Yellow Eyes | పచ్చ కామెర్లు ఉన్నవారికి సహజంగానే కళ్లు పసుపు రంగులో మారి కనిపిస్తాయి. అలాగే శరీరం కూడా పసుపు రంగులోకి మారుతుంది. అయితే కళ్లు పసుపు రంగులో ఉన్నంత మాత్రాన కేవలం పచ్చ కామెర్లు వచ్చాయని కాదు. ఇందుకు ఇంకా అనేక కారణాలు కూడా ఉంటాయి. కళ్లు పసుపు రంగులోకి మారేందుకు రక్తంలో ఉండే బైలిరుబిన్ అనే వర్ణం ద్రవ్యం కారణం. కానీ కేవలం ఇదే కాదు, ఇంకా అనేక కారణాల వల్ల ఇలా కళ్లు పసుపు రంగులోకి మారుతుంటాయి. బైలిరుబిన్ అనేది మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అవుతుంది. ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం అవడం వల్ల ఇలా జరుగుతుంది. ఆరోగ్యవంతమైన లివర్ బైలిరుబిన్‌ను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసి శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. అయితే బైలిరుబిన్ నిల్వలు శరీరంలో మరీ అతిగా పేరుకుపోతే అప్పుడు శరీరంతోపాటు కళ్లు కూడా పసుపు రంగులోకి మారి కనిపిస్తాయి. దీన్నే పచ్చ కామెర్లు అంటారు.
బైలిరుబిన్ ను లివర్ సరిగ్గా బయటకు పంపలేకపోతే అప్పుడు ఆ వర్ణ ద్రవ్యం స్థాయిలు శరీరంలో పెరిగిపోతాయి. దీని వల్ల శరీరం, కళ్లు పసుపు రంగులోకి మారుతాయి. లివర్ సమస్యలు ఉన్నవారిలో ఇలా జరుగుతుంది. కనుక కళ్లు పసుపు రంగులోకి మారాయంటే అది పచ్చ కామెర్లు మాత్రమే కాదు, ఇంకా ఏదో కారణం ఉండి ఉంటుందని గుర్తించాలి. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని ఆ కారణానికి తగినట్లు చికిత్స తీసుకోవాలి. హెపటైటిస్ అనే వ్యాధి పలు రకాలుగా ఉంటుంది. లివర్ వాపులకు గురి కావడం వల్ల ఇది వస్తుంది. హెపటైటిస్ ఎ, బి, సి అనే మూడు రకాల వైరస్ ఇన్ఫెక్షన్ల వల్ల లివర్ వాపులకు గురవుతుంది. కనుకనే దీన్ని హెపటైటిస్ అంటారు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే శరీర రోగ నిరోధక కణాలు లివర్ కణాలపై దాడి ప్రారంభిస్తాయి. దీంతో లివర్ పనితీరు మందగిస్తుంది. ముఖ్యంగా మద్యం అధికంగా సేవించే వారిలో ఇలా జరుగుతుంది. కనుక కళ్లు పసుపు రంగులోకి మారాయంటే పచ్చ కామెర్లు కారణం కాకపోవచ్చు, మద్యం అతిగా సేవిస్తున్నారేమో గుర్తించాలి. మద్యం తాగడం మానేస్తే లివర్ దానంతట అదే పునరుత్తేజం చెంతుంది. దీంతో కళ్లు తిరిగి సాధారణ రంగులోకి మారుతాయి.
మద్యం అతిగా సేవించడం వల్ల కొందరికి ప్రారంభంలో కళ్లు పసుపు రంగులోకి మారకపోయినా దీర్ఘకాలంలో అది లివర్‌పై ప్రభావం చూపిస్తుంది కనుక దాని కారణంగా లివర్ సిర్రోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారిలో కూడా కళ్లు పసుపు రంగులోకి మారుతాయి. అలాగే లివర్ క్యాన్సర్ ఉన్నా కూడా కళ్లు ఆ రంగులో కనిపిస్తాయి. పిత్తాశయంలో పైత్య రసంతోపాటు బైలిరుబిన్ కూడా నిల్వ ఉంటుంది. అయితే దీర్ఘకాలంలో పిత్తాశయంలో రాళ్లు తయారయ్యేందుకు కూడా వాటి అధిక నిల్వలు కారణం అవుతాయి. కనుక కళ్లు పసుపు రంగులో ఉన్నాయంటే పిత్తాశయంలో రాళ్లు ఉండడం కూడా ఒక కారణం కావచ్చు. ఈ సమస్య ఉన్నవారికి పిత్తాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.
శరీరంలో ఎర్ర రక్త కణాలు మోతాదుకు మించి విచ్ఛిన్నం అయితే అప్పుడు బైలిరుబిన్ రక్తంలో అధికంగా పేరుకుపోతుంది. దీన్ని లివర్ వేగంగా బయటకు పంపించలేదు. దీంతో బైలిరుబిన్ స్థాయిలు అధికంగా పెరిగి అప్పుడు కళ్లు, శరీరం పసుపు రంగులోకి మారుతాయి. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యే రేటు కన్నా విచ్ఛిన్నం అయ్యే రేటు మరీ ఎక్కువగా ఉంటే ఆ స్థితిని హెమోలైటిక్ అనీమియా అంటారు. ఈ స్థితిలో కూడా కళ్లు పసుపు రంగులోకి మారుతాయి. కొందరికి మలేరియా జ్వరం కారణంగా ఎర్ర రక్త కణాలు వేగంగా విచ్ఛిన్నం అవుతాయి. కనుక మలేరియా వచ్చిన వారిలోనూ అప్పుడప్పుడు కళ్లు పసుపు రంగులో కనిపిస్తాయి. ఇలా కళ్లు పసుపు రంగులో కనిపించేందుకు అనేక కారణాలు ఉంటాయి. కనుక ఈ సమస్యను కేవలం పచ్చ కామెర్లుగా భావించకూడదు. మీకున్న అనారోగ్య సమస్య లక్షణాలను బట్టి వైద్యులకు చెబితే వారు పరీక్షలు చేసి మీకు కళ్లు అలా ఎందుకు మారాయో నిర్దారిస్తారు. అప్పుడు కచ్చితమైన చికిత్స తీసుకుని ప్రాణాలను నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది.