టొరాంటో: తన అద్భుత కెరీర్లో లోటుగా ఉన్న ఫిఫా ప్రపంచకప్‌ను సాధించే చివరి ప్రయత్నంలో ఉన్న పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అందుకు మరో అడుగు ముందుకేశాడు. తన ఫామ్‌ను కొనసాగిస్తూ పెనాల్టీ కిక్కు రొనాల్డో చేసిన గోల్.. ఆ జట్టు మరో స్టార్ ప్లేయర్ గొంకాలో రామోస్ హెడర్.. ఆఖర్లో క్రొయేషియా చేసిన గోల్ ఆఫ్‌సైడ్‌గా తేలడం పోర్చుగల్‌ను ప్రిక్వార్టర్ ఫైనల్ చేర్చాయి. గురువారం అర్ధరాత్రి ఉత్కంఠగా జరిగిన రౌండ్ ఆఫ్ -32 మ్యాచ్‌లో పోర్చుగల్ 2-1తో క్రొయేషియాను ఓడించి ముందంజ వేసింది. ఫలితంగా 41 ఏండ్ల రొనాల్డో తన ఆరో వరల్డ్‌కప్‌లో మరో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవగా.. అనూహ్య పరాజయంతో క్రొయేషియా దిగ్గజం లూకా మోడ్రిచ్ తన ఐదో ఫిఫా టోర్నీని కన్నీళ్లతో ముగించాడు. ఈ హోరాహోరీ పోరులో ఇవాన్ పెరిసిచ్ 53వ నిమిషంలో గోల్ కొట్టి క్రొయేషియాకు తొలి ఆధిక్యం అందించగా.. 68వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను రొనాల్డో గోల్‌గా మలిచాడు. వరల్డ్‌కప్ నాకౌట్ రౌండ్లో తనకు ఇదే తొలి గోల్ కావడం విశేషం. ఇంజూరీ టైమ్‌లో 90+4వ నిమిషంలో రామోస్ పోర్చుగల్‌కు విన్నింగ్ గోల్ అందించాడు. సోమవారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో స్పెయిన్‌తో పోర్చుగల్ తలపడనుంది.
హోరాహోరీ పోరు
గత రెండు వరల్డ్‌కప్స్‌లో ఫైనల్, సెమీఫైనల్ ఆడిన క్రొయేషియా… పోర్చుగల్‌తో నున్వానేనా అన్నట్టు తలపడింది. ఆట ఆరంభం నుంచే ఇరు జట్లూ బంతిపై పట్టు సాధించేందుకు ప్రయత్నించాయి. కానీ, ఫస్టాఫ్‌లో గోల్ కొట్టలేకపోయాయి. విరామం తర్వాత క్రొయేషియా గేరు మార్చింది. నికోలా వ్లావిచ్, స్టానిసిచ్ రైట్ ఫ్లాంక్ నుంచి ఇచ్చిన క్రాస్‌ను పెరిసిచ్ నెట్లోకి పంపడంతో ఆ జట్టు1-0తో నిలిచింది. ఇక్కడి నుంచి క్రొయేషియన్లు మరిన్ని దాడులు చేసినా.. పోర్చుగల్ గోల్ కీపర్ డియోగో కోస్టా ప్రత్యర్థులను సమర్థవంతంగా నిలువరించాడు. కోస్టాను బోల్తా కొట్టిస్తూ పీటర్ సుకిచ్ బంతిని నెట్లోకి పంపించినా రిఫరీ దాన్ని ఆఫ్‌సైడ్‌గా తేల్చాడు. ఈ దశలో వ్లాసిచ్ పోర్చుగల్ ఆటగాడు రెనటో వీగాను బాక్స్‌లో కిందపడేయడంతో వార్ (వీడియో అసిస్టెంట్ రిఫరీ) రివ్యూ తర్వాత రిఫరీ పెనాల్టీ ఇచ్చాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న రొనాల్డో కూల్‌గా గోల్ చేసి స్కోరు సమం చేశాడు. ఇక్కడి నుంచి క్రొయేషియా ఫార్వర్డ్స్ వరుస దాడులు చేశారు. కొన్నింటిని కోస్టా అడ్డుకోగా.. 80వ నిమిషంలో పీటర్ సుకిచ్ చేసిన గోల్‌ను రిఫరీ ఆఫ్‌సైడ్‌గా తేల్చాడు. నిర్ణీత సమయంలో ఇరు జట్లూ 1-1తో నిలవగా.. ఇంజూరీ టైమ్‌లో పోర్చుగల్ మళ్లీ జోరు పెంచింది. 94వ నిమిషంలో లియో అందించిన క్రాస్‌ను రమోస్ హెడర్‌తో నెట్లోకి కొట్టి 2-1తో ఆధిక్యం అందించడంతో గెలుపు ఖాయం అనుకొని ఆ జట్టు ఆటగాళ్లంతా సంబరాల్లో ముగినిపోయారు.
ఆఖరి గోల్‌పై గోలగోల

ఆటలో అసలు డ్రామా చివరి నిమిషాల్లోనే మొదలైంది. రామోస్ గోల్ చేసిన కాసేపటికే 103వ నిమిషంలో పోర్చుగల్ బాక్స్‌లో మరియో పసాలిచ్ అందించిన పాస్‌ను జొస్కో గ్వర్డియోల్ నెట్లోకి పంపడంతో స్కోరు 2-2తో సమం అయింది. రొనాల్డో ముఖంలో నిరాశ కనిపించగా.. క్రొయేషియా ఆటగాళ్లు, స్టేడియంలోని ఆ జట్టు అభిమానులంతా పూనకాలు వచ్చినట్టు ఊగిపోయారు. కానీ, క్షణాల్లోనే వారి ఆనందం ఆవిరైంది.రెండున్నర నిమిషాల వార్ రివ్యూ తర్వాత పసాలిచ్ ఆఫ్‌సైడ్ పొజిషన్లో ఉన్నట్టు గుర్తించిన రిఫరీ ఈ గోల్‌ను రద్దు చేశాడు. ఆ జట్టు ప్లేయర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేయగా.. భారీ సంఖ్యలో క్రొయేషియా ఫ్యాన్స్ గ్రౌండ్లోకి వాటర్ బాటిళ్లను విసిరేయడంతో ఆటకు కాసేపు ఆటంకం కలిగింది. తిరిగి మొదలయ్యాక చివరి నిమిషాల్లో ఆధిక్యాన్ని కాపాడుకున్న రొనాల్డోసేన ప్రిక్వార్టర్స్‌లో అడుగు పెట్టింది. వార్ సమీక్ష క్రొయేషియాకు గుండెకోత మిగల్చడం ఇదే తొలిసారి కాదు. 2018 ఫైనల్లోనూ ‘వార్’ ఆ జట్టును దెబ్బకొట్టింది. నాడు ఫ్రాన్స్‌తో ఫైనల్లో ఇవాన్ పెరిసిచ్ బంతిని చేతితో తాకాడని వార్ సమీక్ష తర్వాత రిఫరీ 38వ నిమిషంలో ఫ్రాన్స్‌కు స్పాట్ కిక్ ఇవ్వడం అత్యంత వివాదాస్పద పెనాల్టీ నిర్ణయం అయింది.