Madras High Court : తమిళనాడు (Tamil Nadu) నూతన ముఖ్యమంత్రి విజయ్ (Vijay) శాసనసభ (Assembly) లో తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్న వేళ ఒక టీవీకే ఎమ్మెల్యే (TVK MLA) కు మద్రాస్ హైకోర్టు (Madras High Court) షాకిచ్చింది. ఈ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో నెగ్గిన ఆ ఎమ్మెల్యే.. సభలో సీఎం విజయ్ బలపరీక్షలో పాల్గొనవద్దని ఆదేశించింది. ఈ మేరకు న్యాయస్థానం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దాంతో విజయ్ బలపరీక్షలో టీవీకే కూటమి బలం 119 సీట్లకు పడిపోయినట్లయ్యింది.
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో శివగంగై జిల్లా తిరుప్పత్తూర్ నియోజకవర్గం నుంచి టీవీకే నేత శ్రీనివాస సేతుపతి విజయం సాధించారు. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెరియకరుప్పన్‌పై కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో సేతుపతి గెలుపొందారు. డీఎంకే నేత పెరియకరుప్పన్‌కు 83,374 ఓట్లు పోలవగా.. శ్రీనివాస సేతుపతి 83,375 ఓట్లతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఈ ఫలితాలపై డీఎంకే నేత పెరియ కరుప్పన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో పొరపాటు జరిగిందని తన పిటిషన్లో ఆరోపించారు.
ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రక్రియలోనూ అవకతవకలు చోటుచేసుకున్నాయని, కాబట్టి తిరుప్పత్తూర్లో రీకౌంటింగ్ జరపాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అప్పటివరకు శ్రీనివాస సేతుపతి ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పెరియకరుప్పన్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. విజయ్ విశ్వాసపరీక్ష ఓటింగ్‌లో శ్రీనివాస సేతుపతి పాల్గొనవద్దని ఆర్డర్ వేసింది. మద్రాసు హైకోర్టు ఆదేశాలతో బలపరీక్షలో విజయ్‌కు ఒక ఓటు తగ్గినట్లయ్యింది. 234 శాసనసభ స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో విజయ్‌కి కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ కలుపుకుని ప్రస్తుతం 120 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.
అందులో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే బలపరీక్షలో పాల్గొనే అవకాశం లేకపోవడంతో విజయ్ బలం 119కి తగ్గిపోయింది. అయితే విజయ్ బలపరీక్షలో నెగ్గేందుకు మాత్రం ఎలాంటి అవాంతరం లేదు. విజయ్ బలపరీక్షలో నెగ్గడానికి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు సరిపోతుంది. శ్రీనివాస సేతుపతికి బలపరీక్షలో ఓటువేసే అవకాశం లేకపోయియినా.. 119 ఓట్లతో విజయ్ బలపరీక్షలో నెగ్గనున్నారు.