హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదేండ్లలో సాధించిన ప్రగతి దేశానికి నమూనాగా ఎలా నిలిచిందో బుధవారం తెలంగాణభవన్ దృశ్యమానం చేసింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కండ్లకు కట్టినట్టు చూపించింది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మార్చేందుకు అనుసరించాల్సిన లాంఛనాలను పూర్తికి టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం తెలంగాణభవన్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణభవన్ ప్రాంగణం లోపలా.. బయటా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో సాధించిన అభివృద్ధిని కండ్లకు కట్టేలా హోర్డింగులు ఏర్పాటు చేశారు. భవన్ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఇరువైపులా ఆసరా పింఛన్ లబ్ధిదారుల చిరునవ్వుల దరహాసం.. గొర్లపంపిణీతో ఎలమంద చిద్విలాసం.. కల్యాణలక్ష్మి/షాదీముబారక్ చెక్కులు అందుకుంటున్న ఆడబిడ్డల సంబురం.. కేసీఆర్ కిట్లు అందుకుంటున్న పొత్తిళ్ల బిడ్డతో తల్లీబిడ్డల ఆనందమోములు.. ఇలా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ తేజోగాథల దృశ్యాలతో తెలంగాణభవన్ ఆకర్షణీయంగా ముస్తాబైంది.
ప్రత్యేక ఆకర్షణగా సీఎం కేసీఆర్ కటౌట్
భారత్ చిత్రపటం మధ్యలో రూపొందించిన సీఎం కేసీఆర్ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణభవన్ లోపలికి ప్రవేశించగానే తెలంగాణను ఆకుపచ్చని మాగాణం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు నమూనా ఆహూతులకు స్వాగతం పలికింది. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన ప్రతినిధులు తెలంగాణభవన్ ముస్తాబును చూసి ముచ్చటపడ్డారు. భవన్ ప్రాంగణాన్ని అత్యద్భుతంగా అలంకరించిన తలసాని సాయిని పలువురు అభినందించారు.
ప్రజాపార్టీని విలీనం చేస్తాం
కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన దేశానికి శుభపరిణామం. ఆయనతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నాం. మా పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. బీజేపీ మతోన్మాద, ప్రజావ్యతిరేక విధానాలను నిలువరించడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. ఆ రెండు పార్టీలకు కేసీఆరే ప్రత్యామ్నాయం.
– జీ శ్రీనివాసరావు, ఆంధ్ర రాష్ట్ర ప్రజాపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు
సరైన సమయంలో సరైన నిర్ణయం
సీఎం కేసీఆర్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొన్నారు. దేశ రాజకీయాల్లో గొప్ప మలుపు ఇది. ప్రస్తుతం దేశాభివృద్ధిపై, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సరైన దృక్ఫథమున్న నాయకుడు లేడు. ఆ లోటును కేసీఆర్ భర్తీ చేయగలరు.
– సుదీప్ అవస్థి, ఇంటర్ పెనిన్సులార్ రివర్ బేసిన్ సభ్యుడు, ఛత్తీస్‌గఢ్
కేసీఆర్.. పాన్ ఇండియా లీడర్
కేసీఆర్ పాన్ ఇండియా లీడర్. ఆయన ఎప్పుడో జాతీయ రాజకీయాల్లోకి రావాల్సింది. ప్రత్యామ్నాయం లేని కారణంగానే దేశ ప్రజలు రెండు పార్టీల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. దేశానికి కొత్త ఉత్తేజం, కొత్త పార్టీ అవసరం ఎంతో ఉన్నది. కేసీఆర్ గొప్ప పాలనా దక్షుడు దేశ వనరులపై, ప్రజా సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న నేత.
– యోగేశ్మిశ్రా, ఎడిటర్ ఇన్ చీఫ్, న్యూస్‌ట్రాక్, లక్నో, యూపీ
నీటివనరులపై అవగాహన ఉన్న నేత
కాంగ్రెస్ పని అయిపోయింది. బీజేపీవి ప్రమాదకర విధానాలు. ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి నాయకత్వం వహించేందుకు కేసీఆర్ ముందుకు రావడం అభినందనీయం. దేశంలోని నీటి వనరులపై కేసీఆర్‌కు సంపూర్ణ అవగాహన ఉన్నది. ఆయనతో కలిసి నడిచేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం.
– శివరాజ్ గౌడప్ప, నీటి సంఘాల అధ్యక్షుడు, యర్నాల్, కర్ణాటక
మూస విధానాలకు స్వస్తి
కాంగ్రెస్, బీజేపీ మూస విధానాలకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం అభినందనీయం. తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దిన విధానం అద్భుతం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. – అప్పా సహేబ్, బెంగళూరు
దేశం ఎదురుచూస్తున్నది
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం ఆనందంగా ఉన్నది. ఆయన సుదీర్ఘ పాలనా అనుభమున్న నాయకుడు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అద్భుతాలను సృష్టిస్తున్నారు. బుందేల్‌ఖండ్ ప్రజలు కేసీఆర్ లాంటి నేత సారథ్యాన్ని కోరుకొంటున్నారు.
– అనిల్‌శర్మ, సీనియర్ పాత్రికేయుడు, బుందేల్‌ఖండ్
నీటివనరులపై అవగాహన ఉన్న నేత
దేశాన్ని ప్రగతిపథంలో నడిపే శక్తి కాంగ్రెస్, బీజేపీకి లేవు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ తరహాలో రాహుల్‌గాంధీ ప్రభావాన్ని చూపలేకపోతున్నారు. బీజేపీ విభజన రాజకీయాలు దేశ సమగ్రతకే ముప్పు. బీజేపీని నిలువరించే శక్తి కేసీఆర్‌కు ఉన్నది. దేశం ఎదుర్కొంటున్న నాయకత్వ లోటును భర్తీ చేయగలిగే ఏకైక నేత.
– డాక్టర్ స్నేహాల్ డోండె, మేళా చైర్మన్, ఇంటర్ పెనిన్సులార్ రివర్ బేసిన్ కోర్ మెంబర్
కేసీఆర్‌తో దేశప్రగతి
కాంగ్రెస్ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది. రాహుల్‌గాంధీ బీజేపీని నిలువరించలేకపోతున్నారు. కేసీఆర్‌కు ఆ సత్తా ఉన్నది. తెలంగాణను అన్నిరంగాల్లో అద్భుతంగా తీర్చిదిద్దారు. అధ్యయన శీలి, ఆచరణవాది, సమస్యలను పరిష్కరించగలిగే చొరవ కలిగిన నేత కేసీఆర్. తప్పకుండా జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపుతారు. – గురుస్వామి, సేవాదళ్, తమిళనాడు ఎస్సీ,ఎస్టీ చైర్మన్, కాంగ్రెస్ కమిటీ లీగల్ వింగ్ జనరల్ సెక్రటరీ
కేసీఆర్ సారథ్యం అత్యవసరం
దేశం నాయకత్వ లోటును ఎదుర్కొంటున్నది. కాంగ్రెస్, బీజేపీ వ్యాపారవర్గాలకు లబ్ధి చేకూర్చే పాలసీలను అమలుచేస్తున్నాయి. దేశ సామాజిక, భౌగోళిక పరిస్థితులు, ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న నాయకుడు కేసీఆర్. సుదీర్ఘ రాజకీయ అనుభవశాలి. అధ్యయనశీలి. తెలంగాణను తీర్చిదిద్దుతున్న విధానమే కేసీఆర్ పనితీరుకు గీటురాయి. అలాంటి నాయకుడే దేశానికి కావాలి. బీఆర్ఎస్ పెట్టడం శుభపరిమాణం. – వీ ప్రకాశ్, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్
బీజేపీకి ప్రత్యామ్నాయం కేసీఆర్
ప్రతిపక్షపాత్రను పోషించడంలో కాంగ్రెస్ విఫలమైంది. బీజేపీవి ప్రమాదకర విధానాలు. సంక్షోభ సమయంలో ‘నేనున్నాను’ అని భరోసా ఇవ్వగల నాయకుడే నిజమైన సారథి. కేసీఆర్ ఇప్పుడు సరిగ్గా అదే చేస్తున్నారు. ఆయనతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. కేసీఆర్ గొప్ప అడ్మినిస్ట్రేటర్.
–సత్యనారాయణ, తంజావూరు, నీటిరంగ నిపుణులు
కేసీఆర్ నాయకత్వం అత్యవసరం
దేశంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనే ఏ పార్టీ చేయడం లేదు. వ్యవసాయ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యం ఇస్తున్నది. కేసీఆర్ జాతీయ పార్టీని పెట్టడం శుభపరిణామం. కేసీఆర్ నాయకత్వం దేశానికి అత్యవసరం.
– అనిల్‌పాటిల్, చైర్మన్, మహారాష్ట్ర వికాస్ కేంద్రం, నీటిరంగ నిపుణులు
కిసానోంకా లీడర్ కేసీఆర్
బీజేపీ వ్యాపారవర్గాల కొమ్ముకాస్తున్నది. కాలాచోరి, కట్టమారి ప్రభుత్వం కొనసాగుతున్నది. గతంలో కాంగ్రెస్ కూడా అవే విధానాలను అవలంబించింది. కేసీఆర్ కిసానోంకా లీడర్. అలాంటి నాయకుడు జాతీయ పార్టీని ప్రకటించడం శుభపరిణామం.
– రఘునాథ్ దాదాపాటిల్, షేత్కరి సంఘటన్ అధ్యక్షుడు, మహారాష్ట్ర
పాలనాదక్షుడు కేసీఆర్
కాంగ్రెస్, బీజేపీ దేశాన్ని ముందుకు నడపడంలో విఫలమయ్యాయి. దేశాన్ని ప్రగతిపథంలో నడపగలిగే లక్షణాలు కేసీఆర్‌లో ఉన్నాయి. తెలంగాణను తాగు, సాగునీటి కల్పనలో ఆదర్శంగా నిలిపారు. పారిశ్రామిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. అలాంటి నాయకుడే దేశానికి కావాలె. – మహేంద్రా మోదీ, యూపీ రిటైర్డ్ డీజీపీ