హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): శాస్త్ర ప్రమాణాలతో పండుగలు, వ్రతాలు, ఉత్సవ తేదీలను నిర్ణయించడం సమాజంలో సందేహాలను తొలగిస్తుందని పుష్పగిరి జగద్గురు మహా సంస్థానం పీఠాధిపతి అభినవోద్దండ విద్యాశంకరభారతీస్వామి పేర్కొన్నారు. రెండురోజులపాటు కొనసాగే తెలంగాణ విద్వత్సభ దశాబ్ది ఉత్సవాలు శనివారం రవీంద్రభారతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పుష్పగిరి పీఠాధిపతి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్వత్సభ దశాబ్ది ఉత్సవ సంచిక విద్వత్సభ సంహిత-దశాబ్ది దీపికను ఆయన ఆవిష్కరించారు. వేద, శాస్త్ర, ఆగమ, జ్యోతిష పండితులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి సనాతన ధర్మ పరిరక్షణకు పాటుపడుతున్న విద్వత్సభను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. దేవాదాయ శాఖ డైరెక్టర్ ఎం హనుమంతరావు మాట్లాడుతూ.. సమాజంలో పండుగల పట్ల ఉన్న సందిగ్ధతను తొలగించడంలో విద్వత్సభ కృషి అభినందనీయమని కొనియాడారు.
రాష్ట్రంలోని అనేకమంది సిద్ధాంతులు, ఆగమ ధర్మశాస్త్ర పండితులు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు స్వచ్ఛందంగా సేవలందించడానికి సిద్ధంగా ఉన్నారని, వారిని ఆలయాలకు ఆగమ సలహాదారులుగా నియమించాలని విద్వత్సభ కోశాధికారి మరుమాముల వెంకటరమణ శర్మ దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావును కోరగా ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇటువంటి సభల ద్వారా ప్రజల్లో పండుగలు, వ్రతాల నిర్వహణ విషయంలో చాలాకాలంగా ఏర్పడుతున్న సమస్యలు తొలగిపోతున్నాయని, ప్రధానంగా ఒక పండుగ ఎప్పుడు చేసుకోవాలనేది తెలుసుకునే క్రమంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, విద్వత్సభ ఆ సమస్యలు తొలగించి ముందస్తుగానే పండుగల నిర్ణయం శాస్త్రీయంగా పూర్తి ఆధారాలు సహా ప్రకటించడం ఆనందంగా ఉన్నదని చెప్పారు.
ఆగమ సంప్రదాయాలను పరిరక్షించాలి
పదేండ్ల క్రితం రవీంద్రభారతిలోనే ఆవిర్భవించిన విద్వత్సభ తిరిగి ఇదే వేదికపై దశాబ్ది ఉత్సవాలను నిర్వహించుకోవడం ఆనందంగా ఉన్నదని నిర్వాహకులు తెలిపారు. మొదటిరోజు కార్యక్రమాల్లో భాగంగా జ్యోతిష సదస్సు, ఆగమ సదస్సు, విద్వత్సమ్మేళనం నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో పంచాంగాల మధ్య కనిపిస్తున్న భేదాలను తగ్గించి, శాస్త్ర ప్రమాణాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవలసిన అవసరాన్ని వక్తలు చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ విద్వత్సభ అధ్యక్షుడు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి, కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి, సీతా డైరెక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్యులు, ప్రముఖ జ్యోతిష పండితుడు శంకరమంచి రామకృష్ణశర్మ తదితరులు పాల్గొన్నారు.