విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి (Devi Navaratri) ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగుతాయి. అమ్మవారు 11 రోజుల్లో 11 రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా తొలిరోజు బాలాత్రిపుర సుందరీదేవి అలంకరణలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా ఈ నెల 29న సరస్వతీ దేవి రూపంలో దర్శనమివ్వనున్నారు.
సెప్టెంబర్ 23న- శ్రీ గాయత్రీ దేవి అవతారం
దసరా ఉత్సవాల్లో రెండో రోజు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారికి నారింజ రంగు వస్త్రం సమర్పించాలి. పసుపు రంగు పూలతో అమ్మవారిని పూజించాలి. ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదించాలి.
సెప్టెంబర్ 24న- అన్నపూర్ణా దేవి అవతారం
మూడో రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణా దేవిగా దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి లేత పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. తెల్ల చేమంతులుతో అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు సమర్పిస్తారు.
సెప్టెంబర్ 25న- కాత్యాయనీ దేవి అవతారం
నాలుగో రోజైన గురువారం.. అమ్మవారు శ్రీ కాత్యాయనీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి ఎరుపు లేదా తేనే రంగు వస్త్రాన్ని సమర్పించాలి. ఎరుపు రంగు పూలతో అమ్మవారిని పూజించాలి. బెల్లం అన్నం, తేనే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి.
సెప్టెంబర్ 26న- మహాలక్ష్మి దేవి అవతారం
ఐదో రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. ఈ రోజు అమ్మవారికి ముదురు గులాబీ వస్త్రాన్ని సమర్పించాలి. కలువ, పారిజాత పూలతో అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి ఈ రోజు పూర్ణం బూరెలు నైవేద్యంగా సమర్పించాలి.
సెప్టెంబర్ 27న- లలితా దేవి అవతారం
ఆరో రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి ముదురు బంగారు రంగు వస్త్రం సమర్పించాలి. కనకాంబరాలతో అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి నైవేద్యంగా ఈ రోజు కదంబం ప్రసాదాన్ని నివేదిస్తారు.
సెప్టెంబర్ 28న- చండీదేవి అవతారం
సాధారణంగా అయితే నవరాత్రుల్లో ఏడో రోజు సరస్వతి దేవి అలంకారం ఉంటుంది కానీ ఈసారి మూలా నక్షత్రం సప్తమి, తిథి మరుసటి రోజు ఉండడం వల్ల ఏడో రోజు అమ్మవారు చండీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ రోజు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించాలి. అమ్మవారికి ఈ రోజు ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పించాలి. చింతపండు పులిహోర, రవ్వ కేసరి వంటి నైవేద్యాలను సమర్పించాలి.
సెప్టెంబర్ 29న- సరస్వతి దేవి అవతారం
ఎనిమిదో రోజు అమ్మవారు శ్రీ సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి తెల్లని వస్త్రం సమర్పించాలి. తెల్లని పూలతో అమ్మవారిని పూజించాలి. పాల పాయసం నివేదించాలి.
సెప్టెంబర్ 30న- దుర్గాదేవి అవతారం
తొమ్మిదో రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పించాలి. ఎరుపు, పసుపు రంగు పూలతో అమ్మవారిని పూజించాలి. రవ్వ కేసరి, నిమ్మకాయ పులిహోర వంటి ప్రసాదాలు అమ్మవారికి నివేదించాలి.
అక్టోబర్ 1న- మహిషాసుర మర్ధిని అవతారం
పదో రోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ రోజు అమ్మవారికి ఆకు పచ్చని వస్త్రం సమర్పించాలి. కదంబ పూలతో అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి నైవేద్యంగా ఈ రోజు చక్ర పొంగలి నివేదించాలి.
అక్టోబర్ 2న- రాజరాజేశ్వరి అవతారం
చివరి రోజైన విజదశమి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు. ఈ రోజు అమ్మవారికి ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను సమర్పించాలి. రంగు రంగు పూలతో అమ్మవారిని పూజించాలి. బూందీ లడ్డూలు , చింతపండు పులిహోర, రవ్వ కేసరి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 23నుంచి ప్రారంభంకానున్నట్టు టీ టీడీ తెలిపింది. 9 రోజులపాటు జరిగే వేడుకలకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఒక్కోరోజు ఒక్కో వాహనంపై స్వామివారు విహరించనున్నారు. 27న గరుడసేవ నిర్వహించనున్నారు. ఊ రేగింపు సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి తిరుమలకు గొడుగులను ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీ. దీంతో టీటీడీ భక్తులకు కీలక ప్రకటన చేసింది. భక్తులు కానుకలు చెల్లించరాదని విజ్ఞప్తిచేసింది.