నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 2 : ‘మొంథా తుపాన్ నిండాముంచింది. భారీ వర్షాలతో వరి, పత్తి, మక్కజొన్నతో పాటు కూరగాయ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీగా నష్టం జరిగింది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. తెచ్చిన అప్పులు ఎలా కట్టాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాం. రెండెకరాల్లో వరి సాగు చేస్తే 20 బస్తాల ధాన్యం కూడా వచ్చేటట్లు లేదు. ఇప్పటి వరకు అధికారులెవరూ వచ్చి పరిశీలించలేదు. వరద ఇంట్లోకి వచ్చి సామాన్లన్నీ అక్కరకు రాకుండా పోయాయి. రెండు రోజులు నరకం అనుభవించాం. బయటికి వెళ్లి నిత్యావసర సరుకులు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అధికారులు ఒక్కరోజు అన్నం పెట్టిన్రు. ఇప్పటికీ ఏ సాయం అందలే. సర్కారు ఆదుకోకపోతే బతుకుడు కష్టమే. నష్ట పరిహారం ఇవ్వాల్సిందే’ అని పంట నష్టపోయిన రైతులు, వరద బాధితులు సర్కారును కోరుతున్నారు.
కమలాపూర్ : నాకున్న ఆరెకరాల్లో సన్నరకం వరిసాగు చేశాను. అప్పులు చేసి రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టాను. పంట కోతకొచ్చిన దశలో తుపాన్ విరుచుకుపడింది. భారీ వర్షానికి వాగు ఉప్పొంగడంతో మొత్తం వరి పంట నేలవాలింది. వరిపై ఒండ్రు మట్టి పడింది. పొలంలో ఇసుక మేటలు వేశాయి. ముళ్ల పొలంలో కుప్పులు కుప్పలుగా ఎక్కడికక్కడే ఆగిపోయాయి. వరిపొలం పూర్తిగా అక్కరకు రాకుండా పోయింది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. తుపాన్ నిండా ముంచింది. అధికారులు పారదర్శకంగా సర్వే చేయాలి. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
– కొనుపుల రాంచందర్, రైతు ఉప్పల్
నర్సింహులపేట : ఆరెకరాల్లో వరి పొలం సాగు చేశా. నాటు వేసినప్పటి నుంచి యూరియా బస్తాల కోసం తిప్పలు పడ్డాం. ఏవోను, అధికారులను అడిగి అడిగి కష్టపడి పంట దక్కించుకున్నా. తీరా వడ్లు చేతికొచ్చే సమయంలో మాయదారి తుపాన్ నిండా ముంచింది. ఆకేరు వాగు ఉప్పొంగడంతో రెండు రోజులు పొలం నీటిలో మునిగిపోయింది. రెండు ఎకరాల్లో పొలం పూర్తిగా దెబ్బతిన్నది. దీనికి తోడు మోటర్, స్టార్టర్ వరదలో కొట్టుకుపోయింది. దీంతో రూ.50 వేల వరకు నష్టపోయా. రెండు ఎకరాల పొలంలో 20 బస్తాల వడ్లు కూడా వచ్చే అవకాశం లేదు. గతేడాది నష్టపోతే నయా పైస రాలేదు. ఇప్పుడన్నా ప్రభుత్వం మాకు నష్ట పరిహారం ఇస్తదో.. ఇయ్యదో..
– ఎడ్ల శ్రీనివాస్‌రెడ్డి కౌసల్యదేవిపల్లి
ఐనవోలు : ఇంకో పది రోజులైతే వరి కోసేటోళ్లం. వడ్లు ఇండ్లకు చేరేవి. ఎకరం 30 గుంటల భూమిలో వరి పంట వేశా. పంట మంచిగా వచ్చిందని సంతోషపడ్డాం. కానీ, ఇంతలోనే చేతికొచ్చిన వరి పంట తుపాన్‌తో నీట మునిగింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సుమారుగా రూ.70వేల వరకు ఆదాయం వస్తుందనుకున్నా. కానీ, పండిన పంటంతా నీటి పాలైంది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. పంట మొత్తం నష్టపోయా. రెండేళ్లు ఎనుకకుపోయినట్లు ఉన్నది. ప్రభుత్వం ఎకరాకు కనీసం రూ.50 వేల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
– నిమ్మాని వెంకటేశ్వర్రావు, రైతు. కక్కిరాలపల్లి
దామెర : భారీ వర్షాలతో వరి, పత్తి పంట పూర్తిగా దెబ్బతిన్నది. పత్తి నల్లబారి మట్టిలో పడిపోయింది. వరి పరిస్థితి చెప్పేవిధంగా లేదు. నేలవాలి నీటిలోనే ఉంది. వరి గొలుసుకు ఉండే గింజలు మొలకెత్తుతున్నయి. ఏం చేయాలో తోచడం లేదు. పరిస్థితి అధ్వానంగా తయారైంది. పంటల సాగు కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చేది. వ్యవసాయ అధికారులు పంటల నష్టం చూసేందుకు గ్రామాలకు సరిగా రావడం లేదు. వరి, పత్తి, కూరగాయల పంట లు కోల్పోయిన. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి.
– పాండవుల భిక్షపతి, రైతు, దమ్మన్నపేట
శాయంపేట : మొంథా తుపాన్‌తో ఎకరంన్నర వరి పంట నీటిపాలైంది. భారీ వర్షాలకు స్థానికంగా ఉన్న పెద్ద చెరువు మత్తడి పెరిగి పంట పూర్తిగా నీటిలో మునిగింది. ఇప్పటికే పంట సాగు కో సం రూ. 50 వేలు ఖర్చు చేసిన. వడ్లు చేతికొస్తాయన్న ఆశతో ఉంటే తుపాన్ నిండా ముంచి నష్టం చేసింది. ఇప్పటివరకు అధికారులెవరూ వచ్చి పరిశీలించలేదు. భారీగా నష్టం జరిగింది. అయినా, అధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం చూడకుంటే ఎలా?, రైతులంటే అంత చులకనా? ఎకరాకు రూ.30 వేల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలి.
– అడుప ప్రభాకర్, రైతు, సూరంపేట
భారీ వర్షాలకు పంట పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకొని 4 ఎకరాల్లో వరి పంట, మరో4 ఎకరాలు మక్కజొన్న పంట సాగు చేశాను. బావి కింద వేసిన వరి కోయడానికి సిద్ధంగా ఉంది. మక్కజొన్న కంకులు ఇరిసాం. ఇంతలోనే చెడగొట్టు వాన కుండపోతగా కురవడంతో వరి పంట మొత్తం నీటిలో మునిగిపోయింది. మక్కజొన్న కంకులు తడిసి మొలకలు వచ్చినయి. పంటకు రూ.3 లక్షలకు పైనే వస్తయనుకున్న. ఇప్పుడు పైస కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలి.
– బొల్లం కుమార్ కౌలు, రైతు, గవిచర్ల
సంగెం: మొంథా తుపాన్ వల్ల కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలులకు రెండెకరాల అరటి తోట నేలవాలింది. వారం రోజులైతే అరటి గెలలు కోసేవాడిని. రాకాసి వానతో బతుకు ఆగమైంది. నోటికాడికి వచ్చిన పంట నేలకూలింది. ఒక్కో గెల 45 కిలోల నుంచి 50 కిలోలు బరువు వస్తుంది. కిలోకు రూ.12 చొప్పున విక్రయించేవాళ్లం. రెండెకరాల అరటితోట కనీసం రూ.12 లక్షలు వచ్చేవి. ఇప్పుడంతా తలకిందులైపోయింది. పెట్టిన పెట్టుబడి, చేసిన కష్టం మొత్తం కొట్టుకుపోయింది. ప్రభుత్వం నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలి.
– బానోత్ దేవ్‌సింగ్, రైతు, పల్లార్గూడ
న్యూశాయంపేట : మొంథా తుపాన్ ప్రభావంతో మా ఇంట్లోకి భారీగా వరద నీరు చేరింది. రెండు రోజుల నుంచి నరకం అనుభవిస్తున్నం. బయటికి వెళ్లి నిత్యావసర సరుకులు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇందిరమ్మ కాలనీలో ఉన్న అందరినీ ప్రభుత్వం ఆదుకోవాలి. అధికారులు కాలనీలో సర్వే చేసి, జరిగిన ఆస్తి నష్టాన్ని ప్రభుత్వ పెద్దలకు విన్నవించి ఆదుకోవాలి. లేకుంటే చావే శరణ్యం.
– బోడ రాము, ఇందిరమ్మ కాలనీ,49వ డివిజన్
మడికొండ : తుపాన్ కారణంగా కురిసిన భారీ వర్షంతో నా నాలుగెకరాల వరి నీటిపాలైంది. ఆరుగాలం కష్టపడి.. పంట చేతికొచ్చే ముందు అకాల వర్షం వల్ల పంట నష్టం జరిగింది. అప్పులు చేసి ఎకరానికి రూ. 80 వేలు వరకు పెట్టుబడి పెట్టిన. నాలుగెకరాలు మట్టి కొట్టుకుపోయింది. ఇప్పుడు నాకు జరిగిన నష్టం ఎట్ల తీరాలే. అకాల వర్షంతో రైతులందరం చాలా నష్ట పోయినం. ప్రభుత్వం పరిహారం చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలి.
– బొల్లికొండ లింగయ్య, రైతు, మడికొండ