హనుమకొండ, జులై 14 : బీసీలు అందరు ఏకమై నేటి ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల ప్రజాప్రతినిధుల వేదిక ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఛలో హైదరాబాద్ కార్యక్రమ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ బీసీలతో కాంగ్రెస్ ఓట్ల రాజకీయం చేస్తోందని విమర్శించారు.
2023 సాధారణ ఎన్నికల సమయంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీల ఓట్లు దండుకొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కానీ నేడు బీసీల రిజర్వేషన్లు అమలు చేయమంటే మాత్రం నాటకాలు ఆడుతోందని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు బడ్జెట్లో రూ.20 వేల కోట్ల నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన రెండు బడ్జెట్లలో కేవలం 7నుంచి 9 వేల కోట్ల లోపు మాత్రమే కేటాయించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా మోసం చేస్తుందని, కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టేందుకు బీసీలందరూ ఏకమై సమర శంఖం పూరించాలని సూచించారు.
జులై 15 న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన బీసీల మహాధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీసీలందరూ హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సోదా కిరణ్, బీసీ నాయకులు పులి రజినీకాంత్ ముదిరాజ్, నరెడ్ల శ్రీధర్, దూలం వెంకన్న గౌడ్, గండు అశోక్ యాదవ్, మూటిక రాజు యాదవ్, గండ్రకోట రాకేష్ యాదవ్, బుద్దె వెంకన్న పెరుక, పోలపెల్లి రామ్మూర్తి రజక, గుల్లపెల్లి వీరాస్వామి నయీ బ్రాహ్మణ, పబ్బోజు శ్రీకాంత్ చారి, రాజ్ కుమార్, పబ్బతి రాకేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.