హనుమకొండ/వరంగల్, జూలై 3 : కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ప్లాట్ల వేలం పాటలో అవినీతిని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై నిర్బంధకాండ కొనసాగుతున్నది. పోలీసులను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ సర్కారు వారిని అరెస్టులు చేయిస్తున్నది. ప్రభుత్వ భూముల అమ్మకంలో రూ. 50 కోట్ల అక్రమాలపై ప్రశ్నించిన ప్రభుత్వ మాజీ చీఫ్ దాస్యం వినయ్‌భాస్కర్, కుడా మాజీ చైర్మన్ యాదవరెడ్డిని అడ్డుకున్నది. దాస్యంను ఓ హోటల్ వద్ద నిర్బంధించగా, తడిబట్టలతో భద్రకాళీ అమ్మవారి ఎదుట ప్రమాణానికి వెళ్లిన కుడా మాజీ చైర్మన్ యాదవరెడ్డిని అరెస్ట్ చేసి అధికార పార్టీ ముఖం చాటేసింది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి వెళ్లగా వాగ్వాదం, తోపులాట జరిగి ఉద్రిక్తత చోటుచేసుకున్నది.
హనుమకొండ అశోకా హోటల్ వద్ద శుక్రవారం ఉదయం హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తమ బంధువులను కలిసేందుకు అక్కడికి వచ్చిన మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌ను పోలీసులు సుమారు గంటకుపైగా నిర్బందించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణు లు అక్కడికి చేరుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కుడా భూముల వేలం పాట విషయంలో సవాల్ చేసిన సన్నాసులు అధికార మదంతో అక్ర మాలకు పాల్పడుతూ వాటిని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నా రని అన్నారు. అక్రమ అరెస్ట్‌లతో ప్రజా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
గజానికి సుమారు రూ. 1.50 లక్షలు పలికే భూమిని సిండికేట్‌గా మారి ఇతరులు ఎవ్వరని వేలంలో పాల్గొననీయకుండా రూ.60 వేల నుంచి రూ.65 వేలకే అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు. ఫార్మాసిస్టులు, డాక్టర్లు, ఎన్నారైలను బెదిరించి వేలం పాడకుండా కాంగ్రెస్ గూండాలు అడ్డగించారన్నారు. అక్రమాలు జరుగలేదని చెప్తున్న ప్రభుత్వం వెంటనే వేలాన్ని రద్దు చేసి ఆన్లైన్ విధానంలో మళ్లీ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అంబేదర్ రాజ్యాంగం కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీ తి పెరిగిందని ఆరోపించారు. అన్యాయం ఎకడ జరిగినా అకడ బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాడేందుకు సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.
భద్రకాళీ ఆలయం వద్ద ఉద్రిక్తత
కుడా ప్లాట్లలో అవినీతి జరిగిందని భద్రకాళీ అమ్మవారి ముందు తడిబట్టలతో ప్రమాణం చేసి సాక్ష్యాలతో నిరూపించేందుకు మర్రి యాదవరెడ్డి రావడం ఉద్రిక్తతకు దారితీసింది. భద్రకాళీ ఆలయ ప్రాంగణంలో బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగి తోపులాటలు జరిగాయి. చివరికి మర్రి యాదవరెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి మట్టెవాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తర్వాత కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి పెద్ద కాన్వాయ్‌తో ఆలయాని వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి హంగామా చేయడం గమనార్హం. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, బీఆర్ఎస్ నాయకులు కంజర్ల మనోజ్‌కుమార్, కొడకండ్ల సదాంత్, రాచర్ల రాము, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా యాదవరెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు పిరికిపందల్లా ముఖం చాటేశారని అన్నా రు.
జూన్ 21న నిర్వహించిన కుడా ఆధ్వర్యంలో నిర్వహించిన బాలసముద్రంలోని విలువైన కమర్షియల్ ప్లాట్ల వేలం పాటలలో రూ. 50 కోట్ల అవినీతి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి కనుసన్నల్లో జరిగిందని ఆరోపించారు. ప్లాట్లు తక్కువ ధరకు కొనుగోలు చేసిన వారి నుంచి గజానికి రూ. 20 వేల అదనంగా తీసుకున్నారని ఆయన ఆరోపించారు. కుడా నిర్ణయించిన ధర 65 వేలకు వెయ్యి, రెండు వేలు పెంచి 8 ప్లాట్లు దక్కించు కున్నారని అన్నారు. వాస్తవంగా గజం ధర రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు పలుకుతుంటే తక్కువ ధరకు ప్లాట్లు విక్రయించి ప్రభుత్వ సొమ్మును దోచుకున్నారని ధ్వజమెత్తారు. మున్సిపల్ శాఖ మంత్రి కూడా అయిన సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే కుడా ప్లాట్ల వేలంను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.