మధిర, సెప్టెంబర్ 06 : మధిర – వైరా రోడ్డు మార్గంలో రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. కానీ ఆర్ అండ్ బి అధికారులు తూతూ మంత్రంగా రోడ్డుపై ప్యాచ్ వర్క్లు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నియోజవర్గ కేంద్రానికి ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే భట్టి పర్యటన ఉన్నప్పుడల్లా మరమ్మతులు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ మరమ్మతులు కూడా ఆర్ అండ్ బి అధికారులు వేరే చోట నుంచి గ్రావెల్ కానీ రెడీమిక్స్ ద్వారా కాకుండా రోడ్డు పక్కన ఉన్న మట్టిని తవ్వి గుంటల్లో పోసి చేతులు దులుపుకుంటున్నారని మండిపడుతున్నారు. అంతేకాకుండా తాత్కాలికంగా చేసిన మరమ్మతులకు కాంట్రాక్టర్లు అక్రమంగా బిల్లులు చేసుకుంటున్నరని స్థానికులు ఆరోపించారు.
ప్రతిసారి ఇదేవిధంగా పనులు చేస్తున్న ఆర్ అండ్ బి అధికారులు పూర్తిస్థాయి ప్యాచ్ వర్క్ చేయకపోవడంతో వర్షాలు వచ్చినప్పుడు ఆ తవ్వినచోట నీళ్లు నిలిచి పాదచారులు, వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్ అండ్ బి అధికారుల తీరుతో రోడ్లు బాగు అటుంచి రోడ్ల పక్కన సైతం గుంతలమయం అవుతుందన్నారు. ఇప్పటికైనా అధికారులు పూర్తిస్థాయిలో పనిచేసే గుంతల నుంచి విముక్తి కల్పించాల్సిందిగా కోరుతున్నారు.
Madhira : మధిర – వైరా మార్గంలో తూతూ మంత్రంగా ప్యాచ్ వర్క్లు