Vijay | తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. వెండితెరపై స్టార్ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విజయ్, ఇప్పుడు రాజకీయ నాయకుడిగానూ అదే స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలకు ఊహించని స్థాయిలో ఆదరణ పెరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తాజా గణాంకాల ప్రకారం, ఎక్స్ వేదికలో తమిళనాడు సీఎంవో అధికారిక ఖాతాను అనుసరించే వారి సంఖ్య ఏకంగా 22 లక్షలకు చేరుకుంది. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే లక్షల సంఖ్యలో కొత్త ఫాలోవర్స్ ఆ ఖాతాను ఫాలో కావడం విశేషంగా మారింది.
ఇక యువత ఎక్కువగా ఉపయోగించే ఇన్స్టాగ్రామ్ వేదికలోనూ ఇదే హవా కొనసాగుతోంది. తమిళనాడు సీఎంవో అధికారిక పేజీని ప్రస్తుతం 16 లక్షల మందికి పైగా అనుసరిస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించే అధికారిక ఖాతాలకు సాధారణంగా ఇంత వేగంగా ఆదరణ రావడం అరుదుగా కనిపిస్తుంది. కానీ విజయ్ ప్రభావంతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విజయ్ అభిమానులు ఇప్పుడు ఆయన సినిమాలకే కాకుండా, రాజకీయ నిర్ణయాలపైనా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, నిర్వహిస్తున్న సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు యువత భారీగా ప్రభుత్వ ఖాతాల వైపు మళ్లుతోంది.
సినిమాల్లో భారీ విజయాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విజయ్, ఇప్పుడు డిజిటల్ వేదికలోనూ తమిళనాడు ప్రభుత్వ ఖాతాలను అగ్రస్థానంలో నిలిపారు. ముఖ్యమంత్రిగా ఆయనకు వస్తున్న స్పందన చూస్తుంటే రాబోయే రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో మరిన్ని రికార్డులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే ప్రజల్లో విపరీతమైన ఆదరణ సంపాదించిన విజయ్, ఇప్పుడు యువతను ప్రభుత్వ వ్యవస్థలతో అనుసంధానం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.