నవంబర్ 29తో దీక్షా దివస్‌కు పదహారు ఏండ్లు పూర్తవుతున్నాయి. నవంబర్ 29 కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాకారం. 29 నవంబర్ 2009 చరిత్ర మలుపు తిప్పినరోజు.. చారిత్రాత్మక రోజు..నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు.. డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదు. జూన్ 2 లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఎకడిది.. మలిదశ ఉద్యమంలో మరో ప్రస్థానం.. అత్యంత కీలకమైన రోజు.. యావత్తు తెలంగాణ జాగృతమైన దినం… కోట్ల మంది తెలంగాణ ప్రజలను ఉద్యమంలో నడిచేందుకు ఊపిరిలూదిన రోజు.. తెలంగాణ ప్రజలను ఐక్యం చేసి ఏకతాటిపై తీసుకు వచ్చి ప్రత్యర్థులకు ఉద్యమ రుచిచూపిన దినం 2009 నవంబర్ 29. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడించి శంఖారావం పూరించిన రోజు.. తెలంగాణ ఉద్యమ రథసారధి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది.. నేడు దీక్షా దివస్‌ను పురస్కరించుకొని ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
సిద్దిపేట, నవంబర్ 28( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి మెదక్ జిల్లా కీలకపాత్ర పోషించింది. జిల్లా నుంచి సబ్బండవర్ణాలు తెలంగాణ కోసం ఉద్యమించాయి. ‘ఫ్రీజోన్ కాదురా.. హైదరాబాద్ మాదిరా’ పేరిట 14ఎఫ్‌కు వ్యతిరేకంగా సిద్దిపేటలో నిర్వహించిన ఉద్యోగ గర్జన భారీ బహిరంగ సభ కేసీఆర్ సంచలన నిర్ణయానికి వేదికైంది. ఈ సభలో కేసీఆర్ తెలంగాణ కోసం తాను 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమైనట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి అయిన సిద్దిపేటలో తాను దీక్షను చేపడుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఉద్యమ సారథి కేసీఆర్ ప్రకటన దేశమంతా పెను ప్రకంపనలు సృష్టించింది.
ఆ తర్వాత జరిగిన ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉమ్మడి జిల్లా ప్రజలు నిలిచారు. కేసీఆర్ తన ఆమరణ నిరాహార దీక్షకు సిద్దిపేటను వేదికగా ఎంచుకోవడంతో, కేసీఆర్ దీక్షను సవాల్‌గా తీసుకున్న హరీశ్‌రావు పార్టీ ముఖ్యనేతలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి రంగధాంపల్లి అమరవీరుల స్తూపం సమీపంలో దీక్షాశిబిరం వేదిక ఏర్పాట్లు చేశారు. వేలాదిగా తరలివచ్చే ఉద్యమకారులు కూర్చునేందుకు వీలుగా విశాలమైన ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. ఓవైపు తెలంగాణ వాదులు దీక్షా ఏర్పాట్లలో నిమగ్నమైతే.. మరోవైపు సిద్దిపేటలో అడుగడుగునా ఆంక్షలు, తనిఖీలతో వేలాదిగా పోలీసులు బలగాలు మోహరించి ఖాకీవనాన్ని తలపించాయి. పదుల సంఖ్యలో ఐపీఎస్ అధికారులు, వందల సంఖ్యలో సీఐలు, ఎస్ఐలు, వేలాదిగా సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసు బలగాలు సిద్దిపేట నలువైపులా మోహరించాయి.

మెదక్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట మీదుగా రంగధాంపల్లి దీక్షా శిబిరం వైపు వచ్చేందుకు దారులన్నీ నిషేధించి.. ముళ్లకంచెలతో మూసి వేశారు. పోలీస్ అధికారుల వ్యూహాలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ హరీశ్‌రావు పకడ్బందీ ప్రణాళికతో సవాల్‌గా తీసుకుని ముందుకెళ్లారు. దీక్షా వేదక రక్షణ పార్టీ నాయకులకు, ముఖ్యంగా హరీశ్‌రావుకు సవాల్ మారడంతో.. భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు, తెలంగాణ వాదులు, కార్యకర్తలు దీక్షా ప్రాంగణానికి చేరుకోవడంలో సఫలీకృతులయ్యారు.
ఈ నేపథ్యంలో.. క్షణానికో.. పుకార్లు.., నిమిషానికో ఎత్తుగడలతో పోలీస్ అధికారులు ప్రజల్లో.., ఉద్యమకారుల్లో ఒక రకమైన భయాందోళనల పరిస్థితిని సృష్టించారు. రంగధాంపల్లి దీక్షా వేదికను భగ్నం చేసేందుకు కీలకమైన బాధ్యత మాత్రం ఐపీఎస్ అధికారి మహేశ్‌చంద్ర లడ్డాకు అప్పగించడంతో అప్పట్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కేసీఆర్ అరెస్టు వార్త విన్న వెంటనే సిద్దిపేటలోని రంగధాంపల్లి దీక్షా శిబిరంలో అలజడి మొదలైంది.. కేసీఆర్ అరెస్టు వార్త తెలుసుకున్న వెంటనే ఆయన స్థానంలో హరీశ్‌రావు దీక్ష చేపట్టారు.వీరితో పాటు ఉమ్మడి జిల్లా పార్టీ ముఖ్యనేతలు దీక్షలో కూర్చున్నారు. వీరికి వందలాది మంది కార్యకర్తలు, నాయకులు దీక్షా స్థలికి రక్షణగా నిలిచారు.

అప్పటికే పోలీసు అధికారులు వేచి చూసిన సమయం ఆసన్నమవడంతో.. పోలీసు బలగాలు పన్నిన వ్యూహంతో బారికేడ్లను బద్ధలు కొట్టి దీక్షా ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఓవైపు పోలీసులు తెలంగాణ వాదులపై లాఠీలు జులిపిస్తే.. మరోవైపు కోపోద్రిక్తులై తెలంగాణ వాదులు రాళ్లతో దాడి పాల్పడ్డారు. కొన్ని నిమిషాల వ్యవధిలో శిబిర ప్రాంగణం ఉద్రిక్త పరిస్థితుల నడుమ కొనసాగింది. అసలేం.. జరుగుతుందో.. తెలుసుకునేలోపే బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, తెలంగాణ వాదులను ఒక్కొక్కరిగా అరెస్టు చేశారు. పోలీసులు భారీగా శిబిర ప్రాంగణంలోకి దూసుకొచ్చి హరీశ్‌రావు సహా ముఖ్య నాయకులను అరెస్టు చేసి వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో కీలక ఘట్టాలకు సిద్దిపేట వేదిక కాగా, ఉమ్మడి జిల్లా ప్రజల భాగస్వాములయ్యారు.