నల్లగొండ, నవంబర్ 21: చెరువులే లేని వాళ్లకు టెండర్లల్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కాంట్రాక్టు అప్పగించిన మత్స్యశాఖ అధికారులు వారి పేరుతో ఆంధ్రా నుంచి రెడీమేడ్ ఫిష్‌సీడ్ కొనుగోలు చేసి ఇక్కడ చెరువుల్లో పోస్తూ మమ అనిపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలను పిలిచి ఒకటీ రెండు చెరువుల్లో వారి ద్వారా పోయిం చి తర్వాత ఆయా ప్రాంతాల్లోని చెరువుల చైర్మన్లను మేనేజ్ చేస్తూ కొద్దిమొత్తంలో చేప పిల్లలను పోస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఈ పరిస్థితిని గమనించిన మత్స్యకారులు వ్యతిరేకించటంతో మత్స్యశాఖ సిబ్బంది ఏదో చెప్పి వెళ్లిపోతున్నారు. తిప్పర్తి మండలంలోని గంగన్న పాలెంతో పాటు పీఏ పల్లి, శాలిగౌరారం, పెద్దవూర మండలాల్లో ఈ పరిస్థితి ఎదురైన ట్లు తెలిసింది.
ఆయా చెరువుల్లో ఇప్పటి వరకు 1.60 కోట్ల చేప పిల్లలు పోశామని చెబుతున్నా అవి 70 లక్షలు కూడా మించలేదని మత్స్యకారులు అంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చేప పిల్లల విడుదల ఇప్పటికే ఆలస్యం కాగా, వరుసగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలతో టెండర్లు పిలిచిన మత్స్యశాఖ అధికారులు చెరువులే లేని వారికి టెండర్లు కట్టబెట్టి నకిలీ బిల్లులు సృష్టిస్తున్నారు.
రికార్డుల్లో కోట్లు.. చెరువుల్లో లక్షలు
జిల్లాలో ఈసారి ఆలస్యంగా చేప పిల్లల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆగమేఘాల మీద టెండర్లు పిలిచిన మత్స్యశాఖ అధికారులు మొత్తం 5.98 లక్షల చేప పిల్లలు చెరువుల్లో పోయాలని నిర్ణయించారు. వాటిని జిల్లా వ్యాప్తంగా 1163 చెరువుల్లో పోయాలనే ఆలోచనతో టెండర్లు పిలిచిన అధికారులు అందులో 1.86 లక్షల పిల్లలు 35 నుంచి 45 ఎంఎం పిల్లలు, 4.11 లక్షలు 80 నుంచి 100 ఎంఎం పోసే విధంగా ప్రణాళికలు రూపొందించారు.
వాటిలో ఇప్పటి వరకు నల్లగొండ, నాగార్జున సాగర్, నకిరేకల్, తుంగతుర్తి, దేవరకొండ నియోజక వర్గాల్లోని 73 చెరువుల్లో 80 నుంచి 100 ఎంఎం పిల్లలు, 182 చెరువుల్లో 57 లక్షలు 35 నుంచి 45 ఎంఎం పిల్లలను పోసినట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ఆయా చెరువుల్లో 70 లక్షల పిల్లలు విడుదల చేయలేదని.. ఎ మ్మెల్యేలు హాజరయ్యే చెరువుల్లో తప్ప ఎక్కడా పెద్దమొత్తంలో పోయలేదని మత్స్యకారులంటున్నారు.
చైర్మన్లను మేనేజ్ చేసి మమ అంటున్నారనే విమర్శలు వచ్చాయి. తిప్పర్తి మండలంలోని గంగన్న పాలెం, తుంగతుర్తి మండలంలోని శాలిగౌరారం, నకిరేకల్ పెద్ద చెరువు, పెద్దవూర, పీఏ పల్లి, కనగల్ చెరువుల్లో తక్కువ మొత్తంలో చేప పిల్లలు పోశారని.. అవీ తక్కువ సైజ్ ఉన్నాయంటూ మత్స్యకారులు అధికారులకు ఎదురు తిరగడం విశేషం.
వన్‌మ్యాన్ షో చేసిన అధికారి
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి నుంచి టెండర్ వేసిన రాజా ఫిష్‌సీడ్ వారి పేరుతో 120 ఎకరాల భూమి ఉన్నప్పటికీ వారు రొయ్యలు తప్ప వేరే సీడ్ పెంచడం లేదు. ఆరుగురు భాగస్వాములున్న సదరు ప్రాజెక్టులో ఒకరు తమకు టెండర్ ఇవ్వొద్దని చెప్పినా మరో వ్యక్తి ద్వారా పెద్దమొత్తంలో దండుకొని వారికి టెండర్ ఇచ్చినట్లు సొసైటీ సభ్యులంటున్నారు.
లక్ష్మి ఏజన్సీస్ యజమాని వనస్థలిపురం నివాసి కాగా గతంలో ఉన్న అనుభవంతో టెండర్ వేశారని.. కైకలూరుకు చెందిన కోమలవల్లి, అన్నపూర్ణ, విజయ్ ఆల్ఇన్ వన్ ఫిష్ సీడ్ యాజమాన్యం నిత్యం ఫీల్డులో ఉంటున్నా సైజ్లెస్ పిల్లలు పోస్తున్నారని.. స్థానిక పె రుమాళ్ల ఎల్లయ్యకు సైతం చెరువే లేదని సొసైటీ సభ్యులే అంటున్నా.. వన్ మ్యాన్ షో చేస్తూ వారికే టెండర్లు ఇవ్వటం గమనార్హం.
కమిటీ సభ్యులతో వెళ్లి పరిశీలించాం
జిల్లాలో సుమారు ఆరు కోట్ల చేప పిల్లలు పోయటానికి ప్రభుత్వ ఆదేశానుసారం టెండర్లు పిలిస్తే ఆరుగురు వేశారు. దీంతో కో ఆపరేటివ్ సొసైటీతో కలిసి వెళ్లి చెరువులు అందులో ఉన్న చేప పిల్లలను పరిశీలించాం. ప్రస్తుతం ఇప్పటి వరకు జిల్లాలో 250 చెరువుల్లో 1.60 కోట్ల చేప పిల్లలు వదిలి పెట్టాం. త్వరలోనే మిగిలిన చెరువుల్లో పోస్తాం.
-రాజారామ్, ఫిషరీస్ ఇన్చార్జి ఏడీ, నల్లగొండ
ఒక్కో కాంట్రాక్టర్ నుంచి ఆరు లక్షలు
డీఎఫ్సీవోఎస్ కమిటీ ప్రస్తుతం ప్రగతిలో లేదు. దానికి సంబంధించిన చైర్మన్ ఒక్కరిని వెంటేసుకొని అధికార పార్టీ నేతల నోళ్లు మూసి, శాసన సభ్యులు హాజరయ్యే చెరువులను మాత్రమే మినహాయించి, మిగిలిన చెరువుల్లో సైజ్లెస్, క్వాలిటీ లెస్ చేప పిల్లలు పోస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో డీఎఫ్సీవోఎస్ చైర్మన్ మధ్యవర్తిత్వంలో చెరువుల చైర్మన్లను మేనేజ్ చేసి కోట్లలో పోయాల్సిన పిల్లలను లక్షల్లో పోసి మమ అనిపిస్తున్నారు.
అయితే మొత్తం ఆయా కంట్రాక్టర్ల నుంచి ముందస్తుగానే ఒక్కొక్కరి వద్ద రూ.6లక్షలు తీసుకోని ఈ ఫేక్ బిల్లులు క్రియేట్ చేసే పనిలో మత్స్యశాఖ యంత్రాంగం పడింది. రెండు నెలల కిందటే ఆ శాఖలో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన చరిత అనే అధికారి ఏసీబీకి దొరికి మచ్చ తేగా, ప్రస్తుతం అంతకు మించి జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి.