Dasyam vinay bhaskar | ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, మాజీ శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి, రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, నాయకులు నరెడ్ల శ్రీధర్, పులి రజినీకాంత్, కొడకండ్ల సదాంత్, రమేష్‌తో కలిసి హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు సోమవారం సాయంత్రం వెళ్లి కమిషనర్ సన్ ప్రీత్ సింగ్‌ను కలిశారు.
ఈ సందర్భంగా సీపీఐ వంద సంవత్సరాల బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రోజున ఖమ్మంలో జరిగిన సీపీఐ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలు కూల్చాలని అనడాన్ని యావత్ తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ 14 సంవత్సరాలు అలుపెరుగని ఉద్యమం, పోరాటం చేసిందని గుర్తు చేశారు. తొమ్మిదిన్నర సంవత్సరాలల్లో బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు. తెలంగాణను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి కక్ష పెంచుకున్నాడని విమర్శించారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి తెలంగాణ ప్రజలను ఏకం చేసిన ఘనత కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని తెలిపారు.
ఆకాంక్షల పాలన బీఆర్ఎస్దని, రాక్షస పాలన కాంగ్రెస్‌ది అని విమర్శించారు తెలంగాణలో ఏ ఒక్క దిమ్మె కూలినా మహిమ గల మహబూబాబాద్ రాళ్లతో కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ప్రజలను డైవర్ట్ చేయడం మాని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఇచ్చిన హామీలను అమలు చేశావా.. ?
మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన, ప్రతీకార పాలన సాగుతోందని అన్నారు రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ సభలో పాల్గొని మతిభ్రమించి మాట్లాడారని విమర్శించారు. తెలంగాణ పార్టీ గద్దెలు కూలుతాయంటే కాంగ్రెస్ పార్టీ మనుగడే ఉండదని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పనితనం ఏందో తెలుస్తదని అన్నారు. సమ్మక్క సారక్కల మీద ప్రమాణం చేసే ఇచ్చిన హామీలను అమలు చేశావా.. అని ప్రశ్నించారు. రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించామని అన్నారు.
తెలంగాణ ఉద్యమ పార్టీ గద్దెలు కూలగొట్టామని.. కాంగ్రెస్ నాయకులకు చెప్పి రెచ్చగొడుతున్నావా అని ప్రశ్నించారు. రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలలో ఏ ఒక్క వర్గానికి మేలు చేయలేదని విమర్శించారు. 420 హామీలు, 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Anti Biotics | యాంటీ బయోటిక్స్ వాడితే.. పేగుల ఆరోగ్యాన్ని ఇలా రక్షించుకోండి..!
Mirai | టీవీ ప్రీమియర్‌కు సిద్ధమైన బ్లాక్‌బస్టర్ ‘మిరాయ్’… ఈ నెలలోనే స్టార్ మా లో సందడి
Bhadradri Kothagudem : ‘గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు’