మోర్తాడ్, నవంబర్ 28 : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు కాళేశ్వరం జలాలు రాలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టంచేశారు. మిగిలి ఉన్న కొద్ది పనులు పూర్తి చేయకుండా అలసత్వం వహిస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వైఖరిని నిలదీయాల్సిందిపోయి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం, నిందలు వేయడం ఎవరి లా భం కోసమో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో రివర్స్ పంపింగ్ ద్వారా నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి కాళేశ్వరం నీళ్లను తీసుకొచ్చి నింపామని గుర్తుచేశారు. శుక్రవారం కామారెడ్డిలో ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వేముల ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్సారెస్పీలోకి ఎగువనుంచి నీరు రాకపోతే కిందినుంచి కాళేశ్వరం నీళ్లను తీసుకొచ్చి నింపేందుకు బీఆర్ఎస్ హ యాంలో రూ.1,900 కోట్లతో ఎస్సారెస్పీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ చేపట్టామని తెలిపారు. రివర్స్పంపింగ్తో వరదకాలువ ద్వారా ఎస్సారెస్పీలోకి నీళ్లు నింపామని, ఇది జిల్లా ప్రజలు, రైతులు చూసి ఎదురొస్తున్న నీళ్లకు పూలతో స్వాగతం పలికారని గుర్తుచేశారు. ఆ తర్వాత వర్షాలు బాగా పడటం తో మళ్లీ ఆ అవసరం రాలేదని చెప్పారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి మంజీరా నుంచి నీళ్లు రాకపోతే కాళేశ్వరం నీళ్లను కేసీఆర్ కట్టిన కొండపోచమ్మసాగర్ నుంచి హల్దీవాగు ద్వారా తీసుకొచ్చామని వివరించారు. స్వయంగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి దగ్గరుండి కొండపోచమ్మసాగర్ దగ్గర గేట్లు ఎత్తారని గుర్తుచేశారు. ఇక్కడ కూడా వర్షాలు బాగా పడటం వల్ల మళ్లీ నీళ్లు తెచ్చే అవసరం రాలేదని పేర్కొన్నారు.
ప్యాకేజీ-21 పనులు బీఆర్ఎస్ హ యాంలోనే 70% పూర్తయ్యాయని, బినోలా దగ్గర హెడ్‌వర్క్స్, సొరంగమార్గం పంప్‌హౌస్, మెంట్రాజ్‌పల్లి పంప్‌హౌస్ పూర్తి అయిందని వివరించారు. 21ఏ లో మెయిన్ పైప్‌లైన్ కూడా పూర్తయి కప్పలవాగు, పెద్దవాగుల్లో కాళేశ్వరం నీళ్లు పో యించిన వైనాన్ని అక్కడి రైతులు కం డ్లారా చూశారని గుర్తుచేశారు. మొన్నటి సీజన్లో భీమ్‌గల్ రైతులు నీళ్లు కావాలని అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు. 21బీ లో సొరంగ మార్గం, మంచిప్ప పంప్‌హౌస్, 70% మెయిన్ పైప్‌లైన్ పనులు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయని స్పష్టంచేశారు. ప్యాకేజీ-22 ప్రాజెక్ట్ పనులు కూడా బీఆర్ఎస్ హయాంలోనే మొదలయ్యాయని పేర్కొన్నారు. కొండెం చెరువు భూసేకరణ వివాదం కారణంగా కొంతకాలం పనులు నిలిచిపోయాయని, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఈ వివాదం పరిష్కారమైందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్యాకేజ్ 21,22 పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని, మిగిలిన పనులు పూర్తిచేయాలని అసెంబ్లీలో డిమాండ్ చేశానని చెప్పారు.