Deepti Sharma : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మొదటి సీజన్లో మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. దాంతో, బరిలో ఉన్న ఐదు జట్లు సన్నాహాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే కొన్ని జట్లు కెప్టెన్లు, వైస్ కెప్టెన్లను నియమించాయి. తాజాగా యూపీ వారియర్స్ వైస్ కెప్టెన్‌గా భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ ఎంపికైంది. ఈ మేరకు ఆ ఫ్రాంఛైజీ ప్రకటన విడుదల చేసింది. అలిసా హేలీ (ఆస్ట్రేలియా)కు కెప్టెన్సీ అప్పగించింది.
దీప్తిని వేలంలో రూ. 2.6 కోట్లకు యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది. ఈ వేలంలో అత్యధిక ధర పలికిన రెండో భారత క్రికెటర్‌గా ఆమె గుర్తింపు సాధించింది. ఈ వేలంలో స్మృతి మంధాన రికార్డు ధర పలికింది. ఈ స్టార్ ఓపెనర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.3.44 కోట్లకు దక్కించుకుంది.
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్‌లో దీప్తి రాణించింది. ఐదు మ్యాచుల్లో అరు వికెట్లు పడగొట్టింది. స్పిన్నర్ అయిన దీప్తి మెరిక లాంటి ఫీల్డర్ కూడా. బీసీసీఐ తొలిసారిగా మొదటిసారి నిర్వహిస్తున్న డబ్ల్యూపీఎల్ మార్చి 4న ముంబైలో ప్రారంభం కానుంది. అదే రోజు డీవై పాటిల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టు గుజరాత్ జెయింట్స్‌తో తలపడనుంది.26వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఐదు జట్లు 23 రోజుల పాటు అభిమానులకు అసలైన క్రికెట్ మజాను పంచనున్నాయి.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన దీప్తి 2016లో పొట్టి క్రికెట్లో ఆరంగేట్రం చేసింది. ఇండియా తరఫున 92 మ్యాచులు ఆడిన ఆమె 102 వికెట్లు పడగొట్టింది. ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పలు లీగ్స్‌లో ఆడిన అనుభవం కూడా ఆమెకు ఉంది. వెస్టర్న్ స్టార్మ్, సిడ్నీ థండర్స్ (మహిళల బిగ్‌బాష్ లీగ్), బర్మింగ్హమ్ ఫీనిక్స్, లండన్ స్పిరిట్ వంటి జట్లకు దీప్తి ఆడింది. ఫ్రాంఛైజ్ క్రికెట్లో 30 మ్యాచ్‌లు ఆడిన ఆమె 394 రన్స్ చేసింది. 32 వికెట్లు తీసింది.