ఈ సీజన్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు రైతులకు కన్నీళ్లే మిగిల్చాయి. గత నెలలో వానలతో పత్తి, మక్క పంటలు దెబ్బతిన్నాయి. వరి పంటతోనైనా గట్టెక్కుదామకున్న రైతుల ఆశలు మొంథా తుఫాన్‌తో ఆవిరరయ్యాయి. నేడో రేపో కోత లకు సిద్ధంగా వరి చేలు గాలి వానకు నేల వాలాయి. కండ్లముందే దెబ్బతిన్న పంటలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని చూసి అన్నదాతల కన్నీటి పర్యంతమయ్యారు. అప్పులు చేసి పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దస్తురాబాద్/కుభీర్, అక్టోబర్ 31 : మొంథా తుఫాన్ ప్రభావంతో నిర్మల్ జిల్లాలోని రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. ఈదురు గాలులతో కూడిన అకాల వర్షంతో వరి చేలు నేలకొరిగాయి. దస్తురాబాద్ మండలంలోని రేవోజీపేట గ్రామంలో రైతు వంగాల సాయికి చెందిన బంతి పూల తోట దెబ్బతిన్నది.పెట్టిన డబ్బులు సైతం రాలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. రెండు నెలలుగా వరుస వర్షాలతో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కుభీర్ మండలంలో 25,066 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. ఇటీవల ఎడతెరిపి లేని వర్షాలతో పత్తి మొక్కలు ఎర్రబారగా, మరికొన్ని చోట్ల కాయలు మురిగిపోయి రాలిపోయాయి.

మిగిలిన పంటతోనైనా గట్టెక్కుదామనుకున్న రైతులను మొంథా తుఫాను నిండా ముంచింది. మూడు రోజుల పాటు కురిసిన వానలకు పగిలిన కాయల్లోకి నీరు చేరి పత్తి రంగు మారిపోయింది. చేతికి వచ్చిన పంట కూడా నీళ్లపాలయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 నుంచి 12 క్వింటాళ్ల మేర దిగుబడులు రావల్సి ఉండగా కనీసం రెండు నుంచి మూడు క్వింటాళ్లు వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల బాధలను పట్టనట్లు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తడిసి ముద్దయిన పత్తి, రంగు మారిన పత్తిని సీసీఐ ద్వారా ఎలాంటి షరతులు విధించకుండా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని పత్తి రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పది, పన్నెండు క్వింటాళ్ల దిగుబడులు రావాల్సిన పత్తి ఎకరాకు రెండు మూడు క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కష్టాల్లో ఉన్న రైతులకు ఊరట కలిగించే చర్యలు లేవు. రైతులపై కాంగ్రెస్ సర్కారు ఎలాంటి కనికరం చూపడం లేదు. రైతుల ఉసురు తగిలి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నాశనం కావడం ఖాయం. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి షరతులు లేకుండా పత్తిని మద్దతు ధరకు కొనాలి.
-బందెల సత్యనారాయణ, రైతు, పార్డి(కే)