హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీలో జర్నలిస్టు సంఘాల బాధ్యులను సమాచార, పౌరసంబంధాలశాఖ నియమించింది. టీయూడబ్ల్యూజే(హెచ్-143), టీయూడబ్ల్యూజే, టీడబ్ల్యూజేఎఫ్, టీజేఏ, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ నుంచి ప్రతినిధులకు అవకాశం కల్పించింది. ఈ మేరకు బుధవారం సమాచార, పౌరసంబంధాలశాఖ ప్రత్యేక కార్యదర్శి సీహెచ్ ప్రియాంక ఉత్తర్వులు జారీచేశారు. అక్రెడిటేషన్ కమిటీ సభ్యులుగా టీయూడబ్ల్యూజే(హెచ్-143) నుంచి ఆస్కాని మారుతీసాగర్, టీయూడబ్ల్యూజే నుంచి కే విరాహత్అలీ, టీజేఏ నుంచి బిజిగిరి శ్రీనివాస్, ప్రెస్‌క్లబ్ నుంచి రమేశ్ వరికుప్పలను నియమించారు.
ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే(హెచ్-143) తరఫున నియామకమైన ఆ సంఘం ప్రధాన కార్యదర్శి, జై తెలంగాణ టీవీ సీఈవో ఆసాని మారుతీసాగర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి జర్నలిస్టుకూ అక్రెడిటేషన్ కార్డు వచ్చేందుకు కమిటీ సమావేశాల్లో చర్చిస్తామన్నారు. 252 జీఓ ప్రకారం కార్డుల సంఖ్య తగ్గుతుండటంతో వాటిని పెంచే విషయంలో, కేబుల్ జర్నలిస్టులకు రాష్ట్రస్థాయిలో కార్డులు జారీ చేయించే విషయంలో, డెస్ జర్నలిస్టులకు కార్డుల సంఖ్య పెంచే విషయంలో ఒక సభ్యుడిగా ప్రభుత్వ పెద్దలతో చర్చించి అందరికీ న్యాయం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కార్డుల పెంపు విషయంలో న్యాయం జరుగకపోతే టీయూడబ్ల్యూజే(హెచ్-143)తరఫున ఉద్యమ కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు. తనను ప్రతిపాదించిన టీయూడబ్ల్యూజే(హెచ్-143)రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.