హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో అనేక కుంభకోణాలకు పాల్పడిందని, ఇప్పుడు ఎక్సైజ్‌శాఖలో మరో స్కామ్‌కు తెరలేపిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు చెప్పారు. రాష్ట్రంలో మైక్రో బ్రూవరీస్ పేరుతో రేవంత్‌రెడ్డి సర్కార్ సుమారు రూ.50 కోట్ల ఎక్సైజ్ కుంభకోణానికి స్కెచ్ వేసిందని ఆరోపించారు. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన మద్యం సొమ్మును ప్రభుత్వ పెద్దలే తిలా పాపం తలా పెగ్గులా పంచుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో బుధవారం మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో మైక్రో బ్రూవరీలు ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా, దీనికి రాష్ట్రవ్యాప్తంగా 110 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. వీటిలో తొలుత 25 మందికి ఇవ్వాలని నిర్ణయించారని, ఇందులో ముఖ్య నేత కోటా 21, మంత్రి కోటా నాలుగుగా డిసైడ్ చేశారని తెలిపారు. ముఖ్యనేతకు తోడూనీడగా ఉంటూ, ఆయన ఇంట్లోకి కారు నేరుగా వెళ్లే వ్యక్తి.. ఇటీవల వైకుంఠ ఏకాదశికి తిరుపతికి వెళ్తే ముఖ్యనేతకు ఆయన నీడగా ఉన్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఒక్కో బ్రూవరీకి రూ.1.80 కోట్లుగా ధర నిర్ణయించారని, ఇందులో ముఖ్యనేత తోడునీడకు రూ.1.50 కోట్లు కాగా, మిగతా రూ.30 లక్షలు మాత్రం మంత్రికి కేటాయించాలని డిసైడ్ అయ్యారని విమర్శించారు. బ్రూవరీల ఫీజు కాకుండానే ఇలా సుమారు రూ.50 కోట్లు అక్రమంగా వస్తున్నట్టు చెప్పారు. వైన్స్‌కు అత్యధిక దరఖాస్తులు వస్తే లక్కీ డ్రా తీస్తున్న తరహాలోనే మైక్రో బ్రూవరీలను పారదర్శకంగా ఏర్పాటుచేయాలి తప్ప ప్రభుత్వ పెద్దలు మద్యం సొమ్మును వాటాలు వేసుకొని పంచుకోవడం ఏమిటని హరీశ్‌రావు ప్రశ్నించారు.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా లికర్ సరఫరా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4.500 కోట్లు బకాయి పడిందని హరీశ్‌రావు విమర్శించారు. కొన్ని బకాయిలు 16 నెలలకుపైగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు 1-2 నెలలకు మించి బకాయిలు లేవని, బీఆర్ఎస్ హయాంలో 80 శాతం బిల్లులు తక్షణమే చెల్లించామని గుర్తుచేశారు. పెండింగ్ బిల్లుల కారణంగా మద్యం సరఫరా సంస్థలు బ్రీజర్ సరఫరాను నిలిపివేశాయని చెప్పారు. చాలా షాపుల్లో ఇప్పుడు ఆ సరుకు దొరకడం లేదని అన్నారు. ఇతర మల్టీనేషనల్ కంపెనీలు కూడా తమ బకాయిలు తక్షణమే చెల్లించకపోతే మద్యం సరఫరాను నిలిపివేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ లేఖలు రాసినట్టు, ఈ మెయిల్ పెట్టినట్టు వివరించారు. వాటాలు, పంపకాల్లో తేడాతోనే బిల్లుల చెల్లింపులు ఆగిపోతున్నాయని ఆరోపించారు. రానున్న రోజుల్లో మరికొన్ని బ్రాండ్స్ నిలిపివేసే పరిస్థితి ఉన్నదని, ఫలితంగా రాష్ర్టానికి మద్యం ఆదాయం దెబ్బతినే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు. ఇప్పటికే హోలోగ్రామ్ టెండర్ల విషయంలో తన అల్లుడికి కావాలని ముఖ్యనేత, తన కుమారుడికి కావాలని మంత్రి పట్టుబట్టారని, వీరిద్దరి మధ్య కొట్లాటలతో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి బలిపశువుగా మారారని తెలిపారు. వీరితో పోరు పడలేక సదరు అధికారి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి వెళ్లిపోయారని గుర్తుచేశారు.

ఈ ప్రభుత్వం బీరు కంపెనీలకు ఇచ్చిన ప్రాధాన్యం రైతులకు ఇవ్వడం లేదని హరీశ్‌రావు విమర్శించారు. మీకు బీరు కంపెనీలు ముఖ్యమా… రైతులు ముఖ్యమా అంటే బీరు కంపెనీలే ముఖ్యమని చెప్తున్నదని మండిపడ్డారు. మెదక్ జిల్లా సింగూరు డ్యామ్ రిపేర్ పేరు మీద రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సంగారెడ్డి జిల్లాలో సింగూరు ప్రాజెక్టు కింద 40 వేల ఎకరాలకు, మెదక్ జిల్లా ఘనపూర్ ఆయకట్టు కింద 30 వేల ఎకరాలకు ఈ వేసవిలో క్రాప్ హాలిడే ప్రకటించారని మండిపడ్డారు. కానీ, సంగారెడ్డి జిల్లాలో ఉన్న పదుల సంఖ్యలోని బీరు తయరీ కంపెనీలకు మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరం నీటి సరఫరా చేస్తున్నారని విమర్శించారు. ఆబారీశాఖ స్పెషల్ సీఎస్ ఇటీవల సంగారెడ్డి జిల్లాకు వెళ్లి నీటిపారుదలశాఖ అధికారులతో సమావేశమై రైతులకు నీటి సరఫరా నిలిపివేయాలని, బీరు కంపెనీలకు నీటి కొరత రాకుండా చూడాలని ఆదేశాలు ఇవ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. బీరు కంపెనీల కోసం సింగూరు నీళ్లు నిల్వచేసి సరఫరా చేస్తున్న సర్కార్.. రైతులకు మాత్రం క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది మద్యం తయారుదారు ప్రభుత్వమా? లేదా రైతు ప్రభుత్వమా? అని ప్రశ్నించారు. రేవంత్ సర్కారు చర్యలను బట్టి చూస్తే ఇది బీరు కంపెనీలకు కొమ్ముకాసే ప్రభుత్వమని తేటతెల్లం అవుతున్నదని విమర్శించారు.
కేసీఆర్ హయాంలో తాడిచెట్టు మీద నుంచి పడి వికలాంగులైన గౌడ కులస్తులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించామని హరీశ్‌రావు గుర్తుచేశారు. తాము అధికారంలోకి వస్తే పరిహారం రూ.10 లక్షలు ఇస్తామని నమ్మబలికిన రేవంత్ సర్కార్ ఇప్పటివరకు పది రూపాయల పరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండేండ్లలో 850 మంది గౌడలు తాడిచెట్టుపై నుంచి మరణించడం, వికలాంగులు కావడం జరిగిందని తెలిపారు. వారికి పరిహారంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ గత రెండేండ్లలో అక్రమ కేసులు పెట్టి వందల మంది గౌడన్నలను జైళ్లకు పంపించిందని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడలో 2024 అక్టోబర్ నెలలో గౌడ కులస్తులను కలిసి ‘రేపటిలోగా’ మొత్తం బకాయిలు చెల్లిస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. రేవంత్ హామీ ఇచ్చి 15 నెలలు అవుతున్నా రూపాయి కూడా మంజూరు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ర్టాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చిందని, గల్లీగల్లీకి బెల్ట్‌షాపులు పెట్టిందని ఆరోపించారు. రెండేండ్లలో మద్యం ద్వారా రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని పెంచుకున్నదని విమర్శించారు. మహిళలకు మహాలక్ష్మీ ఇవ్వలేదు. తులం బంగారం ఇవ్వలేదు. కానీ, రాష్ర్టాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చి మహిళలకు మాంగళ్యాన్ని మాత్రం దూరం చేస్తున్నది’ అని మండిపడ్డారు.