హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ పాలనలో ఓ వెలుగు వెలిగిన సింగరేణి సంస్థ కాంగ్రెస్ పాలనలో స్కామ్‌లతో సర్వనాశనమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. గురువారం ఆయన తెలంగాణభవన్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పార్టీ నేత అబ్రార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆరోపణలు చేసిన రెండు నెలల తర్వాత సింగరేణి వ్యవహారంపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క స్పందించడం సంతోషకరమని పేర్కొన్నారు. కానీ, హరీశ్‌రావు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా పొంతనలేకుండా మాట్లాడి తప్పించుకొనే ప్రయ త్నం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల జోక్యంతో నిర్వీర్యమవుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. సంస్థ పరిస్థితిని చూసి కార్మికులు, ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరిట వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. ‘మైనస్ 12తో రూ.600 కోట్లతో ఓపీసీ-3 మైల్ టెండర్‌ను పిలిచారు.. కానీ కేసీఆర్ హాయాంలో 22 శాతం ప్లస్‌కు పిలిచార’ని స్పష్టంచేశారు.
సింగరేణిలో స్కామ్‌లపై హరీశ్‌రావు గొంతెత్తిన తర్వాతే నైని బ్లాక్ టెండర్‌ను రద్దుచేశారని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కానీ, సైట్ విజిట్ సర్టిఫికెట్ ముసుగులో దాఖలు చేసిన మిగిలిన తొమ్మిది టెండర్లను ఎందుకు రద్దుచేయలేదని ప్రశ్నించారు. శ్రీరాంపూర్ టెండర్ మైనస్ 10 శాతానికి వెళ్లడంలోని మతలబేంటని నిలదీశారు. ఈ టెండర్ల వ్యవహారంలో రూ.300 కోట్ల నష్టంజరిగిందని ఆరోపించారు. సింగరేణి స్కామ్‌లతోపాటు సోలార్ కుంభకోణానికి సైతం కాంగ్రెస్ పెద్దలు తెరలేపారని దుయ్యబట్టారు. ఒక్కో మెగావాట్‌కు రూ.4 కోట్ల నష్టం జరిగిందని వివరించారు.
రాజస్థాన్ సర్కార్‌తో రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్ ఒప్పందం ఎందుకు చేసుకున్నది? పాకిస్థాన్ సరిహద్దుల్లో 1400 మెగావాట్ల పవర్‌ప్లాంట్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? 42 లక్షల టన్నుల బొగ్గు ఎక్కడికిపోయింది? అని ప్రశ్నించారు. హరీశ్‌రావు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే బొగ్గు కనపడలేదని పేర్కొన్నారు. ఇందులో రూ.1,600 కోట్ల స్కామ్ జరిగిందని, సీఎం, డిప్యూటీ సీఎం హస్తం ఉన్నదని సంచలన ఆరోపణలు చేశారు. ఈ పరిణామాలపై మాట్లాడిన అధికారులను బదిలీ చేసి బలిపశువులు చేశారని దుయ్యబట్టారు. గురుకుల టెండర్లలో అవినీతి జరిగిందో లేదో మంత్రులు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి అడూరి లక్ష్మణ్ కేసీఆర్‌ను ఉద్దేశించి అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకొనేదిలేదని హెచ్చరించారు.