కేతేపల్లి, నవంబర్ 22 : పీవీసీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సూర్యాపేట (మేనేజింగ్ డైరెక్టర్ మహదేవ్) వారి ఆధ్వర్యంలో భీమవరం ఉన్నత పాఠశాలకు సుమారు రూ.40 వేల విలువైన బీరువా, 10 ఎస్ టైప్ కుర్చీలు శనివారం వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి అచ్యుత శర్మ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతుల కల్పన సామాజిక బాధ్యతగా భావిస్తున్నామన్నారు. సహకారాన్ని అందిపుచ్చుకుని విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. చదువులో ప్రతిభ కనబరిచిన ఏ పాఠశాలకైన దాతల సహకారం సంపూర్ణంగా లభిస్తుందన్నారు.
మండలంలో కొప్పోలు, తుంగతుర్తి పాఠశాలలకు కూడా కార్యాలయ సామగ్రి అందించినట్లు తెలిపారు. పాఠశాలకు ఏ అవసరం ఉన్నా తమ సంస్థ ద్వారా సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం సంస్థ ప్రతినిధి అచ్యుత శర్మను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు కలిసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం కె.భిక్షమయ్య, విశ్రాంత ఉపాధ్యాయులు గుండా రమేశ్, పాఠశాల ఉపాధ్యాయులు గుండా వెంకటేశ్వర్లు, గుమ్మడవల్లి రమేశ్, కన్నె శివయ్య, లగిశెట్టి శ్రీధర్, దోరేపల్లి నాగయ్య, రాపోలు పరమేశ్, జూనియర్ అసిస్టెంట్ సుమన్, అటెండర్ అహ్మద్ పాల్గొన్నారు.

Kethepally : పీవీసీ ప్రొడక్ట్స్ కంపెనీ ఆధ్వర్యంలో భీమవరం పాఠశాలకు బీరువా, కుర్చీల వితరణ