సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): మేము సీబీఐ, ఈడీ నుంచి మాట్లాడుతున్నాం.. మనీలాండరింగ్ కేసులో మీరు నిందితురాలిగా ఉన్నారు.. మిమ్మల్ని అరెస్ట్ చేసేందుకు వస్తున్నాం.. అంటూ బెదిరించిన సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధురాలి వద్ద నుంచి రూ. 31 లక్షలు దోచేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలికి ఫోన్ చేసిన సైబర్‌నేరగాళ్లు.. మేం పోలీసులం, నరేశ్ గోయెల్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మీ పేరుతో ఉన్న కెనెరా బ్యాంకు ఖాతాకు సంబంధించిన ఏటీఎం నుంచి రూ.2 కోట్లు, 40 లావాదేవీలు జరిగినట్టు దర్యాప్తులో తేలిందని చెప్పారు. మిమ్మల్ని అరెస్ట్ చేసేందుకు వస్తున్నామంటూ వీడియో కాల్ చేసి హెచ్చరించారు.
మీరు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరించారు. మీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును తొలుత ఆర్బీఐ ఖాతాలోకి పంపించండి.. ముందుగా మీరు అరెస్ట్ నుంచి బయటపడుతారు.. మీ పాత్ర లేదని తేలితే ఆ డబ్బు మీకు తిరిగి రెండు రోజుల్లో వచ్చేస్తుంది.. అంటూ నమ్మించి బాధితురాలితో రూ. 30,96,500 వివిధ ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నారు.
రెండు రోజుల తర్వాత బాధితురాలు ఫోన్ చేయగా ఎవ్వరూ స్పందించలేదు. దీంతో బాధితురాలు సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.