Green Chilli | భారతదేశంలో చాలా మంది కారం ప్రియులు ఉంటారు. అధిక శాతం మంది కారంగా ఉండే వంటలను తినేందుకే ఇష్టపడుతుంటారు. అందుకనే భారతీయుల కూరలు చాలా కారంగా ఉంటాయి. ఇతర దేశీయులు మన వంటకాలను తినాలంటే అందుకనే భయపడతారు. అయితే ప్రస్తుతం కారం తినేవారు చాలా తగ్గిపోయారు. పిజ్జాలు, బర్గర్ల వంటి జంక్ ఫుడ్‌ను తింటూ అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు చిన్నతనంలోనూ కారం అధికంగా తినేవారు. కానీ ఇప్పుడు చిన్నారులు అసలు కారం తినడం మానేశారు. కారం తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుందని, అల్సర్లు వస్తాయని చాలా మందిలో ఒక నమ్మకం ఉంది. కనుకనే చాలా మంది కారం తినడం లేదు. అయితే ఇందులో కొంత మాట వాస్తవమే అయినా అల్సర్లు వచ్చేందుకు పూర్తిగా కారం తినడమే కారణం కాదు, ఇంకా అనేక కారణాలు కూడా ఉంటాయి. కానీ కారాన్ని రోజూ మోతాదులో తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
కారం అంటే మనం దీన్ని రెండు రకాలుగా తినవచ్చు. పచ్చి మిర్చి లేదా ఎండు కారం. ఈ రెండింటిలో దేన్ని తిన్నా సరే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా పచ్చిమిర్చిలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి అనేక లాభాలను అందిస్తాయి. పచ్చి మిర్చిలో క్యాప్సెయిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీర మెటబాలిజంను పెంచుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. బరువు నియంత్రణలో ఉండాలనుకునే వారు పచ్చి మిర్చిని తింటుంటే మేలు జరుగుతుంది. పచ్చి మిర్చిలో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీని వల్ల సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
పచ్చి మిర్చిలో ఉండే విటమిన్ సి వల్ల మనం తిన్న ఆహారాల్లో ఉండే ఐరన్‌ను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. అలాగే విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పచ్చి మిర్చిని తింటే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీని వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. పచ్చి మిర్చిలో ఉండే క్యాప్సెయిసిన్ అనే సమ్మేళనం యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇది తీవ్రమైన నొప్పులు, వాపులను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. పచ్చి మిర్చిని తినడం వల్ల జీర్ణ రసాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి మనం తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తాయి. దీంతో అజీర్తి తగ్గుతుంది. ఇలా పచ్చి మిర్చిని తింటే అనేక లాభాలను పొందవచ్చు.
పచ్చి మిర్చిని తినడం వల్ల లాభాలు కలిగే మాట వాస్తవమే అయినప్పటికీ వీటిని మోతాదులోనే తినాల్సి ఉంటుంది. రోజుకు 1 లేదా 2 పచ్చి మిర్చిని తినవచ్చు. అంతకు మించి తింటే దుష్పరిణామాలు సంభవిస్తాయి. పచ్చి మిర్చిలో ఉండే క్యాప్సెయిసిన్ శరీరంలో అధికమైతే జీర్ణాశయ పొరలు దెబ్బతింటాయి. దీని వల్ల అసిడిటీ, కడుపు నొప్పి, విరేచనాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్లనే కొందరు కారం మరీ అతిగా తిన్నప్పుడు పడక విరేచనాలు అవుతాయి. కనుక కారం వల్ల లాభాలను పొందాలనుకుంటే దాన్ని మోతాదులోనే తినాల్సి ఉంటుంది. అధికంగా తింటే ఇబ్బందులు వస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.