Anti Biotics | భారతదేశంలో యాంటీబయాటిక్స్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా చాలా మందిలో సాధారణ జలుబు వస్తూ ఉంటుంది. ఇది పిల్లల నుండి పెద్దల వరకు అందరిని ప్రభావితం చేస్తుంది. జలుబు త్వరగా తగ్గాలని దాని లక్షణాల నుండి త్వరగా బయటపడాలని చాలా మంది యాంటీబయాటిక్స్ ను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆధునిక వైద్యంలో యాంటీ బయాటిక్స్ మూలస్తంభం అయినప్పటికీ సాధారణ జలుబు వంటి వాటికి వీడిని వాడడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. వీటిని ఎక్కువగా వాడడం వల్ల పేగు ఆరోగ్యం గణనీయంగా దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధికంగా యాంటీబయాటిక్స్ ను తీసుకోవడం వల్ల పేగుల్లో ఉండే జీర్ణక్రియ, పోషకాల శోషణ, రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా కూడా నశిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
యాంటీబయాటిక్స్ హానికరమైన బ్యాక్టీరియాతో పాటు మేలు చేసే బ్యాక్టీరియాను కూడా నశింపజేస్తాయి. ఇది డిస్బయోసిస్ అని పిలువబడే అసమతుల్యతకు దారి తీస్తుంది. దీని వల్ల విరేచనాలు, ఉబ్బరం వంటి జీర్ణశయాంతర సమస్యలు కూడా తలెత్తుతాయి. మైక్రోబయోమ్ దాని ఆరోగ్యకరమైన సమతుల్యతను తిరిగి స్థాపించడానికి ప్రయత్నించే సమయంలో ఇన్పెక్షన్లకు గురయ్యే అవకాశం పెరుగుతుంది. అందుకే సాధారణ జలుబుకు యాంటీబయాటిక్స్ తీసుకున్న తరువాత చాలా మందికి కడుపు నొప్పి వస్తుంది. గట్ ఆరోగ్యంపై యాంటీ బయోటిక్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియా తగ్గినప్పుడు గట్ లోపల ఉండవల్సిన పదార్థాలు రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. దీంతో ఇన్పెక్షన్లతో పాటు ఇతర వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది.
కనుక సాధారణ జలుబు వంటి వాటికి యాంటీబయోటిక్స్ ను వాడకపోవడమే మంచిది. ఒకవేళ యాంటీబయోటిక్స్ వాడినప్పటికి వాటిని వాడిన తరువాత పేగు ఆరోగ్యాన్ని పునరుద్దరించడం కూడా చాలా అవసరం. యాంటీబయోటిక్స్ వాడిన తరువాత పేగు ఆరోగ్యాన్ని పునరుద్దరించే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోబయోటిక్స్ తీసుకోవడం వల్ల పేగుల్లో ఉండే ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను తిరిగి నింపవచ్చు. లాక్టోబాసిల్లస్, బిఫిడోబాక్టీరియం వంటి జాతులు ఉండే పెరుగు వంటి ఆహారాలను తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు సూక్ష్మజీవుల సమతుల్యత పునరుద్దరించబడుతుంది.
వెల్లుల్లి, ఉల్లిపాయలు, అరటిపండ్లు వంటి ప్రీ బయోటిక్స్ ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఇవి పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు ఉండే సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి పేగు ఆరోగ్యంతో పాటు మొత్తం ఆరోగ్యానికి దోహదపడతాయి. అలాగే పేగుల లోపలి పొరను నిర్వహించడానికి నీటిని అధికంగా తాగాలి. అధిక చక్కెరలు, ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం తగ్గించాలి. ఇవి హానికారక బ్యాక్టీరియ పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. యాంటీబయోటిక్స్ సరిగ్గా ఉపయోగించకపోతే పేగు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కనుక వాటిని వైద్యులు సూచించినప్పుడు వాడడమే మంచిది.