడలేదని, ఇప్పుడు ఈ బచ్చగాళ్లు ఫోన్‌చేసి బెదిరిస్తే ఎలా భయపడుతామని ప్రశ్నించారు. ఓట్ల కోసం రేవంత్‌రెడ్డి బాంబులు పెట్టి మేడిగడ్డను పేల్చివేస్తే, ఇక్కడ ఇసుకదందా కోసం పేల్చివేశారని ఆరోపించారు. నిజానికి తనుగుల చెక్‌డ్యామ్‌ను పేల్చివేసిన విషయం తమకంటే ముందుగానే ఇరిగేషన్ డీఈ రవికుమార్ చెప్పడమేకాదు, పోలీసులకు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ చెబుతున్నట్టు చెక్‌డ్యాం నాణ్యతాలోపంతో కూలిపోతే.. ఆ కాంట్రాక్టు సంస్థ అధిపతి, ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై చర్యలు తీసుకోవడంతోపాటు సదరు రాఘవ కన్‌స్ట్రక్షన్‌ను బ్లాక్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఎంపీ బండి సంజయ్‌కి ఈ విషయంపై బాధ్యత లేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు జంగిలి సాగర్, ఐలేందర్, నాయకులు సుంకిశాల సంపత్‌రావు, సూర్యశేఖర్, పబ్బతి శ్రీనివాస్‌రెడ్డి, రాజు, రవిగౌడ్, రేణుక పాల్గొన్నారు.