అమరావతి : ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ పనితీరు నానాటికి దిగజారిపోతుందని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణీ( MLC Varudu Kalyani ) విమర్శించారు. ప్రజల కోసం కాకుండా పాలకుల రక్షణ కోసం పనిచేస్తుందని శనివారం మీడియా సమావేశంలో ఆరోపించారు. కేంద్ర హోంశాఖ ( Union Home Department ) ఇచ్చిన నివేదిక ప్రకారం బిహార్ లాంటి రాష్ట్రానికి 15 వ స్థానం రాగా , ఏపీ పోలీసు శాఖకు వందకు 16.70 పాయింట్లు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు.
పోలీసు వ్యవస్థలను చంద్రబాబు, లోకేష్ భ్రష్టు పట్టించారని వెల్లడించారు. పోలీసులు ఖాకీ బదులు ఎల్లో దుస్తులు వేసుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూడు సింహాల పోలీసులు, మూడు పార్టీలకు తొత్తులుగా మారాయని విమర్శించారు. ఏపీలో రెడ్‌బుక్ పాలనను కొనసాగిస్తున్నారని విరుచుకుపడ్డారు.
హోంమంత్రి వంగలపుడి అనిత అసమర్ధ పాలన కారణంగా పోలీసు వ్యవస్థ దిగజారిందని అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు, మహిళలు, చిన్నారులపై దౌర్జన్యాలను అరికట్టడంలో విఫలమయ్యారని తెలిపారు. అసమర్థ పాలనకు కారకులైన చంద్రబాబు, హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో పోలీసు శాఖకు 85 అవార్డులు వచ్చాయని తెలిపారు.