Bengal Poll Officer : పశ్చిమబెంగాల్ (West Bengal) లో ఎన్నికల జాబితా (Voter list) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఒత్తిడిని భరించలేక మరో అధికారిణి ఆత్మహత్య చేసుకున్నారు. నదియా జిల్లా (Nadia district) క్రిష్ణనగర్ (Krishna Nagar) లోని తన నివాసంలో శనివారం ఉదయం ఆమె ఉరేసుకుని ఉసురుతీసుకున్నారు.
బంగాలీ స్వామి వివేకానంద స్కూల్లో 54 ఏళ్ల రింకు తరఫ్దార్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఎన్నికల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నేపథ్యంలో ఈసీ ఆమెను బూత్ లెవల్ అధికారిణిగా నియమించింది. అయితే అప్పటి నుంచి పనిభారం పెరగడంతో ఆమె ఒత్తిడికి లోనైంది. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడింది.
రింకు తరఫ్దార్ ఆత్మహత్యకు పాల్పడిన గదిలో ఓ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో.. ‘నేను బూత్ లెవల్ అధికారి విధులు నిర్వర్తించలేకపోతున్నా. పాలనాపరమైన ఒత్తిడి బాగా పెరిగింది. ఆ ఒత్తిడిని నేను భరించలేకపోతున్నా’ అని పేర్కొన్నారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఎస్ఐఆర్ విధుల ఒత్తిడి తట్టుకోలేక ఓ అధికారిణి ఆత్మహత్య చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. గత బుధవారం జల్పాయ్గురిలో కూడా ఓ బూత్ లెవల్ అధికారిణి ఒత్తిడి భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు.