హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పన కోసం వేసిన ప్యానల్లో తెలంగాణ మేధావులకు ప్రాతినిధ్యం ఇవ్వలేదని, 30 మంది సభ్యుల్లో కేవలం మోహన్‌గురుస్వామి ఒక్కరికే అవకాశం దక్కిందని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారని దుయ్యబట్టారు. ఆ సమావేశంలో 30 మందితో ప్యానల్‌ను ప్రకటించారని, వారిలో సికింద్రాబాద్ మోహన్‌గురుస్వామి తప్ప తెలంగాణకు చెందిన మేధాలెవ్వరికీ అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు.
అమెరికా వంటి దేశాల్లో అక్కడి ప్రధాన మంత్రులకు సలహాదారులుగా తెలంగాణ వాళ్లున్నారని వినోద్‌కుమార్ చెప్పారు. అలాంటిది తెలంగాణకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ రూపొందించే ప్యానల్లో స్థానికులకు అవకాశం దక్కకపోవడం దారుణమని మండిపడ్డారు. తెలంగాణ వాళ్లు లేకుండా వేసిన ప్యానల్‌ను ముఖ్యమంత్రే రూపొందించారా? లేక అధికారులు రూపొందిస్తే ఆయన సంతకం మాత్రమే చేశారా? అని ప్రశ్నించారు. సోనియాగాంధీ ఆధ్వర్యంలో గతంలో ఏర్పాటైన ప్యానల్లో సైతం ఇద్దరు తెలంగాణ బిడ్డలు హనుమంతరావు, జయప్రకాశ్ నారాయణ ఉండేవారని గుర్తుచేశారు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ప్యానల్లో ఇప్పటికైనా స్థానికులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ డాక్యుమెంటరీ విడుదలైన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో చర్చించి తమ పార్టీ వైఖరి వెల్లడిస్తామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విడగొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టిందని, హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి విధానం ఈ జోన్ల ఎంపికలో కనిపిస్తున్నదని వినోద్‌కుమార్ విమర్శించారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ వంటి పొటెన్షియల్ ఉన్న నగరాలు అభివృద్ధి జరుగుతుంటే.. రూరల్ తెలంగాణ అంటూ.. సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో వాటి అభివృద్ధి వెనక్కి వెళ్తుందని, ఇదొక ఫాల్తు నిర్ణయమని విమర్శించారు.
సీఎం రేవంత్‌రెడ్డి పరిపాలనా విధానం ఇలాగే ఉంటే.. 2047 కాదు కదా, ఎన్నాళ్లయినా ఫలితాలు రావు అని వినోద్‌కుమార్ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అధికారంలో ఉండేది మరో మూడేండ్లు మాత్రమే అని అన్నారు. చైనా వంటి దేశాల్లో ముఖ్యమైన నగరాలు మాత్రమే కాకుండా చిన్న పట్టణాల అభివృద్ధికి కూడా సమగ్ర ప్రణాళికలు ఉంటాయని చెప్పారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో చిన్న పట్టణాల అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం లభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు పల్లె రవికుమార్, చిరుమళ్ల రాకేశ్‌కుమార్, గోసుల శ్రీనివాసయాదవ్, కార్తీక్ రాయ పాల్గొన్నారు.