Saubhagya Singh Thakur : ఒక పక్క పెట్రోల్, డీజిల్‌ను జాగ్రత్తగా వాడాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు సలహా ఇస్తే.. ప్రజల సంగతేమోగానీ, బీజేపీ నేతలే లెక్కచేయడం లేదు. మధ్యప్రదేశ్‌లో ఒక బీజేపీ నేత ఏకంగా 50 కార్లతో కాన్వాయ్ ఏర్పాటు చేసుకుని, ప్రయాణించాడు. దీంతో మోదీ మాటలను సొంత పార్టీ నేతలే లెక్కచేయడం లేదంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత సౌభాగ్య సింగ్ ఠాకూర్ ఇటీవల ఆ రాష్ట్ర టెక్ట్స్‌బుక్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. దీంతో తనకు పదవి వచ్చిందనే విషయాన్ని గొప్పగా చాటుకోవాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉజ్జయిన్ నుంచి భోపాల్ వరకు ఏకంగా 50 ఎస్‌యూవీలతో కాన్వాయ్ ఏర్పాటు చేశాడు. భారీ హంగు, ఆర్బాటాల మధ్య ఊరేగింపు నిర్వహించాడు. తన అనుచరులతో కలిసి ర్యాలీ నిర్వహించాడు. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వైరల్‌గా మారడంతో అతడి తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే ప్రధాని మోదీ.. చమురును పొదుపుగా వాడాలంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని, కార్ పూలింగ్ చేయాలని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వినియోగించాలని పిలుపునిచ్చారు. చమురును ఎక్కువగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. దీనివల్ల విదేశాల నుంచి చమురు కొనుగోళ్లు తగ్గి, విదేశీ మారక నిల్వలు మిగులుతాయని ప్రధాని అన్నారు.అలాంటిది, మోదీ పార్టీ అయిన బీజేపీ నేత సౌభాగ్య సింగ్ ఠాకూర్.. తన ప్రచారం కోసం అనవసరంగా 50 భారీ వాహనాల్ని వాడటంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.