‘మిస్టర్ బచ్చన్’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఉత్తరాది భామ భాగ్యశ్రీ బోర్సే. తర్వాత ‘కింగ్డమ్’, ‘ఆంధ్రకింగ్ తాలుకా’ సినిమాల్లో మెరిసింది. తమిళంలో ‘కాంత’తో ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్ హిట్ పడకపోవడంతో అన్లక్కిగా ముద్రపడింది. అఖిల్ అక్కినేనితో కలిసి నటించిన ‘లెనిన్’ హిట్ కొట్టడంతో ఈ బ్యూటీ మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఈ సంతోషంలో భాగ్యశ్రీ పంచుకున్న కార్వాన్ కబుర్లివి.
నేను పుట్టిన కొన్నిరోజులకే నాన్న జాబ్ పోయింది. దీంతో ఫ్యామిలీని పోషించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ‘నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వాళ్లను పోషించేందుకు ఉద్యోగం ఇవ్వండి’ అంటూ చాలామందిని వేడుకున్నారు. చిన్నప్పుడు ఆ పరిస్థితుల్లో ఆయనను చూసి బాధేసింది. బాల్యంలో ఆరేండ్లపాటు నైజీరియాలో పెరిగాను. ఇండియాకు వచ్చిన కొత్తలో ఇంగ్లిష్ మాట్లాడటం సరిగ్గా వచ్చేది కాదు. స్కూల్లో తోటి విద్యార్థులు ఎగతాళి చేసేవారు. ఆ సమయంలో తీవ్ర ఆందోళనకు గురయ్యా. ఆ తరువాత ప్రాక్టీస్ చేసి పబ్లిక్ స్పీకింగ్‌పై పట్టు సాధించా.
ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చినదాన్ని కావడంతో కొత్తలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా. మిస్టర్ బచ్చన్ సినిమా ప్రమోషన్స్ సమయంలో హీరోకు, నాకు మధ్య ఉన్న ఏజ్ గ్యాప్‌ను ఎత్తిచూపుతూ సోషల్‌మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ చేశారు. కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి నెగిటివిటీని ఫేస్ చేయడం చాలా ఇబ్బందిగా అనిపించింది.
తాప్సీ, శ్రుతిహాసన్, శ్రీలీల వంటి అగ్ర కథానాయికలు కూడా ప్రారంభంలో ఇలాంటి విమర్శలే ఎదుర్కొన్నారు. సినిమా విజయం లేదా ఓటమి అనేది ఒకరి వల్ల మాత్రమే సాధ్యపడదు. అది క్రికెట్ టీమ్ లాంటి ఉమ్మడి బాధ్యత. చాలా రోజులుగా సక్సెస్కోసం ఎదురుచూస్తున్న నా కలను లెనిన్ సాకారం చేసింది. ఆ సినిమా సక్సెస్‌తో ప్రస్తుతం సంతోషంగా ఉన్నాను. నిరంతర కఠోర శ్రమే ఇక్కడవరకు తీసుకొచ్చింది.
షారుక్‌ఖాన్ నా ఫస్ట్ క్రష్. ఆయనతో కలిసి నటించాలనేది నా జీవితకాలపు కల. అనుష్క శెట్టి ‘అరుంధతి’ పాత్రలో ఒదిగిపోయారు. అలాంటి మహిళా ప్రాధాన్యం కలిగిన బలమైన పాత్రలు చేయాలనుకుంటున్నా. ఇక నన్ను నన్నుగా అర్థం చేసుకునే వ్యక్తినే ప్రేమించి పెళ్లి చేసుకుంటా. ప్రస్తుతం ఎవరితోనూ ప్రేమలో లేను. పూర్తిగా కెరీర్‌పైనే దృష్టి పెట్టా.
అఖిల్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు కాస్త సిగ్గుపడుతూ ఉండేవాడు. ఆ తరువాత మంచి సపోర్టివ్‌గా ఉన్నాడు. అతనితో పనిచేయడం సరదాగా అనిపించింది. షూటింగ్లో లెనిన్, భారతి పాత్రల్లో లీనమై పోయాం కాబట్టే మా మధ్య కెమిస్ట్రీ సరిగ్గా కుదిరింది. కొంత సమయం తీసుకొనైనా ఓ మంచి కథతో కలిసి నటిస్తాం.