Diabetics | ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది ప్రజలు డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఒకప్పుడు కేవలం వయస్సు మీడ పడిన వారికి మాత్రమే డయాబెటిస్ వచ్చేది. కానీ ఇప్పుడు యుక్త వయస్సులో ఉన్నవారు కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అస్తవ్యవస్తమై జీవన విధానం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రాత్రిపూట ఆలస్యంగా నిద్రించడం, ఆలస్యంగా భోజనం చేయడం, అతిగా తినడం, జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకోవడం, రోజూ గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేయడం, ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉండండం.. ఇవన్నీ డయాబెటిస్ వచ్చేందుకు కారణాలు అవుతున్నాయి. ముఖ్యంగా ఇలాంటి జీవన విధానం వల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. అయితే డయాబెటిస్ సమస్య ఉన్నవారు వైద్యులు ఇచ్చే మందులను నిరంతరం వాడడంతోపాటు రోజువారి ఆహారంలో పలు మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లను రోజూ తినడం వల్ల షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
బెర్రీ పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే షుగర్ సులభంగా నియంత్రణలో ఉంటుంది. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్ప్ బెర్రీలు, బ్లాక్ బెర్రీలను రోజూ తినవచ్చు. వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ తక్కువగా ఉంటుంది. అంటే ఈ పండ్లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. దీని వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. అలాగే ఈ పండ్లలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సైతం అధికంగా ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్ పెరగకుండా చూస్తాయి. కనుక ఆయా బెర్రీలను తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. చెర్రీ పండ్లను తింటున్నా కూడా షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. చెర్రీ పండ్లు అంటే తియ్యగా ఉంటాయని, వీటిని తినకూడదని షుగర్ వ్యాధి గ్రస్తులు భావిస్తారు. కానీ అందులో నిజం లేదు. చెర్రీ పండ్లు తియ్యగా ఉన్నప్పటికీ ఈ పండ్ల గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. పైగా వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి షుగర్‌ను అదుపు చేసేందుకు సహాయం చేస్తాయి. కనుక చెర్రీ పండ్లను కూడా రోజువారి ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
యాపిల్ పండును రోజుకు ఒకటి తింటుంటే డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఒక మీడియం సైజ్ యాపిల్‌లో మనకు కావల్సిన ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఫైబర్ వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతోపాటు రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు యాపిల్ పండ్లను తింటే ఉపయోగం ఉంటుంది. పియర్ పండ్లలోనూ ఫైబర్ అధికంగా ఉండడంతోపాటు వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ తక్కువగా ఉంటుంది. ఈ పండ్లలో ఉండే ఫైబర్ షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో సహాయం చేస్తుంది. పియర్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి డయాబెటిస్‌ను అదుపు చేస్తాయి.
పీచ్ పండ్లను కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లను తింటున్నా మేలు జరుగుతుంది. పీచ్ పండ్లు చాలా జ్యూసీగా ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి. ఒక మీడియం సైజ్ పీచ్ పండులో ఫైబర్, విటమిన్ సి, ఎ అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తాయి. ఈ పండ్ల గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా తక్కువే. కనుక షుగర్ ఉన్నవారు ఈ పండ్లను తినడం ద్వారా లాభం పొందవచ్చు. సిట్రస్ జాతికి చెందిన పండ్లు కూడా షుగర్ వ్యాధి గ్రస్తులకు మేలు చేస్తాయి. ఈ పండ్లలో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. ఈ పండ్ల గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా తక్కువగానే ఉంటుంది. కనుక ఈ పండ్లను తింటుంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుంది. నారింజ, నిమ్మ వంటివి సిట్రస్ పండ్ల జాబితాకు చెందుతాయి. అలాగే అవకాడోలు, కివి పండ్లను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. డయాబెటిస్‌ను సమర్థవంతంగా అదుపులో ఉంచుకోవచ్చు.