ఇప్పటివరకు పనుల ఆలస్యానికి ప్రధానకారణం అదే..
తాజాగా కంపెనీని టేకోవర్ చేసిన వేదాంత
అదీ తీవ్రమైన నష్టాల ఊబిలోనే..
SLBC Tunnel | శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ పనులు ప్రశ్నార్థకంగా మారాయి. ఒక వైపు ప్రభుత్వం 2027 కల్లా సొరంగం పనులను పూర్తి చేస్తామని ప్రగల్బాలు పలుకుతున్నా మరోవైపు క్షేత్రస్థాయి పరిస్థితులు ఆశాజనకంగా ఏమీ లేవు. పనులను చేపట్టిన జయప్రకాశ్ అసోసియేట్స్ కంపెనీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోవడంతో సుదీర్ఘకాలంగా పనులు జాప్యానికి కారణమని తెలుస్తున్నది. తాజాగా ఆ కంపెనీని వేదాంత కంపెనీ కొనుగోలు చేసిసింది. అయితే అదీ తీవ్రమైన నష్టాల్లోనూ కొనసాగడం కొసమెరుపు. దీంతో పనుల కొనసాగింపు సాధ్యామా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
ఎస్ఎల్బీసీ టన్నెల్ 44 కి.మీ పొడవు. దానిని రెండు వైపులా నుంచి టీబీఎం టెక్నాలజీతో చేపట్టేందుకు జయప్రకాశ్ కంపెనీ పనులను చేజిక్కించుకుంది. అమెరికాకు చెందిన రాబిన్స్సన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. అయితే ఇప్పటివరకు కేవలం 34 కి.మీ టన్నెల్‌ను మాత్రమే పూర్తి చేసింది. ఇటీవలనే ఇన్లెట్ టన్నెల్లో సొరంగం పైకప్పు కూలిపోవడంతో పనులు నిలిచిపోయాయి. వాస్తవంగా 2005లో జయప్రకాశ్ ఏజెన్సీ ఎస్ఎల్బీసీ పనులను దక్కించుకుంది. అప్పటికీ కంపెనీ లాభాల్లోనే ఉన్నది. ఆదిలో పనులు సజావుగా కొనసాగాయి. టీబీఎంలు కొత్తవి కావడం, కంపెనీ సైతం లాభల్లో ఉండడంతో పనులు వడివడిగానే కొనసాగాయి.
కానీ 2009 నాటికి జయప్రకాశ్ కంపెనీ నష్టాల్లోకి జారుకున్నది. ఇది మొదలు ఎస్ఎల్బీసీ పనులు మందకొడిగా సాగడం మొదలైంది. ప్రభుత్వం ఏజెన్సీకి డబ్బులు చెల్లించినా, జయప్రకాశ్ కంపెనీ తాను ఒప్పందం చేసుకున్న రాబిన్స్సన్స్ కంపెనీకి సకాలంలో చెల్లింపులను చేయలేదు. ప్రభుత్వం చెల్లించిన డబ్బులను ఎప్పటికప్పుడు నష్టాలను పూడ్చుకోవడానికి వినియోగించింది తప్ప పనుల నిర్వహణకు వినియోగించింది తక్కువ. దీంతో టన్నెల్ పనులు జాప్యానికి గరవుతూ వస్తున్నాయి. ఇప్పటికీ 9.6కిమీ టన్నెల్‌ను పూర్తిచేయాల్సి ఉంది. గత ఫిబ్రవరిలో ఎట్టకేలకు ఇన్లెట్ టన్నెల్ వైపు నుంచి పనులను ప్రారంభించింది. ప్రారంభించిన మూడు రోజులకే టన్నెల్ పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో 8మంది కార్మికులు సొరంగంలో గల్లంతయ్యారు. ఇప్పటికీ2 మృతదేహాలను మాత్రమే వెలికితీయగా, ఇప్పటికీ 6 కార్మికుల అచూకీ లభించలేదు. మరోవైపు టన్నెల్ తవ్వకం ఆగిపోయింది.
ఇదిలా ఉంటే నష్టాల ఊబిలో కూరుకుపోయి, బ్యాంకు రుణాలను చెల్లించలేక జయప్రకాశ్ కంపెనీ దివాళా తీసింది. కంపెనీని అమ్మకానికి సిద్ధపడింది. అయితే ఈ క్రమంలో బిడ్లను ఆహ్వానించింది. రెండు ప్రధాన కంపెనీలు పోటీ పడ్డాయి. అదానీ గ్రూప్ రూ. 12000 కోట్లకు బిడ్‌ను దాఖలు చేసింది. అయితే వేదాంత కంపెనీ ఏకంగా రూ. 17000 కోట్లతో బిడ్ దాఖలు చేసింది. దీంతో జయప్రకాష్ కంపెనీని వేదాంతం స్వాధీనం చేసుకోవడం ఖరారైంది. అంతవరకు బాగానే ఉన్నా వేదాంత కంపెనీ సైతం నష్టాల్లోనూ ఉండడం ఇక్కడ కొసమెరుపు. వేదాంత కంపెనీ సైతం ఇటీవల రూ. 57,185 కోట్ల రుణాలను చెల్లించడంలో విఫలమైంది. తాజాగా ఆ కంపెనీనే జయప్రకాశ్ కంపెనీని కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే టన్నెల్ పనులపై అనుమానాలను రేకేత్తిస్తున్నది.