వరంగల్, జనవరి 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ సర్కార్ ‘పుర’పోరు సైరన్‌కు బీఆర్ఎస్ బస్తీమే గులాల్ అంటున్నది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన స్ఫూర్తితో బల్దియాలో జయకేతనం ఎగురవేస్తామనే ధీమాతో కార్యాచరణ రూపొందించుకున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు అటు తెలంగాణ భవన్ కేంద్రంగా, ఇటు మున్సిపాలిటీల వారీగా క్షేత్రస్థాయి పోరుకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఆయా పురపాలక సంఘాల మాజీ చైర్మన్లు, ఆయా మున్సిపాలిటీల పరిధిలోని రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులతో విస్తృత సమాలోచనలు జరిపారు. ఎన్నికల్లో స్థానిక పరిస్థితులకనుగుణంగా బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేశారు. ఇటీవల పార్టీ గుర్తులేని సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచకాలు, అక్రమాలను ఎదుర్కొని నిలిచి గెలిచి సత్తాచాటిన బీఆర్ఎస్ శ్రేణుల పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అజేయ ఎజెండాను ఖరారు చేశారు. బీఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ, కేసీఆర్ పాలనలో పురోగమించిన మున్సిపాలిటీలు, దేశవ్యాప్తంగా తెలంగాణకు కీర్తితెచ్చిన పట్టణప్రగతి వంటి కార్యక్రమాలు ఓ వైపు.. రెండేండ్లుగా రేవంత్ సర్కార్ హైడ్రా కూల్చివేతలు, పట్టణ ప్రజలకు శాపంగా మారిన వైనాన్ని ప్రజలకు ఎలా వివరించాలి అనే స్పష్టత వచ్చిన నేపథ్యంలో గులాబీ శ్రేణులు ఉద్యమస్ఫూర్తితో పోరుకు సిద్ధమయ్యారు.
ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, అడ్డదారులు తొకినా రాష్ట్రవ్యాప్తంగా 45శాతం గ్రామ పం చాయతీల్లో బీఆర్ఎస్ సత్తాచాటింది. రేవం త్ సర్కార్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం మారుతున్నదనేందుకు జీపీ ఫలితాలే సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు బీఆర్ఎస్వైపు చూస్తున్నారని, మున్సిపల్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అనూహ్య విజయాలను సొంతం చేసుకుంటుందనే ఆశాభావం సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
రాష్ట్రంలో రెండేండ్లుగా రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ‘పుర’పాలనా వ్యవస్థను ఎలా కుప్పకూల్చిందనే విషయాన్ని ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఆదర్శంగా మారిన మున్సిపాలిటీలు రెండేండ్ల రేవంత్ పాలనలో ఎలా నిరాదరణకు గురయ్యాయో ప్రజలకు వివరించాలని, ప్రత్యేక ప్రచార కార్యాచరణ రూపొందించుకోవాలని సూచిస్తున్నది. పారిశుధ్యం నుంచి వీధి దీపాల దాకా అన్ని అం శాల్లో కాంగ్రెస్ చేతులెత్తేసిందనే విషయాన్ని ఇంటింటీకి తీసుకెళ్లాలని, రేవంత్ పాలనలో పట్టణాల్లో కొత్తగా ఒక రూపాయి కూడా ఖర్చు చేయలేదని, మున్సిపాలిటీలు సమస్యలకు కేరాఫ్‌గా మారిన దుస్థితిని ప్రచారాస్త్రంగా ప్రయోగించనున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇటీవలి దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో గత బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులకు రేవంత్ సర్కార్ తిరిగి శిలాఫలకాలు వేస్తున్న తీరును కూడా బీఆర్ఎస్ ఎత్తిచూపుతున్నది.
కేసీఆర్ హయాంలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో రాష్ట్రంలోని మున్సిపాలిటీల రూపురేఖలు మారిపోయాయి. మున్సిపాలిటీలన్నీ రాష్ట్ర ప్రగతికి గ్రోత్ ఇంజిన్లు అయ్యాయి. కానీ, రెండేండ్లుగా మున్సిపాలిటీల్లో నెలకొన్న అధ్వాన పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమైంది. మున్సిపల్ శాఖను సీఎం రేవంత్‌రెడ్డి తన వద్దే పెట్టుకొని, హైదరాబాద్‌లో ప్రయోగించిన హైడ్రానే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు విస్తరిస్తామనే ఆలోచనతో అనుకూల మీడియాలో లీకులు ఇస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కుట్ర కోణాన్ని పట్టణ ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ సమాయత్తం అవుతున్నది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మున్సిపాలిటీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, రెండేండ్లలో ఊసెత్తని విషయాన్ని బీఆర్ఎస్ ఇప్పటికే ప్రజలకు వివరించింది.
జిల్లాలను పునర్వవస్థీకరిస్తామని రేవంత్ సర్కార్ చేసిన ప్రకటన కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకే కాక ఎంతోకాలంగా ఉన్న మున్సిపాలిటీల ఉనికి, వాటి పురోభివృద్ధిపై రాష్ట్రవ్యాప్తంగా అనుమానాలున్నాయి. జనగామ, నారాయణపేట, వనపర్తి, సిద్దిపేట, సిరిసిల్ల, నిర్మల్, ములుగు, మంచిర్యాల వంటి జిల్లాలను రద్దు చేస్తారనే ఆందోళన ప్రజల్లో నెలకొన్నది. బీఆర్ఎస్ హయాంలో కొత్త జిల్లాలు ఏర్పడటమే కాకుండా ఆయా జిల్లాకేంద్రాలన్నీ దాదాపు మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలు పట్టణ ప్రాంత ప్రజలను తీవ్ర గందరగోళంలో పడేశాయి. ఈ తరుణంలో ఇదే అంశాన్ని మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజల్లో విస్తృత చర్చ పెట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.
వరుస చేరికలతో బీఆర్ఎస్ జోష్‌లో ఉండగా, కాంగ్రెస్, బీజేపీలు విలవిల్లాడుతున్నాయి. ఇంకా పదిహేనేండ్లు తమదే అధికారం అని కాంగ్రెస్, తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేననే పోటాపోటీ ప్రకటనలతో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీల నుంచి బీఆర్ఎస్లో చేరికలు ఆ పార్టీల నేతలను నిద్రపోనివ్వడం లేదు. కాంగ్రెస్, బీజేపీలపై రోజురోజుకూ ప్రజల్లో వ్యతిరేకత తీవ్రతరం అవుతున్నదని బీఆర్ఎస్లో చేరికలు స్పష్టం చేస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్లో వరుస చేరికలు ఒక ఎత్తయితే, బీజేపీకి రాజీనామా చేసి తాను బీఆర్ఎస్లో చేరుతానని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రకటించటం వంటి పరిణామాలను ఉదహరిస్తూ తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల ఆశలు గల్లంతే అవుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.