హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేతిలో రాష్ట్ర ఎన్నికల సంఘం తోలుబొమ్మలా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. షెడ్యూల్‌కు, నోటిఫికేషన్‌కు మధ్య ఒక రోజు కూడా గడువు ఇవ్వకుండా ఇంత హడావుడిగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా ఉండే మేడారం జాతరను సైతం రాష్ట్ర ఎన్నికల సంఘం విస్మరించిందని ఆవేదన వ్యక్తంచేశారు. కోట్లాది మంది భక్తులు మేడారం వెళ్లే సమయంలో ఎన్నికలు నిర్వహించడమా? ఇది ప్రజల విశ్వాసాలను దెబ్బతీయడం కాదా? అని సూటిగా ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షకుడిగా గవర్నర్ ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని ఈ సందర్భంగా శ్రవణ్ విజ్ఞప్తి చేశారు.
రవీంద్రభారతి, జనవరి 28 : రాష్ట్రంలోని బీసీలను మోసగించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో 15 బీసీ కులసంఘాల సమావేశం, బీసీ సంక్షేమ సంఘం కో ఆర్డినేటర్ ర్యాగ అరుణ్‌కుమార్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించి రూ.3వేల కోట్ల సాకుతో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి బీసీలను దగా చేసిందని, కోర్టు తీర్పు బీసీలకు అనుకూలంగా వస్తుందని భావించే హడావుడిగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయించి మరోసారి బీసీలను మోసగించారని మండిపడ్డారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 28శాతం ఇచ్చి బీసీ వ్యతిరేకిగా ముద్ర వేసుకున్నదని పేర్కొన్నారు. 2028లో బీసీలంతా ఏకమై కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడించి ఆ పార్టీని బంగాళాఖాతంలోకి విసిరేయడం ఖాయమని హెచ్చరించారు. అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుం డా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నయవంచనకు గురిచేసిందని ధ్వజమెత్తారు. సమావేశంలో బీసీ నేతలు గుజ్జ సత్యం, నీల వెంకటేశ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.