జగిత్యాల, జనవరి 28 : ‘జగిత్యాల మున్సిపాలిటీని ఎమ్మెల్యే ఎం సంజయ్‌కుమార్ భ్రష్టుపట్టిచ్చిండు. అవినీతికి కేంద్రంగా మార్చిండు. ఏసీబీ దాడులు, విజిలెన్స్ విచారణనే ఇందుకు నిదర్శనం. ఉన్నది మాట్లాడితే ఉలిక్కిపడుతున్నడు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మీడియాతో మాట్లాడారు. గత ఐదేండ్ల మున్సిపల్ పాలకవర్గ పదవీ కాలంలో 16 మంది కమిషనర్లు మారిన సందర్భాలు దేశంలోనే ఎక్కడా చూడలేదని అన్నారు. ఎనిమిది మంది ఉద్యోగులు జైలుపాలు కావడం ఎమ్మెల్యే పుణ్యమేనని దుయ్యబట్టారు. ఆయన వేధింపులు తట్టుకోలేకనే మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా చేశారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని పెట్రోల్ బంక్ అక్రమ నిర్మాణాలు తొలగించాలని కోర్టు చెప్పినా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు.
జిల్లా కేంద్రంలో ఎల్ఎల్ గార్డెన్ రోడ్డు నిజామాబాద్ రోడ్డుకు ప్రత్యామ్నాయం అవుతుందని వెంటనే విస్తరించాలని ఏండ్లుగా కోరుతున్నా పట్టించుకోవడం లేదని, పైగా తానే ఆ రోడ్డును అడ్డుకుంటున్నట్టు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు యావర్ రోడ్డును 100 ఫీట్లకు విస్తరించాలని ప్రభుత్వానికి నివేదిస్తే, కాంగ్రెస్‌కు ఎకడ మంచిపేరు వస్తుందోనని తొక్కిపెట్టిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. జగిత్యాలలో ఇంటిగ్రేటెడ్ మారెట్ ప్రారంభించి రెండేండ్లు గడుస్తున్నదని, కాంట్రాక్టర్లకు బిల్లు రాకపోవడంతో వారు గోడౌన్‌గా ఉపయోగించుకుంటున్నట్టు తెలిపారు. జగిత్యాల రాష్ట్రంలోనే అవినీతికి కేంద్రంగా మారిందని ఆరోపించారు. పార్టీ కోసం పదేండ్లు కష్టపడిన కాంగ్రెస్ కార్యకర్తల శ్రమను ఎమ్మెల్యే సంజయ్ దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.